లక్ష్మీ వల్లభా...నీ ఆస్తి గోవిందా? | Sakshi
Sakshi News home page

లక్ష్మీ వల్లభా...నీ ఆస్తి గోవిందా?

Published Wed, Jan 1 2014 2:39 AM

lakshmi narasimha swamy property in toruble

 సింగరాయపాలెం (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ :
 పురాణ పురుషుడైన లక్ష్మీనరసింహుడు ఆస్తి గొడవల్లో చిక్కుకున్నాడు! మార్కెట్ ప్రస్తుత ధర ప్రకారం కోటీ 50 లక్షల రూపాయల విలువైన నారసింహుని చెరువును, భూమిని ఆక్రమించేందుకు సింగరాయపాలెం గ్రామ పంచాయతీ రంగం సిద్ధం చేస్తోంది. మండలంలోని సింగరాయపాలెం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి 100 ఎకరాల వరకు భూములున్నాయి. వీటిలో సింగరాయపాలెం సెంటర్‌లో ఆర్‌ఎస్ నంబర్ 70లో తొమ్మిది ఎకరాల చేపల చెరువు, దానిని ఆనుకుని తూర్పు వైపు ఖాళీ స్థలం ఉన్నాయి. తరతరాలుగా ఇవి ఆలయ ఆధీనంలో ఉండగా వాటిపై వచ్చే ఆదాయం స్వామివారికే జమవుతోంది. ప్రస్తుతం.. ఈ చెరువు, స్థలం తనదేనంటూ గ్రామపంచాయతీ కొత్త వివాదానికి తెర తీసింది. ఇంతటితో ఆగకుండా ఖాళీ స్థలంలో రూ.12 లక్షల మండలపరిషత్ నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చేతులమీదుగా ఈ నెల 28న దానికి భూమిపూజ కూడా చేసేశారు. దీంతో వివాదం ముదురుపాకాన పడింది.
 
 నిద్రావస్థలో పంచాయతీ...
 అనేక సంవత్సరాలుగా ఈ చెరువు, స్థలం దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. చెరువులో చేపలు పెంచుకునేందుకు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. దీనిపై వచ్చిన ఆదాయం ఆలయ నిర్వహణకే ఉపయోగిస్తున్నారు. ఖాళీ స్థలంలో చెత్తాచెదారం పేరుకుపోతున్నా ఈ స్థలం తమదికాదంటూ పంచాయతీ తప్పించుకుందేతప్ప ఏనాడూ తొలగించిన పాపానపోలేదు. సెంటర్‌లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయషష్ఠి ఉత్సవాల సందర్భంగా ఈ స్థలంలో తాత్కాలిక షాపులు నిర్వహించుకునేందుకు ఆలయాధికారులే వేలం పాటలు నిర్వహిస్తున్నా ఏనాడూ అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆస్తి తనదేనంటూ పంచాయతీ ముందుకురావడంపై పలువురు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
 
 అమ్మినా అడ్డు చెప్పలేదు...
 స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. భక్తుల రద్దీకి అనుగుణంగా స్థలం లేదు. పక్కనే ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ చెరువును కొంతభాగం అమ్మాలని అధికారులు కోరారు. ఈ అభ్యర్థనపై 2004లో దేవాదాయ శాఖాధికారులు ఎకరం లక్ష రూపాయలు చొప్పున చెరువులో రెండెకరాలు అప్పగించారు. దీనిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అధికారులు పూడ్పించి పలు కట్టడాలు నిర్మించారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చెరువు తనదేనంటూ పంచాయతీ అడ్డుచెప్పకుండా ఇప్పుడు స్థలం తనదంటూ నిర్మాణాలకు పూనుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
 
 రికార్డుల్లో ఊరచెరువు...
 రెవెన్యూ రికార్డుల్లో ఊరచెరువుగా ఉన్నందున దీనిపై సర్వహక్కులూ తమకే ఉంటాయని పంచాయతీ అధికారులు వాదిస్తున్నారు. ఇప్పటివరకు స్థలం, చెరువుతో తమకెలాంటి అవసరం లేనందున వాటి జోలికి పోలేదని వాదిస్తున్నారు. నిధులు వృథాకాకుండా ఉండేందుకే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంటున్నారు. జాతీయరహదారికి, చెరువుకు మధ్య ఉన్న ఖాళీ స్థలం రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు భూమిగా ఉన్నందున దానిపైనా సర్వహక్కులూ తమకే ఉన్నాయని చె బుతున్నారు. చెరువును స్వాధీనం చేసుకుంటే పంచాయతీకి గణనీయమైన ఆదాయం వస్తుందని, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వీలుంటుందని పేర్కొంటున్నారు. రికార్డుల్లో ఊరచెరువు, పోరంబోకు భూమిగా నమోదు చేసినంతమాత్రాన ఏవిధంగా చెల్లుతుందనేది ఆలయ అధికారుల వాదన. అలాంటప్పుడు తమ వద్దే రెవెన్యూ అధికారులు శిస్తులు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇరు వర్గాలూ ఈ ఆస్తి తమదేనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
 
 వెనక్కి తగ్గేది లేదు...
 రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ ఆస్తిపై పంచాయతీకే సర్వహక్కులూ ఉన్నాయి. అయినా షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమిపూజ చేసేముందు అధికారులకు మౌఖికంగా తెలిపాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
 - గూడపాటి రమేష్, పంచాయతీ కార్యదర్శి
 
 కోర్టు తీర్పు ఉంది...
 చెరువు, ఖాళీ స్థలం ఆలయానికి చెందినవేనంటూ గుడివాడ సబ్‌కోర్టు 1950లోనే తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన ఈ ఆస్తిని వదులుకోం.
 - సీహెచ్ సుధాకర్, ఆలయ ఈవో

Advertisement
Advertisement