Sakshi News home page

రాజా అక్రమార్క

Published Sun, Jul 2 2017 10:48 PM

Land scam in Cherukuri Sudhakar Raju

ఆ ఇద్దరిలో ఒకడే.. ఈ చేకూరి సుధాకర్‌రాజు
పోలీసులకు చిక్కిన ట్యాంపర్‌ కింగ్‌ సుధాకర్‌రాజు
ఇతని బాగోతాలను గతంలోనే బయటపెట్టిన సాక్షి
కానిస్టేబుల్‌ నుంచి రియల్టర్‌ వరకు అన్నీ మోసాలే
హైదరాబాద్‌ నుంచే విశాఖలో భూచక్రం తిప్పిన ఘనుడు
మంత్రి, ఆయన తనయుడి అండతో అరాచకాలు


ఏఆర్‌ కానిస్టేబుల్‌గా చేస్తూ.. డీఎస్పీనంటూ దందాలు చేయడంతో ఉద్యోగం ఊడింది..

దాంతో రియల్టర్‌ అవతారమెత్తాడు. మాటల చాతుర్యంతో అందరినీ బురిడీ కొట్టిస్తూ భూదందాలు మొదలెట్టాడు..

అంతేనా రికార్డులు తారుమారు చేసి.. అనుభవదారుల తలరాతలు మార్చేయడంలో తానే రాజుననిపించుకున్నాడు..

హైదరాబాద్‌లోనే ఉంటూ ఇక్కడ దందాలు నడిపేవాడు.. మంత్రి, అతని కుమారుడి అండతో చెలరేగిపోయాడు..

కేసులెన్ని నమోదైనా.. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తప్పించుకోవడంలో ఘనుడనిపించుకున్నాడు..

దానికోసమే తన ఇంటి పేరును కూడా మార్చేసుకున్నాడు.. అయినా ఆర్నెల్ల క్రితమే ‘సాక్షి’ కథనాలకు చిక్కిన ఈ రాజా అక్రమార్కుడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోగలిగారు.


సాక్షి, విశాఖపట్నం: భూ దందాలు, రికార్డుల తారుమారుతోపాటు లేని కంపెనీలను సృష్టించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టే ఆ ఘనుడే చేకూరి సుధాకర్‌రాజు అలియాస్‌ చింతాడ సుధాకర్‌రాజు. ఆరంభంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగంలో చేరి డీఎస్పీ అవతారమెత్తి పోలీసులకు చిక్కిన కృష్ణా జిల్లాకు చెందిన ఈ సుధాకర్‌రాజు ఉద్యోగం పోగొట్టుకున్నాక హైదరాబాద్‌లో సెటిలయ్యాడు. కొన్నాళ్లకు విశాఖ స్థిరాస్తి వ్యాపారంలోకి ప్రవేశించాడు. హైదరాబాద్‌లోనే ఉంటూ విశాఖలో భూదందాలు, అక్రమాలకు పాల్పడుతున్నాడు. అతనిపై అప్పటికే పలు కేసులుండడంతో ఇంటి పేరును చేకూరికి బదులు చింతాడగా మార్చుకుని సీహెచ్‌ సుధాకర్‌రాజుగా చెలామణీ అవుతున్నాడు.

నేతలతో బంధం
కోట్లు గడించాక రాజకీయ నాయకులతో బంధాన్ని పెంచుకున్నాడు. వారి అండతో ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమించడం, రికార్డులను ట్యాంపర్‌ చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు, పాస్‌పుస్తకాలు సృష్టించడం,  టైటిల్‌డీడ్స్‌ మార్చడం, తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి అమ్మకం చేపట్టడం మొదలెట్టాడు. రాష్ట్ర మంత్రివర్గంలో కీలకస్థానంలో ఉన్న సీనియర్‌ మంత్రి కుమారుడితో సంబంధాలు పెట్టుకున్నాడు. దీంతో అక్రమంగా కొట్టేసిన భూ ములను సక్రమం చేసుకునే పనిని తేలిక చేసుకున్నాడు.

విశాఖలో వెలుగు చూసిన భారీ భూకుంభకోణంలో రికార్డుల ట్యాంపరింగే కీలకంగా మారింది. ఇందులో సుధాకర్‌రాజు పాత్రే ఎక్కువగా కనిపిస్తోంది. తహసీల్దార్ల వద్ద మాత్రమే ఉండాల్సిన డిజిటల్‌ కీని హస్తగతం చేసుకొని ఆన్‌లైన్‌లో రెవెన్యూ రికార్డుల్లోకి వెళ్లి డి పట్టా అని ఉన్న చోట ‘డి’ని ‘జి’గా మార్చేయడం.. అనుభవదారుల పేర్లు మార్చి వారి నుంచి భూములు కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు పుట్టిస్తాడు. వాటిని చూపి రిజిస్ట్రేషన్లు కూడా చేయించేస్తాడు. అంతేకాదు.. చేకూరి కెమికల్స్‌ పేరుతో ఒకటి, మరో ఇన్‌ఫ్రా ప్రాజెక్టు ఏర్పాటు చేసినట్టు లేని కంపెనీలను సృష్టించాడన్న ఆరోపణలున్నాయి.

కేసులే కేసులు..
ఎండాడ, రుషికొండ, భీమిలి, మధురవాడ, కొమ్మాది, పీఎంపాలెంతో పాటు నగరంలోని సీతమ్మధార, వాల్తేరు, చినగదిలి, చినగంట్యాడ తదితర ప్రాంతాల్లో సుధాకర్‌రాజు భూదందాలకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఈయన అక్రమాలపై   విశాఖ ఫోర్త్‌టౌన్, త్రీటౌన్, భీమిలి, పరవాడ, టూటౌన్, పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్లలో 2012 నుంచి డజనుకు పైగానే క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ రాజకీయ అండతో ఇన్నాళ్లూ అరెస్టు కాకుండా తప్పించుకుంటూ వచ్చాడు. ఈ చీటింగ్‌ రాజు జోలికెళ్లడానికి పోలీసులు కూడా సాహసం చేయలేకపోయారు. జూ సమీపంలోని సీతకొండ విశాఖ వ్యాలీ స్కూలు వద్ద 24.05 ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన కేసులో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లో ఉన్న సుధాకర్‌రాజును ఎట్టకేలకు విశాఖ పోలీసులు అరెస్టు చేశారు.

కాల్‌డేటా తీస్తే..
సుధాకర్‌రాజు కాల్‌డేటాను పరిశీలిస్తే ఆయనుకు రాష్ట్రమంత్రి, ఆయన కుమారుడితో పాటు ఇతర నేతలతో ఉన్న లింకులన్నీ బయటపడే అవకాశం ఉంది. ఆ మంత్రి కుమారుడితో ఈయనకు వ్యాపార భాగస్వామ్యం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుధాకర్‌రాజును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వీరితో ఉన్న సంబంధాలు వెలుగు చూస్తాయి.

ముందే చెప్పిన ‘సాక్షి’
సుధాకర్‌రాజు సాగిస్తున్న భూకబ్జాలు, భూదందాల వ్యవహారాన్ని ‘సాక్షి’ దినపత్రిక ముందే వెలుగులోకి తెచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఎలా కాజేస్తున్నది, ఫోర్జరీ డాక్యుమెంట్లను ఎలా సృష్టిస్తున్నదీ, రికార్డుల ట్యాంపరింగ్‌కు ఎలా పాల్పడుతున్నదీ వెలుగులోకి తెచ్చింది. ఈయనకు రాష్ట్రమంత్రి, ఆయన తనయుడు సహకరిస్తున్న తీరునూ, హైదరాబాద్‌లో ఉంటూ సుధాకర్‌రాజు విశాఖలో భూ చక్రం తిప్పుతున్న తీరునూ పలు కథనాల ద్వారా బయటపెట్టింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement