చనిపోయిన నా భర్త డబ్బు ఎలా తీసుకున్నాడు? | Sakshi
Sakshi News home page

చనిపోయిన నా భర్త డబ్బు ఎలా తీసుకున్నాడు?

Published Mon, Oct 9 2017 3:01 AM

Kurnool woman who approached the Central Information Commission

న్యూఢిల్లీ: మూడేళ్ల కిందట చనిపోయిన తన భర్త జాతీయ పొదుపు పత్రాలను(ఎన్‌ఎస్సీ) ఎలా క్లెయిమ్‌ చేసుకున్నాడంటూ ఓ మహిళ కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీఐసీ.. వెంటనే విచారణకు ఆదేశించింది. కర్నూలు జిల్లాకు చెందిన టి.సుబ్బమ్మ భర్త ఆదిశేషయ్య రూ.10 వేల విలువైన ఐదు జాతీయ పొదుపు పత్రాలను కొనుగోలు చేశాడు. 2004లో ఆయన మరణించాడు. అప్పట్నుంచి ఆయన భార్య ఈ సొమ్ము కోసం అనేక పర్యాయాలు కర్నూలు పోస్టాఫీసును సంప్రదించింది. అయినా సరైన సమాధానం లభించలేదు. కొన్నాళ్ల తర్వాత స్పందించిన పోస్టాఫీసు సిబ్బంది.. 2007లో ఆమె భర్త ఈ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్‌ చేసుకున్నట్లు తెలియజేశారు.

అయితే 2004లో చనిపోయిన తన భర్త 2007లో ఎలా క్లెయిమ్‌ చేసుకుంటారని సుబ్బమ్మ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరింది. అయినా సరైన స్పందన లేకపోవడంతో సీఐసీని ఆశ్రయించింది. చనిపోయిన వ్యక్తి మూడేళ్ల తర్వాత పోస్టాఫీసుకు వెళ్లి రూ.50 వేలు వడ్డీతో సహా ఎలా తీసుకున్నాడో చెప్పాలని కోరింది. ఆమె పిటిషన్‌పై పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ స్పందన చట్టవిరుద్ధంగా ఉందని, అవకతవకలను కప్పిపుచ్చుకునేలా వారు వ్యవహరించారని సమాచార కమిషనర్‌ మాడభూషి శ్రీధర్‌ అభిప్రాయపడినట్లు ఆమె కుమారుడు చెప్పారు. తమ బంధువు సహాయంతో పోస్టాఫీసు సిబ్బంది మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. కర్నూలు సూపరింటెండెంట్‌ కృష్ణమాధవ్‌కు సీఐసీ షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసిందన్నారు. నవంబర్‌ 1 లోగా పూర్తి వివరాలను సమర్పించాలని చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ను సీఐసీ ఆదేశించిందని తెలిపారు.   

Advertisement
Advertisement