మాయలేడి ఘరానా మోసం | Sakshi
Sakshi News home page

మాయలేడి ఘరానా మోసం

Published Sat, Aug 31 2013 4:30 AM

Lady cheats SBI for Rs. 20 Lakhs

నంద్యాలటౌన్, న్యూస్‌లైన్: చెన్నైకి చెందిన సిఫీ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ జారీ చేసిన చెక్కులను మాయలేడి అజ్మిత్‌బేగం కాజేశారు. ఈమె తన ఖాతా ద్వారా దాదాపు రూ.20లక్షలు కాజేసి బ్యాంకుకే టోకరా వేసింది. సిఫీ టెక్నాలజీ కంపెనీ ఆన్‌లైన్‌లో ఈ డబ్బు డ్రా అయినట్లు గుర్తించడంతో మాయలేడి చేసిన ఘరానా మోసం వెలుగు చూసింది. ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రోదశికుమార్ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ గుమ్మడి రవికుమార్, ఎస్‌ఐ రమణ కేసు నమోదు చేశారు.
 
 రోదశికుమార్ శుక్రవారం రాత్రి విలేకరులకు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. స్థానిక మూలసాగరానికి చెందిన అజ్మిత్‌బేగం పొదుపు మహిళ. ఈమె 2008లో శ్రీనివాస జంక్షన్‌లోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో సేవింగ్స్ ఖాతా తెరిచింది. తర్వాత తరచూ డబ్బు డ్రా చేయడం, జమ చేయడం చేసేది. ఈ నేపథ్యంలో చెన్నైలోని సిఫీ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ అరుంధతిసింగ్ పేరిట రూ.800, టాటా టెలీ సర్వీస్ పేరిట రూ.561కు జారీ చేసిన చెక్కులను అజ్మిత్‌బేగం సంపాదించింది. సిఫీ టెక్నాలజీ కంపెనీ ఈనెల 24వ తేదీన రూ.9.76 లక్షలు, 27న రూ. 9.94లక్షల మొత్తానికి చెక్కులు అందించందంటూ 29వతేదీన తనఖాతాలో జమ చేసింది. ఆన్‌లైన్ విధానం కావడంతో దాదాపు రూ.20లక్షలు వెనువెంటనే ఆమె ఖాతాలో జమ అయ్యాయి. తర్వాత ఆమె ఈ డబ్బును డ్రా చేసుకొని వెళ్లిపోయింది. కాని తమ సంస్థ ఖాతాలో నుంచి రూ.20లక్షలు డ్రా కావడంతో సిఫీ టెక్నాలజీ కంపెనీ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రోదశికుమార్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన చెక్కులను పరిశీలించి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
 సీసీ కెమెరా ద్వారా మాయలేడి గుర్తింపు..
 మాయలేడి అజ్మిత్‌బేగం 29వ తేదీన ఉదయం 10గంటల సమయంలో మరో ఇద్దరు వ్యక్తులతో బ్యాంక్‌కు వచ్చినట్లు తర్వాత 11.30గంటలకు వెళ్లినట్లు బ్యాంక్ సీసీ కెమెరాలో నమోదైంది. అజ్మిద్‌బేగం తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి వారి సహాయంతో నకిలీ చెక్కులను అందజేసి డబ్బులను డ్రా చేసినట్లు తెలుస్తోంది.
 
 చెక్కులు స్కాన్‌చేసి...
 సిఫీ టెక్నాలజీ కంపెనీ జారీ చేసిన చెక్కులను చేజిక్కించుకున్న మాయలేడి అజ్మిత్‌బేగం, ఆమె సహచరులు కంప్యూటర్ టెక్నాలజీ సహాయంతో స్కానింగ్ చేసి తర్వాత చెక్కుల్లోని అమౌంట్లను మార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. తద్వారా కొత్త చెక్కులను ప్రింట్ తీసి బ్యాంక్‌లో జమ చేసి డబ్బు డ్రా చేసినట్లు తెలిసింది. అజ్మిత్‌బేగంపై చీటింగ్‌కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రమణ తెలిపారు.
 

Advertisement
Advertisement