జెండా పండుగకు కర్నూలు ముస్తాబు | Sakshi
Sakshi News home page

జెండా పండుగకు కర్నూలు ముస్తాబు

Published Fri, Aug 15 2014 2:24 AM

జెండా పండుగకు కర్నూలు ముస్తాబు - Sakshi

58 ఏళ్ల తరువాత ఏపీ సర్కారు స్వాతంత్య్ర వేడుకలు
 సాక్షి, కర్నూలు : ఒకనాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని కందనవోలు(కర్నూలు)లో దేశ 68వ స్వాతంత్య్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా నిర్వహించనుంది. 58 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత మరోసారి కర్నూలులో ఆంధ్రప్రదేశ్ అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలు నిర్వహిస్తుండటం విశేషం. చివరగా 1957 గవర్నర్ పాలనలో త్రివేది కర్నూలులో అధికారికంగా జాతీయ జెండాను ఎగురవేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంతో కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్‌కు తరలించారు. సుమారు రూ. 5 కోట్లతో ఏపీఎస్‌పీ బెటాలియన్‌లో స్వాతంత్య్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు.
 
 రాష్ట్ర విభజన తరువాత తొలిగా నవ్యాంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న స్వాతంత్య్ర వేడుకలను కర్నూలు నగరంలో నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రదర్శనకు ప్రభుత్వ శాఖల శకటాలను సిద్ధం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లను రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు, జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్‌పీ రవికృష్ణ, జేసీ కన్నబాబు పర్యవేక్షిస్తున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలు చేరుకున్నారు. టీవీ చానళ్లు, పత్రికా ప్రతినిధులను సీఎం వద్దకు అనుమతించలేదు. దీంతో జర్నలిస్టులంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసినా ఫలితం లేకపోయింది.

Advertisement
Advertisement