కౌలు రైతు కన్నీటి సాగు | Sakshi
Sakshi News home page

కౌలు రైతు కన్నీటి సాగు

Published Mon, Oct 20 2014 1:54 AM

కౌలు రైతు కన్నీటి సాగు

కౌలు రైతులకు ఏటా కన్నీటి సేద్యం తప్పడం లేదు. జిల్లాలో 70 శాతం పంట భూములు సాగు చేసేది వీరే. అయినా ప్రభుత్వం, బ్యాంకుల నుంచి అందాల్సిన రాయితీలు, రుణాలు వారి దరిచేరవు. ఇందుకు కారణం వేరే వారి భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేయడమే. సాగుకు అందరి కంటే ఎక్కువ ఖర్చు పెట్టేది కూడా వీరే.

పెట్టుబడితో పాటు కౌలు కింద ముందే డబ్బు చెల్లించాలి. ఇంత కష్టపడిన వారిని రైతులుగా గుర్తించడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినా దిగువ స్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కౌలు రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు.     

 
చీరాల : కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో రెవెన్యూ యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తోంది. ఫలితంగా వేలాది మంది రైతులు కౌలుదారులుగా గుర్తింపు పొందలేకపోతున్నారు. ఈ ఏడాది కేవలం 8 వేల మందికి మాత్రమే గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారిలో మూడోవంతు మందికి ఎటువంటి రుణం మంజూరు కాలేదు. జిల్లాలో 2 లక్షలపైగా కౌలు రైతులున్నారు. జిల్లాలో సాగవుతున్న 5.7 లక్షల హెక్టార్లలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 35 వేల మంది కౌలు రైతులు గుర్తింపుకార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 8 వేల మందికే మంజూరు చేశారు. గుర్తింపు కార్డులు లేకపోవడంతో వారు ఏ రాయితీని, బ్యాంకు రుణాలను పొందలేకపోతున్నారు. దీనికి తోడు రైతులకు అవగాహన లేకపోవడం కూడా గుర్తింపుకార్డు పొందలేకపోవడానికి కారణమవుతోంది.

ప్రభుత్వం, అధికార యంత్రాంగం కౌలు రైతులను కన్నీటి కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నాలు నామమాత్రంగా కూడా చేయడంలేదు. రైతు సంఘాల నాయకులు గట్టిగా అడిగితే కొంతమందికి ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అధికారులు జిల్లాలో కౌలు రైతు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల్లోకి వెళ్లి వారు ఎంత భూమిని కౌలుకు తీసుకున్నారో ఆ ప్రకారం కార్డుల్ని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా ఆ ప్రక్రియ సాగడం లేదు. స్థానిక నేతలు చెప్పిన వారికి, సర్వే నంబర్లు చెప్పినవారికి కార్డులు అందుతున్నాయి. అలాంటి వాటిలో కౌలు చేసిన భూమికి, కార్డులో ఉన్న విస్తీర్ణానికి పొంతన ఉండడంలేదు.

ఎరువులు, విత్తనాలు, రుణాలు, వ్యవసాయ పనిముట్లు, పంటల బీమా, నష్టపరిహారం ఇలా కౌలుదారుడికి ప్రభుత్వం నుంచి పొందే ఏ లబ్ధికైనా గుర్తింపుకార్డులు అవసరం. ఏటా కౌలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య అంతా కలిపి 35 వేలకు మించి ఉండదు. దీనికి కారణం రైతులకు కార్డులు అందచేయడంలో అధికారులు రైతుల్ని ముప్పుతిప్పలు పెట్టడమే. పైగా కార్డులిచ్చినా వాస్తవంగా రైతులు సాగు చేస్తున్న భూమికి, గ్రామస్థాయి అధికారులు నమోదు చేస్తున్న విస్తీర్ణానికి సంబంధం ఉండడం లేదు. ఐదు ఎకరాలు కౌలు చేస్తున్న వారికి పదిసెంట్లు కౌలు చేస్తున్నట్లుగా కౌలు కార్డులిచ్చిన సంఘటనలున్నాయి.
 
సర్కారు తీరుతో మరింత అవస్థలు...
ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. ఫలితంగా కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఖరీఫ్‌లో కౌలు రైతులు తమకు ఇచ్చిన గుర్తింపు కార్డు ద్వారా బ్యాంకు నుంచి రుణసౌకర్యం పొందేవారు. అయితే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించి దానిని పూర్తిచేయకపోవడంతో బ్యాంకర్లు కౌలు రైతులకు రుణాలు ఇవ్వలేదు. అటు రుణమాఫీ కాక, ఇటు పెట్టుబడికి రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. కౌలు రైతులు వ్యవసాయ పెట్టుబడులతో పాటు అదనంగా ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకు రుణాలు అందకపోవడంతో కౌలుదారులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి వందకు రెండు నుంచి మూడు రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తున్నారు. చివరకు వడ్డీ తడిసి మోపెడవుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement