ప్రాదేశికంలో మహిళా రాజ్యం | Sakshi
Sakshi News home page

ప్రాదేశికంలో మహిళా రాజ్యం

Published Fri, Mar 7 2014 2:20 AM

ladies following in local regions

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్రాదేశిక రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధిం చిన రిజర్వేషన్ల జాబితాను గురువారం అధికారికంగా ప్రకటించారు. జిల్లా కలెక్టర్ చిరంజీవులు ఆమోద ముద్రతో గెజిట్ నంబర్ 1052 ద్వారా ఈ జాబితా విడుదల చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో  సింహభాగం మహిళలకే కేటాయించారు.
 
 నల్లగొండ, న్యూస్‌లైన్
 జిల్లాలో మొత్తం 59 జెడ్పీటీసీ స్థానాలు, 835 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో అత్యధిక స్థానాలను మహిళకు కేటాయించారు. 59 జెడ్పీటీసీ స్థానాల్లో మహిళలకు 30, జనరల్ కేటగిరీకి 29 స్థానాలు, 835 ఎంపీటీసీ స్థానాల్లో మహిళలకు 435, జనరల్‌కు 400 స్థానాలు రిజర్వు చేశారు. కాగా నకిరేకల్ మున్సిపాలిటీ రద్దు కావడంతో ఎంపీటీ సీ స్థానాలు 823 నుంచి 835కు పెరిగాయి. అయితే ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు మాత్రం రాష్ట్ర స్థాయిలో ఖరారు చేస్తారు. అయితే మండలాల వారీగా ఎంపీటీసీ రిజర్వేషన్ల వివరాలను కమిషనర్‌కు పంపుతారు. రాష్ర్టం యూనిట్‌గా తీసుకుని జిల్లాలో ఏ కేటగిరీకి ఎన్నిస్థానాలు రిజర్వు చేశారనే జాబితాను పంపిస్తారు.
 
  అనంతరం జిల్లా యంత్రాంగం ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ల వివరాలను ప్రకటిస్తుంది. అలాగే జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్‌ను కూడా రాష్ట్రం యూనిట్‌గా తీసుకుని ఖరారు చేస్తారు. అయితే ఈ ప్రక్రియ అంతా కమిషనర్ స్థాయిలో జరుగుతుందని దానికి కొంత సమయం పడుతుందని జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఇదిలాఉంటే ప్రస్తుతం మున్సిపాలిటీ, సార్వత్రిక ఎన్నికల తర్వాతే జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ప్రాదేశిక నియోజకవర్గ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల కసరత్తు పూర్తి కావడంతో ఇక ఎన్నికల నిర్వహణ ఉంటుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించడంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలుకానుంది.  
 
 

Advertisement
Advertisement