భూములు నిస్సారం | Sakshi
Sakshi News home page

భూములు నిస్సారం

Published Wed, Jun 18 2014 12:09 AM

lands are spoiling due to no rains

సిరులు పండే భూములు క్రమంగా చౌడు బారుతున్నాయి. పంట పొలాల్లో శ్రుతి మించుతున్న రసాయనిక ఎరువుల వినియోగం.. అధికమవుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా సారం కోల్పోతున్నాయి. పంట విరామం పాటించక పోవడంతో భూమిలో లవణాలు తగ్గిపోతున్నాయి. ఎరువుల మోతాదు మించడంతో నేలలో సూక్ష్మధాతు లోపం, జింక్ లోపం కనిపిస్తోంది. భూసార పరీక్షలు చేయించకపోవడం, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు సలహాలను రైతులు పాటించకపోవడం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తోంది.
 
 తెనాలిటౌన్: కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో దశాబ్దంన్నర కాలంగా వరి తరువాత రెండో పైరుగా రైతులు మొక్కజొన్నను అధికంగా సాగు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నారు. రైతులు అవసరానికి మించి ఎరువులు ఉపయోగించడం వల్ల నేలలో సూక్ష్మధాతు లోపం, జింక్ లోపం కనిపిస్తోందని భూసార పరీక్షలు నిర్వహించిన శాస్త్రవేత్తలు గుర్తించారు. గ్రామాల్లో వ్యవసాయాధికారులు అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులను చైతన్య పరస్తున్నప్పటికీ రైతులు ఎరువుల వాడకం తగ్గించడం లేదు. వేసవి సీజన్‌లో పొలాల మట్టి నమూనాలు సేకరించి భూ సార పరీక్షలు చేయించి, ఫలితాల సిఫారసు మేరకు ఎరువులు వాడినట్లయితే మంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
 సాగు వివరాలివీ.. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 93,750 ఎకరాల్లో గత ఏడాది ఖరీప్ సీజన్‌లో వరి సాగు చేశారు.
 
 తెనాలి మండలంలో 22,500 ఎకరాలు, వేమూరు మండలంలో 22వేల ఎకరాలు, కొల్లూరులో 12,250 ఎకరాలు, దుగ్గిరాలలో 22,000 ఎకరాలు, కొల్లిపరలో 15,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. తెనాలి డివిజన్‌లో 1.45 లక్షల ఎకరాల్లో రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగు చేశారు. తెనాలి సబ్ డివిజన్‌లో 62వేలు, రేపల్లె డివిజన్‌లో 25వేలు, పొన్నూరు డివిజన్‌లో 30వేలు, బాపట్ల డివిజన్‌లో 28 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు.
 
 సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి..  వ్యవసాయ శాస్త్రవేత్తలు తెనాలి రూరల్ మండలంలోని గ్రామాల్లో 200 చోట్ల మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు జరిపారు. ఫలితాలను రైతులకు అందజేశారు. భూసార పరీక్షల ఫలితాల సిఫారసు మేరకు ఎరువుల వాడడం వల్ల రసాయనిక ఎరువుల మీద పెట్టుబడి తగ్గించవచ్చని వ్యవసాయాధికారి కె.అమలకుమారి తెలిపారు. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను 4:2:1 నిష్పతిలో ఉపయోగించాలని సూచించారు.
 
 నేలలో పోషకాల లోపం రాకుండా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని, కేవలం రసాయన ఎరువులే కాకుండా జీవన ఎరువులు, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట, వర్మికంపోస్ట్ ఎరువులను వాడినట్లయితే భూసారం పెరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది భూ చేతన కార్యక్రమం కింద తెనాలి మండలంలోని సోమసుందపాలెం, కఠెవరం, కంచర్లపాలెం గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఆయా గ్రామాల్లో జింక్, జిప్సమ్, బోరాన్ ఎరువులను సబ్సిడీపై రైతులకు పంపిణీ చేస్తామని చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement