పట్టపగలు న్యాయవాది ఇంట్లో చోరీ | Sakshi
Sakshi News home page

పట్టపగలు న్యాయవాది ఇంట్లో చోరీ

Published Sat, Jun 13 2015 3:14 AM

Lawyer daylight robbery at home

30 తులాల బంగారు ఆభరణాలు అపహరణ
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
 
 కడప అర్బన్ : నగరంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఉన్న లక్ష్మీటవర్స్ అపార్టుమెంటులో న్యాయవాది హైమావతి ఇంటిలో శుక్రవారం పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దాదాపు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుల కథనం మేరకు హైమావతి జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త మధుసూదన్‌రెడ్డి జిల్లా కోర్టులో జ్యుడిషియల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.  ఉదయం వారు విధులకు వెళ్లారు.

మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా, తాళం పగులగొట్టి ఉండడంతో సందేహంగా లోనికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. దుస్తులు చిందర వందరగా పడి ఉన్నాయి. పరిశీలించగా బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో వెంటనే  పోలీసులకు సమాచారం ఇచ్చారు. కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో వన్‌టౌన్ ఎస్‌ఐ రమేష్, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వీరితోపాటు క్లూస్ టీం హాజరైంది.

బాధితులను విచారిస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సీఐ రమేష్ తెలిపారు. అపార్టుమెంట్‌లో అప్రమత్తంగా లేకపోవడం వల్లే రెండోసారి చోరీ జరిగిందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం అదే అపార్టుమెంటులో నాల్గవ అంతస్తులో నివసిస్తున్న మోహన్‌రెడ్డి ఇంటిలో చోరీ జరిగింది.

Advertisement
Advertisement