ఈ భూములు పెద్దలకు మాత్రమే | Sakshi
Sakshi News home page

ఈ భూములు పెద్దలకు మాత్రమే

Published Thu, Oct 12 2017 7:39 AM

land grabbing in tirupati and renigunta - Sakshi

సాక్షి, చిత్తూరు, తిరుపతి : తిరుపతి అర్బన్, రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల పరిధిలో సామాన్యుడికి ఇల్లు కష్టమే. ఈ ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ భూములపై దృష్టి సారించింది. వివరాలు సేకరించింది. రాజధాని పేరుతో అమరావతిలో 34వేల ఎకరాలను ప్రైవేటు భూములను లాక్కున్న ప్రభుత్వం అదే తరహాలో ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు భూములను స్వాధీనం చేసుకుంటోంది. తమ అనుమతి లేకుండా సెంటు భూమి కూడా ఇవ్వటానికి వీల్లేదని రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ పెద్దలు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. విలువైన భూములున్న ప్రాంతా ల్లో ఇళ్ల స్థలాలు, భూ పంపిణీపై నిషేధం విధించింది.

నాలుగు మండలాల్లో 46,500 మంది నివాస స్థలాలు లేని నిరుపేదలు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేయటంతో పాటు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గద్దెనెక్కాక హామీని తుంగలో తొక్కింది. నాలుగు మండలాల్లో ఒక్క సెంటు స్థలం కూడా పంపిణీ చేయటానికి వీల్లేదని ప్రభుత్వ పెద్దలు రెవెన్యూ అధికారులకు గట్టిగా చెప్పేశారు. దీంతో పేదలు ఇళ్ల స్థలాల కోసం ప్రదక్షిణ చేస్తున్నా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ఉత్తర్వులు లేకపోయినా ఇళ్ల స్థలాల పంపిణీపై నిషేధం విధించటం ప్రభుత్వ చరిత్రలో ఇదే తొలిసారని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇళ్ల స్థలాల పేరుతో రెవెన్యూ అధికారులు అమ్మి సొమ్ము చేసుకుంటారనే అనుమానంతో ప్రభుత్వ పెద్దలు ఈ రకమైన నిషేధం విధించినట్లు చెబుతున్నారు.

కారుచౌకగా భూములు
కోట్ల రూపాయలు విలువచేసే భూములను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతోంది. ఎకరం కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు విలువ ఉన్న భూములను ప్రైవేటు సంస్థలకు రూ.50 లక్షలకే కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రైతులు సాగు చేసుకుంటున్న భూములను సైతం ఎకరా రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షలు చొప్పున నామమాత్రపు పరిహారం చెల్లించి బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏర్పేడు మండలం మేర్లపాక, రాజులపాలెం, జంగాపల్లి, పంగూరు, పాగాలి తదితర గ్రామాల పరిధిలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం బలవం తంగా స్వాధీనం చేసుకుని నామమాత్రపు పరిహారం చేతిలో పెట్టి చేతులు దులుపుకోవటం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఇప్పటి వరకు కేటాయింపులు జరిగిన భూముల్లో ఎక్కువ శాతం ప్రైవేటు సంస్థలకే కట్టబెట్టడం గమనార్హం. తిరుపతి పరిసరాల్లో సర్కారు పరంగా ఇంటి స్థలం కేటాయించరని తెలుసుకుని నిరుపేదలు సర్కారుకు శాపనార్థాలు పెడుతున్నారు.

Advertisement
Advertisement