కృష్ణా తీరంలో కబ్జారాయుళ్లు | Sakshi
Sakshi News home page

కృష్ణా తీరంలో కబ్జారాయుళ్లు

Published Wed, Feb 4 2015 3:14 AM

కృష్ణా తీరంలో కబ్జారాయుళ్లు

సాక్షి, విజయవాడ: కృష్ణానది లోపలి భాగంలో అక్రమ నిర్మాణాలపై వివాదం ముదురుపాకాన పడింది. వీటిని నిర్మించిన బడాబాబుల్ని దారికి తెచ్చుకునేందుకు భారీనీటిపారుదల శాఖ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు వేసిన పాచిక  పారలేదు సరి కదా ఇప్పుడది ప్రభుత్వానికి తలనొప్పిలా మారింది. రాజధాని కోసం రైతుల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం ఈ బడాబాబుల ఆక్రమణల్లో ఉన్న భూముల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కృష్ణాతీరంలో అక్రమ నిర్మాణాలు చేసినవారిలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, బడా వ్యాపారులు ఉన్నారు.
 
 500 మీటర్ల వరకు అనుమతులు నిల్
 
 కృష్ణానది కరకట్ట లోపలి భాగంలో (నదీగర్భంలో) సుమారు 2,000 ఎకరాల వరకు భూములున్నాయి. ఈ భూముల్లో పంటలు పండించుకోవచ్చు. నదీ పరిరక్షణ చట్టం ప్రకారం నదీ ప్రవాహనికి 500 మీటర్ల లోపు నిర్మాణాలు జరగకూడదు. సాగునీటి శాఖ అనుమతి తీసుకున్నా కేవలం షెడ్లు, తాత్కాలిక కట్టడాలు మాత్రమే వేసుకోవాలి. ఈ నిబంధనలను తుంగలో తొక్కి బడాబాబులు కృష్ణానదీ తీరంలో గుంటూరు వైపు సుమారు 48, విజయవాడ వైపు 17 పెద్ద భవనాలు నిర్మించారు. బీజేపీకి చెందిన నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు గుంటూరు జిల్లా పరిధిలో నది లోపలి భాగంలో గెస్ట్‌హౌస్, దానిపక్కనే ఒక స్విమింగ్‌పూల్ నిర్మించారు. గోకరాజు గంగరాజు సహకారంతో మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆ్రశ్రమాన్ని ఇక్కడ నిర్మించారు. ఇందులో ఐదు, ఆరంతస్తుల భవనాలు ఉన్నాయి. ఇక్కడే గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమం, ఇస్కాన్ టెంపుల్ వంటి ఆధ్యాత్మిక కేంద్రాలు, చిగురు అనాథ బాలబాలికల ఆశ్రమం, తులసీ గార్డెన్స్, చందనా బ్రదర్స్, సుంకర శివరామకృష్ణ వంటివారు భారీ భవనాలు నిర్మించారు. ఇటీవల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులను బోట్లలో నదిలోకి తీసుకువెళ్లి ఈ అక్రమ నిర్మాణాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటామంటూ హడావుడి చేశారు. అయితే నెల రోజులు గడిచినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
 
 భూమిపూజ చేసిన బీజేపీ అగ్రనేత...
 
 కరకట్ట దిగువన బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజుకు వంద ఎకరాల భూమి ఉంది. ఇందులో నిర్మించిన గెస్ట్‌హౌస్‌లకు ప్రముఖులు వచ్చి పోతుంటారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనేతలు, రాష్ట్ర మంత్రులు ఈ గెస్ట్‌హౌస్‌కు రాగా.. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇక్కడికి వచ్చి పార్టీ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. మంత్రి దేవినేని ఉమ ఇక్కడి భవనాలపై కన్నేయడంతో గోకరాజు గంగరాజు ఇందులోనే సుమారు అర ఎకరం భూమిని శ్యామ్‌ప్రసాద్‌ముఖర్జీ ట్రస్టుకు ఇటీవల బహుమతిగా ఇచ్చారు. దీంతో ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు వచ్చి ఇక్కడ భూమిపూజ చేశారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఇక్కడ నిర్మాణాలు చేపడతామంటూ బహిరంగంగా చెప్పారు. అన్నీ అనుకూలిస్తే ఈ భవనాన్నే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యాలయంగా మార్చాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
 
 ఆందోళనకు పలు పార్టీలు సిద్ధం...
 
 ఈ అక్రమ కట్టడాల వ్యవహారంపై కాంగ్రెస్, వామపక్షాలు కన్నెర్ర చేస్తున్నాయి. కరకట్ట దిగువన 500 మీటర్ల లోపు నిర్మాణాలకు అనుమతి లేదు. ట్రస్టు ఏ విధంగా భవనాలు నిర్మిస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) బీజేపీ ఇక్కడ భవనాలను నిర్మిస్తే తాము అంతకంటే పెద్ద భవనాలను కడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బడాబాబుల్ని దారికి తెచ్చుకోవడానికే మంత్రి దేవినేని ఉమ ప్రయత్నించారు తప్ప.. ఈ అక్రమ నిర్మాణాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతం సీఆర్‌డీఏ పరిధిలోకి రావడంతో నిర్మాణాలకు అనుమతి ఇచ్చేది లేదని చెప్తున్న ఏపీ సర్కారు బీజేపీ కార్యాలయానికి ఎలా అనుమతిస్తుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలన్నింటినీ తక్షణం స్వాధీనం చేసుకోవాలని, లేకపోతే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం చేస్తుందా? అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. కృష్ణానదీ తీరంలో ఉన్న అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా రైతుల భూములు తీసుకోవడం ఎంతమేరకు సమంజసమంటున్నారు.
 
 ఉమా మీకు తెలియదా...!
 
 ‘‘మంత్రి దేవినేని ఉమ జిల్లాలో పుట్టి పెరిగారు, రాజకీయ నాయకుడిగా పలు ఆందోళనలు చేశారు. కృష్ణా నదిలో అనేకసార్లు బోటు షికార్లు చేశారు. నది లోపల, వెలుపల ఏమున్నది, ఎలా ఉన్నది మీకు తెలియదా? నూతన సంవత్సరం సందర్భంగా జర్నలిస్టులతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన రోజునే కృష్ణా నదీగర్భంలో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారా? పైగా కట్టడాలు చూసి జర్నలిస్టుల ముందు ఇంత పెద్ద భవంతులు కట్టారా..? నేనెప్పుడూ చూడలేదే..! అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఇది నిజమైన ఆశ్చర్యమేనా...? లేక నటనా..?’’ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆక్రమణలపై మంత్రి ఉమ నోరు మెదపకపోవడంపై అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోనే ఇక్కడ భవనాలు నిర్మించడానికి సిద్ధంకావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల్ని, అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకుంటే దాని ప్రభావం పొత్తుపై పడే అవకాశాలు కనపడుతున్నాయి. బీజేపీ నేతలకు ఇబ్బంది కలిగే విధంగా మంత్రి ఉమ నిర్ణయం తీసుకుంటారా? అనే ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది.
 
 26 అక్రమ కట్టడాల గుర్తింపు
 
 చర్యలు తీసుకుంటాం : కలెక్టర్ కాంతిలాల్ దండే
 సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణానది కరకట్ట వెంబడి గుంటూరు జిల్లా పరిధిలో అనధికార కట్టడాలు నిర్మించిన వ్యక్తులకు గుంటూరు జిల్లా యంత్రాంగం నోటీసులు జారీ చేయనుంది. ఎటువంటి అనుమతులు లేకుండా కృష్ణానదిలో నిర్మించిన 26 అక్రమ కట్టడాలను జాయింట్ కలెక్టర్ సిహెచ్.శ్రీధర్ గుర్తించారు. వీటిని నిర్మించిన వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను కలెక్టర్ కాంతిలాల్ దండేకు అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ అక్రమ కట్టడాలు నిర్మించినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నోటీసులు అందిస్తున్నామని మంగళవారం మీడియాకు వివరించారు. ల్యాండ్ పూలింగ్ యూనిట్ల పరిధి లోని డిప్యూటీ కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. వారినుంచి అదనపు సమాచారాన్ని తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.
 
 ప్రభుత్వం గుర్తించిన ఆక్రమణదారులు వీరే...
 
 ప్రకాశం బ్యారేజీ ఎగువన కరకట్టలపై ఎటువంటి అనుమతులు లేకుండా గుంటూరు జిల్లా వైపు 48 నిర్మాణాలు, కృష్ణాజిల్లా వైపు 17 నిర్మాణాలు ఉన్నట్లు ఇరిగేషన్ అధికారు లు గుర్తించారు. ఉండవల్లి, తాడేపల్లి, తాళ్లాయపాలెం, పెనుమాక గ్రామాల్లో 30 శాశ్వత నిర్మాణాలు, 18 తాత్కాలిక నిర్మాణాలున్నాయి. ఉండవల్లిలో 20, తాళ్లాయపాలెంలో 4, తాడేప ల్లి, పెనుమాకలలో 3, శాశ్వత నిర్మాణాలున్నాయి. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లో 12,560 చ.గజాల్లో నిర్మాణాలున్నాయని గుర్తించారు. ఎంపీ గోకరాజు గంగరాజు, మంతెన సత్యనారాయణరాజు ట్రస్ట్‌లు నదిని పూడ్చి నిర్మాణాలు చేశారు.
 
 గుంటూరు జిల్లా వైపు
 ముఖ్యమైన అక్రమ నిర్మాణాలు
 
 ఆక్రమించినవారు    చదరపు గజాలు    ప్రాంతం
 చందన బ్రదర్స్       480                    ఉండవల్లి
 గణపతిసచ్చిదానంద ఆశ్రమం    400     ఉండవల్లి
 సుబ్రహ్మణ్యం               300    ఉండవల్లి
 ఇస్కాన్ టెంపుల్    800    ఉండవల్లి
 గోకరాజు గంగరాజు    2,900    ఉండవల్లి
 సుంకర శివరామకృష్ణ    200    ఉండవల్లి
 రవికుమార్              200    ఉండవల్లి
 మాధవి                       200    ఉండవల్లి
 ఎస్.రాఘవరావు    300    ఉండవల్లి
 పి.నాగభూషణం    700    ఉండవల్లి
 తులసీ గార్డెన్స్              800    ఉండవల్లి
 వేదాద్రి మహర్షి               100    ఉండవల్లి
 గోపి, లింగమనేని ఎస్టేట్స్    1,000    ఉండవల్లి
 ఎంబీఎస్‌వీ ప్రసాద్    200    ఉండవల్లి
 ముక్కాల అప్పారావు    1,500    ఉండవల్లి
 నెక్కంటి వెంకట్రావు    300    ఉండవల్లి
 చిగురు ఆశ్రమం    1,500    పెనుమాక
 

Advertisement
Advertisement