'ప్రభుత్వం మెడలు వంచి స్థలాలు సాధిస్తాం' | Sakshi
Sakshi News home page

'ప్రభుత్వం మెడలు వంచి స్థలాలు సాధిస్తాం'

Published Tue, Mar 22 2016 8:17 PM

Left parties protest in Vijayawada

విజయవాడ : పభుత్వం మెడలు వంచైనా పేదలకు ఇళ్ల స్థలాలు సాధిస్తామని, పేదలు, రైతుల భూములను కార్పొరేట్లకు కట్టబెడితే టీడీపీ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోతాయని వామపక్ష నేతలు హెచ్చరించారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పది కమ్యూనిస్టు పార్టీలు మంగళవారం చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శన నిర్వహించి జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభ జరిపారు. సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజలకు టీడీపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు అధికారం ఉంది కాబట్టి కొందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చేరుతున్నారని, అది నిజమైన బలం అనుకుని భ్రమపడొద్దని అన్నారు.

కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు 10 లక్షల ఎకరాల భూ బ్యాంకును సిద్ధంచేస్తున్న ప్రభుత్వం కనీసం ఒక లక్ష ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఎందుకు కేటాయించలేకపోతోందని ప్రశ్నించారు. ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని, ప్రభుత్వం స్పందించకుంటే రానున్న కాలంలో రెండు, మూడు రోజులపాటు రాజధానిని దిగ్బంధం చేస్తామని హెచ్చరిచారు. తెలంగాణలో 125గజాలు భూమి వరకు పేదలకు రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్పందించడం లేదని విమర్శించారు. పేదల భూముల కోసం సభ పెట్టుకునేందుకు కూడా పోలీసులు అనుమతికి ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. కనీసం పేదలు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు తమ సమస్యలపై వినతిపత్రం ఇస్తామంటే తీసుకునే తీరిక మంత్రులు, అధికారులకు లేదని, ఇంత నిరంకుశ, నిర్లక్ష్య ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదని అన్నారు. తాము నక్సలైట్లం కాదని, పేదల పొట్టగొట్టే ప్రభుత్వ నిరంకుశ వైఖరిని సాగినిచ్చేదిలేదని మధు హెచ్చరించారు.

సభకు అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని, ప్రతీ పేదవానికి ఇంటిజాగా, ఇళ్లు కట్టించి ఇస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 33లో ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలని డిమాండ్‌చేశారు. జన్మభూమిలో ఇళ్ల స్థలాల కోసం ఏకంగా 2,73,324 మంది దరఖాస్తులు చేసుకుంటే కేవలం 3,662 మంది మాత్రమే అర్హులుగా తేల్చిన ప్రభుత్వ తీరు దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు.

కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు కలిసివచ్చే పనులు చక్కబెట్టేందుకు పనిచేసే చంద్రబాబు కంప్యూటర్ పేదల భూముల విషయంలో పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపే ఇళ్లు, ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రామకృష్ణ హెచ్చరించారు. సభలో వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు ప్రసాద్ (సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ), అమర్నాథ్ (ఎస్‌యూసీఐ), గొడుగు సత్యనారాయణ(సీపీఐ ఎంఎల్ లిబరేషన్), గొల్లపూడి ప్రసాద్ (ఎంసీపీఐ), ముప్పాళ్ల నాగేశ్వరరావు (సీపీఐ), సీహెచ్ బాబూరావు (సీపీఎం), వై.వెంకటేశ్వర్లు(సీపీఎం) మాట్లాడారు.

ఎరుపెక్కిన బెజవాడ..
కనీసం మూడు సెంట్లు చొప్పున ఇళ్ల స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌పై ఎర్ర జెండాలతో పేదలు నిర్వహించిన భారీ ర్యాలీతో బెజవాడ ఎరుపెక్కింది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వచ్చిన వామపక్ష నేతలు, పేదలు మండే ఎండను సైతం లెక్కచేయక తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా జింఖానా గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విశాఖ, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రదర్శనకు వస్తున్న పలువురిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం గమనార్హం!

Advertisement
Advertisement