Sakshi News home page

మాట మార్చారు.. పరువు తీశారు!

Published Fri, Jun 3 2016 1:16 AM

Launches election promises to expand both every farmer

ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల్లో బాబు హామీ
జిల్లాలో మొత్తం వ్యవసాయ రుణాలు  రూ.9,137 కోట్లు
మాఫీ చేసింది రూ.1490 కోట్లు 
రైతుల ఖాతాలో జమ చేసింది   రూ.573 కోట్లు
రైతు సాధికార సంస్థకు నిధులేవీ?
డ్వాక్రా సభ్యులకు రూ.3 వేలతో సరి
బ్యాంకర్లు, రైతుల మధ్య బంధాన్ని  విడదీసిన సర్కారు

 

మచిలీపట్నం : ‘టీడీపీ అధికారంలోకి వస్తే బ్యాంకులో తాకట్టు పెట్టిన పుస్తెలతాళ్లు తీసుకువచ్చి ఇంటి వద్ద ఇస్తాం. రైతులు పంట రుణాలు తీసుకుంటే ఎవరూ చెల్లించవద్దు. అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తాం’ గత ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇది.


హామీలతో పాటు స్థానిక టీడీపీ నేతల మాటలు నమ్మిన రైతులు తాము తీసుకున్న రుణాలను చెల్లించకుండా నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు మొట్టమొదటి సంతకం చేసిందీ రుణమాఫీ ఫైలుపైనే. ఆచరణలో మాత్రం రెండేళ్లు గడిచినా రుణమాఫీ అంశం కొలిక్కి రాలేదు. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లూ రుణమాఫీ ప్రక్రియ కొనసాగించే దిశగా సర్కారు అడుగులు వేసింది.

 

ప్రస్తుతం రైతుల పరిస్థితేమిటంటే.. పాత బకాయిలు అలాగే ఉండిపోయాయి. కొత్త రుణం కోసం బ్యాంకు గుమ్మం తొక్కాలంటే ముందూవెనకా ఆలోచించాల్సిన స్థితి. రుణమాఫీ పదానికి కొత్త అర్థం చెప్పిన పాలకులు తమను నట్టేట ముంచారనే వాదన రైతుల నుంచి వినిపిస్తోంది.


మచిలీపట్నం : రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు సర్కారు ఈ అంశంపై రకరకాలుగా మాట మార్చింది. ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని ఒకసారి, కాదు కాదు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం మాఫీ జరుగుతుందని మరోసారి, ఏదైనా ఒక బ్యాంకులో తీసుకున్న రుణమే మాఫీ అవుతుందని ఇంకోసారి.. ఇలా రకరకాలుగా రైతులను అయోమయానికి, ఇబ్బందులకు గురిచేశారు. చివరికి పుస్తెల తాళ్లు ఇంటికి రాకపోగా బంగారు నగల బహిరంగ వేలం ప్రకటనలతో తమ పరువు బజారున పడిందని రైతులు వాపోతున్నారు. మరోపక్క బంగారం తాకట్టు పెట్టినా ఎకరాకు రూ.20 వేలకు మించి రుణం ఇవ్వబోమని బ్యాంకులు స్పష్టం చేస్తుండటంతో ప్రస్తుత ఖరీఫ్‌లో ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడింది. కౌలు రైతుల రుణమాఫీ ఊసే సర్కారు పట్టించుకోవటం లేదు. రైతు సాధికార సంస్థ ద్వారా రుణమాఫీ జరుగుతుందని ప్రకటించారు. ఈ సంస్థకు కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశారు.

 
మొత్తం బకాయిలు రూ. 9,137 కోట్లు

జిల్లాలో 2014 డిసెంబరు 31 నాటికి 7.03 లక్షల మంది రైతులు రూ. 9,137 కోట్ల మేర పంట రుణాలు బకాయి ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో రైతులు ఎవ్వరూ రుణాలు చెల్లించలేదు. కొంతకాలం పాటు రుణాలు రీషెడ్యూలు చేస్తామని, అనంతరం రుణమాఫీ చేస్తామని చెబుతూ వచ్చారు. పంట రుణాలుగా రూ.3,088 కోట్లు, బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలు రూ.3,276 కోట్లు, టెర్మ్ లోన్స్ రూ.2,773 కోట్లు తీసుకున్నారు. ఒక రైతు కుటుంబం ఎంతమేర పంట రుణం తీసుకున్నా వారికి రూ.1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ జరుగుతుందని ప్రకటించారు. అనంతరం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (కొలమానం) ఆధారంగా ఎకరానికి రూ.19,500 మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పారు. రూ.50 వేల లోపు ఉన్న రుణాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. జిల్లాలో 4,04,402 మంది రైతులకు రూ.1490 కోట్లు రుణమాఫీ జరిగినట్లు పేర్కొన్నారు. ఇందులో రూ.573 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెబుతున్నారు.

 
వడ్డీకి సరిపోవటం లేదు...

రెండెకరాలున్న రైతు పంట రుణంగా రూ.70 వేలు తీసుకుంటే సకాలంలో చెల్లించని కారణంగా వడ్డీ, అపరాధ వడ్డీ కలుపుకుని రూ.78 వేలు అయ్యింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రెండు ఎకరాలకు రూ.39 వేలు రుణమాఫీ జరిగే అవకాశం ఉంది. రూ.78 వేలు బకాయి ఉండటంతో ఈ రుణాన్ని ఐదు విడతల మాఫీకి నిర్ణయించారు. మొదటి విడతగా సంబంధిత రైతు ఖాతాలో రూ.8,500 జమ చేశారు. దీంతో ప్రభుత్వం రుణమాఫీగా జమ చేసిన నగదు రైతు తీసుకున్న రుణానికి వడ్డీ కింద కూడా చాలని పరిస్థితి నెలకొంది. ఈ ఐదేళ్ల పాటు ఈ మొత్తానికి వడ్డీ, అపరాధ వడ్డీతో కలుపుకొంటే సగం బాకీ అలాగే ఉండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 
డ్వాక్రా సభ్యులకు రూ.3వేలతో సరి

జిల్లాలో 57,130 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటిలో 6,16,552 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీ అధికారం చేపట్టే నాటికి డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు రూ.938 కోట్లు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ రుణాలన్నీ మాఫీ చేస్తారనే ఆశతో ప్రతి నెలా డ్వాక్రా సభ్యులు రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం మాట మార్చిన పాలకులు డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ కావని, ఒక్కొక్క సభ్యురాలి పేరున రూ.10 వేలు నగదు జమ చేస్తామని ప్రకటించారు. మొదటి విడతగా రూ. 3 వేలను డ్వాక్రా సభ్యురాలి ఖాతాకు జమ చేశారు. ఈ నగదు రివాల్వింగ్ ఫండ్‌గానే ఉంటుందని, డ్రా చేసుకునేందుకు వీలులేదని నిబంధన విధించారు. దీంతో డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా మాఫీ కాకపోవడం గమనార్హం. ఇక రెండో విడత రూ.3 వేలను ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

 

Advertisement

What’s your opinion

Advertisement