Sakshi News home page

జలగలే నయం

Published Wed, May 1 2019 1:06 PM

Kurnool Government Hospital Staff Demanding Money - Sakshi

‘సార్‌..ఈ ఆసుపత్రిలో గర్భిణులను పురుగులను చూసినట్లు చూస్తారు. వైద్యపరీక్షలు, రక్తంతో పాటు తుదకు జ్వరం మాత్రలకు కూడా బయటకే రాస్తారు. రక్తం తెప్పించినా ఎక్కించరు. పెద్ద డాక్టర్‌ వచ్చి తిడితే ఎక్కిస్తున్నారు. అబ్బాయి పుడితే వెయ్యి, అమ్మాయి పుడితే 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. చివరకు బండి(స్ట్రెచ్చర్‌) తోయడానికి రూ.50 నుంచి రూ.100 ఇవ్వాల్సిందే. లేకపోతే పేషెంట్‌ను ఈడ్చి పడేస్తారు’ అంటూ కోడుమూరు మండలం లద్దగిరి గ్రామానికి చెందిన గిడ్డయ్య.. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో ఏళ్ల తరబడి వేళ్లూనుకున్న దుష్ట సంస్కృతి వల్ల రోగులు బేజారెత్తిపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రోగుల కుటుంబీకులు కలెక్టర్‌ను చూడగానే ఆయన వద్దకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. లద్దగిరికి చెందిన గిడ్డయ్య మాట్లాడుతూ.. ‘సార్‌..మాకు మందులు, వైద్యపరీక్షలు, లంచాలు ఇలా అన్నింటికీ కలిపి ఇప్పటికే రూ.10 వేలు ఖర్చయ్యింది. ఇదేమని గట్టిగా మాట్లాడితే బయటకు వెళ్లగొడతారు. దీనికంటే ప్రైవేటు ఆసుపత్రులేనయం. అదే రూ.10వేలు ఖర్చు పెట్టుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆసుపత్రిని మీరైనా సరిదిద్దండయ్యా’ అంటూ వేడుకున్నాడు. తన భార్య సునీతను వారం క్రితం ఆసుపత్రిలో చేర్పించగా.. గత శుక్రవారం సిజేరియన్‌ ద్వారా కాన్పు చేశారని అతను తెలిపాడు. మిగిలిన వారు కూడా కలెక్టర్‌ వద్దకు వెళ్లి ప్రసూతి విభాగంలో వసూళ్ల బాగోతం గురించి పూసగుచ్చినట్లు చెప్పారు. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహించిన కలెక్టర్‌... ‘ఏంటిది?’ అంటూ  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ వైపు చూశారు. 

ప్రతి దానికీ డబ్బే
పెద్దాసుపత్రి ప్రసూతి విభాగంలో గర్భిణుల బాధలు వర్ణనాతీతం. పేరుకు కొత్త భవనమే గానీ అందులోని పాత విధానాలు మాత్రం మారలేదు. ఎప్పటిలాగే అబ్బాయి పుడితే రూ.1000, అమ్మాయి పుడితే రూ.500 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. డబ్బులు లేవంటే ఎందుకొచ్చారంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బాలింతను వార్డుకు స్ట్రెచ్చర్‌పై తీసుకురావడానికి కూడా రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. లేదంటే పచ్చి బాలింత అని కూడా చూడకుండా నిర్దయగా బెడ్‌పై పడేస్తారు. బాలింతల దుస్తులు ఉతికేందుకు కూడా ఇక్కడ దశాబ్దాల తరబడి దందా కొనసాగుతోంది. ఒక జత దుస్తులు ఉతికినందుకు గాను రూ.200 వరకు ఇవ్వాల్సిందే. అప్పుడే జన్మించిన శిశువులను కుటుంబ సభ్యుల చేతికి ఇస్తున్నారు. వారు కూర్చునేందుకు సరైన వసతి కూడా లేదు. డెలివరీ రూమ్‌ వద్ద వరండాలో, అందరూ తిరిగే ప్రాంతంలో నేలపైనే అప్పుడే జన్మించిన శిశువులను ఎత్తుకుని కూర్చువాల్సి వస్తోంది. దీనివల్ల పసిపిల్లలు ఇన్‌ఫెక్షన్‌ బారిన పడతారన్న జ్ఞానం అధికారులకు, సిబ్బందికి ఉండడం లేదు. 

ఆరోగ్యశ్రీ ఉన్నా రూ.10 వేలకుపైగా ఖర్చు
రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల నుంచి ఈ ఆసుపత్రిలో ప్రసవాలకు కూడా ఎన్‌టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) పథకాన్ని వర్తింపజేసింది. దీనిద్వారా గర్భిణులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్యం అందుకునే వీలుంది. ఒకవేళ మందులు బయట కొనుగోలు చేసినా ఆ మొత్తాన్ని డిశ్చార్జ్‌ సమయంలో తిరిగి చెల్లించే వీలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ కారణంగా ఆసుపత్రిలో చేరిన గర్భిణులు డిశ్చార్జ్‌ అయ్యే వరకు ఒక్కొక్కరు సాధారణ కాన్పు అయితే రూ.3 వేల దాకా, సిజేరియన్‌ అయితే రూ.10 వేల దాకా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. ప్రసవాలు చేసిన వైద్యులకు, సిబ్బందికి, అధికారులకు మాత్రం వైద్యసేవ కింద ప్రోత్సాహక నగదు అందుతోంది.

రూ.10 వేలు ఖర్చయ్యింది
మాది గద్వాలలోని అమరావతి ప్రాంతం. నా భార్య భవానిని 20 రోజుల క్రితం ప్రసూతి విభాగంలో చేర్పించా. ఏడవ నెలలో ఆడబిడ్డను ప్రసవించింది. ఈ సమయంలో మందులన్నీ బయటకే రాశారు. బీపీ తగ్గేందుకు ఇంజెక్షన్లు, రక్తకణాల కోసం రక్తానికి కూడా బయటే తెప్పించుకున్నాం. ఇప్పటి వరకు  రూ.10వేలు ఖర్చు అయ్యింది.   –నల్లన్న, గద్వాల

Advertisement

తప్పక చదవండి

Advertisement