చర్చిద్దాం రండి | Sakshi
Sakshi News home page

చర్చిద్దాం రండి

Published Sun, Oct 26 2014 2:09 AM

krishna river management board invites andhra, telangana for discussions

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తీవ్రమవుతున్న జల విద్యుత్ వివాదాన్ని పరిష్కరించడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు దృష్టి సారించింది. ప్రాజెక్టుల్లో నీటి వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చే యత్నంలో భాగంగా ఈ నెల 29న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఈఎన్‌సీలు, విద్యుత్ శాఖ అధికారులు, బోర్డు సభ్య కార్యదర్శులకు ఆహ్వానాలు పంపింది. ఈ సమావేశంలో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తితో పాటు నాగార్జునసాగర్ నీటి వినియోగంపైనా చర్చించనుంది. భేటీలో ఇరు రాష్ట్రాలు తమ వైఖరులను స్పష్టం చేయనున్నాయి.
 
 జీవోలపై సమీక్ష కోరనున్న రాష్ట్రం..

 శ్రీశైలం ప్రాజెక్టులో జలాలు వినియోగ కనీస మట్టానికి చేరువకానుండటం, జీవో 107ను కాదని 834 అడుగుల వరకూ నీటిని వాడుకుంటామని తెలంగాణ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సమావేశం కీలకం కానుంది. తెలంగాణకు అన్యాయం చేసే రీతిలో జీవో 107ను ముందుకు తెచ్చారని.. తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నా ఆ జీవోతో కనిష్ట నీటి మట్టాలను 834 నుంచి 854 అడుగులకు పెంచారన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. కేవలం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ తాగునీటి అవసరాలు తీర్చేందుకే ఈ జీవో తెచ్చారని తెలంగాణ స్పష్టం చేస్తోంది. మరో జీవో 69లోనూ ప్రోటోకాల్ పేరిట ఎక్కడో ఉన్న చెన్నై నీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చారని.. హైదరాబాద్ తాగు నీటి అవసరాలకు ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చారని, దీనిలో కుట్ర దాగుందని పేర్కొంటోంది. చెన్నై అవసరాల పేరిట తెలుగు గంగ ప్రాజెక్టుకు నీటిని తరలించుకుపోయే ప్రయత్నం జరిగిందని ఆరోపిస్తోంది.
 
 తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే ఈ జీవోలపై సమీక్ష జరగాల్సి ఉందని.. వాటిలో మార్పులు చేయాలని తెలంగాణ పట్టుబట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుత జీవోలను పక్కనపెట్టి కొత్తగా తెలంగాణ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు నీటి ప్రాజెక్టుల పరిధిలోని విద్యుత్ కేంద్రాలపై బోర్డు అజమాయిషీ ఉండాలని, మొత్తం పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని చట్టం మేరకు 54 శాతం విద్యుత్ వాటా తెలంగాణకు దక్కేలా చూడాలని కోరనుంది. అయితే టీ సర్కార్ మౌలికంగా 2 జీవోల్నీ వ్యతిరేకిస్తున్నా... 107 జీవోలో పేర్కొన్న కనీస నీటిమట్టం 854ను లెక్కచేయబోమంటూనే.. 69 జీవోలో పేర్కొన్న కనీస నీటిమట్టం 834ను ప్రామాణికంగా చెప్పడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో బోర్డు ఎలా వ్యవహరిస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా.. బోర్డు సమావేశంలో సీలేరు విద్యుత్ వాటా అంశమూ చర్చకొచ్చే అవకాశముంది. దిగువ సీలే రు ప్రాజెక్టు గోదావరి బోర్డు పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువ చర్చ జరిగే అవకాశం లేదు.
 
 ఎవరు వినియోగిస్తే వారి ఖాతాలోనే..

 తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

 శ్రీశైలం ప్రాజెక్టులో నుంచి తమ అవసరాల కోసం ఏ రాష్ట్రం నీటిని వినియోగించుకుంటే... ఆ రాష్ట్ర కేటాయింపుల్లో భాగంగా ఆ నీటిని పరిగణిస్తామని కృష్ణానదీ యాజమాన్య బోర్డు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తాగు, సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరగాలని సూచించింది. అలా కాకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం ఎక్కువ మొత్తంలో నీటిని వాడుకుంటే భవిష్యత్‌లో సంక్షోభం తప్పదనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తా రాసిన రెండో లేఖ శనివారం ప్రభుత్వానికి చేరింది. 69, 107 జీవోలను అతిక్రమించకుండా ప్రాజెక్టుల నీటి వినియోగంలో సాగు, తాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని గుప్తా ఆ లేఖలో పేర్కొన్నారు. రిజర్వాయర్ల నుంచి నీటి విడుదలకు సంబంధించి రెండు రాష్ట్రాలకు చెందిన ఎస్‌ఈ స్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవాలని, దానికి సంబంధించిన వివరాలను బోర్డుకు అందించాలని సూచించినా.. అది జరగడం లేదని చెప్పారు. అయితే ఈ లేఖపై బోర్డుకు ఎలాంటి ప్రత్యుత్తరం రాసేది లేదని.. 29న జరిగే సమావేశంలోనే అన్ని అంశాలను ప్రస్తావిస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
 

Advertisement
Advertisement