కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం | Sakshi
Sakshi News home page

కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం

Published Sun, Nov 17 2013 3:18 AM

Krishna Express bomb outrage

 స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందనే సమాచారంతో స్థానిక రైల్వేస్టేషన్‌లో శనివారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉదయం 8 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్‌కు రావాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ దాదాపు గంట నలభై అయిదు నిమిషాల ఆలస్యంగా 9.45కు ఘన్‌పూర్‌కు చేరుకుంది. ఆగేం దుకు వేగం తగ్గిస్తున్న క్రమంలో రైలులో బాంబు ఉందని రైలు చివర గార్డు బోగీ పక్కన బోగీల్లోని ప్రయాణికులు పెద్దఎత్తున కేకలు వేస్తూ రైలు నుంచి దూకారు.
 
 గమనించిన ఇతర బోగీల్లోని ప్రయాణికులు బాంబు భయంతో తమకు చెందిన సామాన్లను రైలులోనే వదిలేసి ఒకరినొకరు తోసుకుంటూ రెండువైపులా దూ కారు. ప్లాట్‌ఫాం కిక్కిరిసిపోగా పలువురు ప్రయాణికులు బయటకు వెళ్లేమార్గం లేక స్టేషన్ ప్రహరీ ఎక్కి దూకారు. ముళ్ల చెట్లు ఉన్నా లెక్కచేయకుండా బాంబు ఉందనే భయంతో చంటిపిల్లలు ఉన్న తల్లులు కూడా పిల్లలతో సహా గోడలు దూకారు. వృద్దులు, పిల్లలు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తలోవైపున ఉరుకులు, పరుగులు పెడుతుండగా భయానక వాతావారణం నెలకొంది.
 
 డాగ్, బాంబు స్క్వాడ్‌ల తనిఖీలు
 
 కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం సమాచారం తెలుసుకున్న స్థానిక సీఐ వెంకటేశ్వరరెడ్డి, ఎస్సై శ్రీనివాస్ హుటాహుటిన సిబ్బందితో స్టేషన్‌కు చేరుకున్నారు. కాజీపేట జీఆర్‌పీ సీఐ రాజగోపాల్, ఎస్సై కరీముల్లా, ఆర్‌పీఎఫ్ ఎస్సై నర్సింహ, బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది, ఘన్‌పూర్ తహసీల్దార్ హరికృష్ణ, ఆర్‌ఐ శ్రీనివాస్ స్టేషన్‌కు చేరుకుని రైలు బోగీలను తనిఖీలు చేశారు. దాదాపు గంటన్నర పాటు తనిఖీలు చేపట్టారు.
 
 కలకలం రేపిన టిఫిన్...
 
 రైలులోని ఒక బోగీలో టిఫిన్ బాక్సు బాంబు స్క్వాడ్‌కు దొరకగా, అది ఎవరిదని పోలీసులు విచారించగా టిఫిన్‌కు సంబంధించిన వారు ఎవ్వరూ లేకపోవడంతో దాదాపు 20 నిమిషాలు అందులో బాంబు ఉందని కలకలం రేగింది. ప్రయాణికులను కాస్త దూరంగా జరిపి ప్లాట్‌ఫారంపై దాన్ని ఉంచి బాంబ్‌స్క్వాడ్ పరిశీలించారు. బాంబు కాదని గుర్తించిన వారు టిఫిన్ తెరిచి చూడగా అన్నం, కూరలు ఉండడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తిస్థాయిలో రైలును తనిఖీ చేసిన పోలీసులు ఎట్టకేలకు 11.15కు కాజీపేట వైపు పంపించారు. అయితే దాదాపు గంటన్నరపాటు బాంబుకలకలంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురికాగా, రైల్వేస్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
 బాంబు బూచీ ఘటనపై కేసు నమోదు
 
 కాజీపేట రూరల్ : కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు బెదిరింపు ఘటనపై కాజీపేట జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆకతాయిలను పట్టుకోవడానికి పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నారు. బాంబు బెదిరింపు ఘటనపై కాజీపేట జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 182, 505, 507 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం రాత్రి కాజీపేట జీఆర్‌పీ సీఐ రాజ్‌గోపాల్ తెలిపారు.
 
 చాలా భయపడ్డాం
 బాంబు కలకలంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాం. బాబుతో సహా మమ్మీ, డాడీతో సికింద్రాబాద్ నుంచి పొన్నూరుకు వెళుతున్నాం. మేం ఏసీ కోచ్‌లో ఉండటంతో రైలు ఆగేవరకు సమాచారం లేదు. పెద్దఎత్తున అరుపులు వినిపించడంతోపాటు రైలు గార్డు వచ్చి బాంబు సమాచారం చెప్పారు. బయటికి చూసేసరికి బాంబు బాంబు అంటూ పరుగెడుతున్న వారిని చూసి మేము కూడా బయటికి దూకాం.     
 - రమ్య, ప్రయాణికురాలు
 
 ఆకతాయిల పనై ఉంటుంది
 బాంబు వదంతులు ఆకతాయిల పనై ఉంటుంది. ఇలాంటి వదంతులతో ప్రయాణికులను ఇబ్బందిపెట్టడంతోపాటు పోలీసుల సమయాన్ని వృధా చేయడం సరి కాదు. విచారణ చేపట్టి ఆకతాయిలపై చర్యలు తీసుకుంటాం.
 - వెంకటేశ్వరరెడ్డి, సీఐ, స్టేషన్‌ఘన్‌పూర్
 

Advertisement
Advertisement