అటు హెలెన్ తుపాను ....ఇటు లెహర్ తుపాను | Sakshi
Sakshi News home page

అటు హెలెన్ తుపాను ....ఇటు లెహర్ తుపాను

Published Tue, Nov 26 2013 12:39 AM

leher storm may follow to helen storm

అమలాపురం, న్యూస్‌లైన్ :  నేలకొరిగిన వరి చేలు ముంపులోనే ఉన్నాయి. తోటల్లో విరిగిపడిన కొబ్బరి చెట్లు అలానే ఉన్నాయి. ఇప్పటీ విద్యుత్ సౌకర్యం లేక వందల ఊళ్లు అంధకారంలోనే ఉన్నాయి. ఈ సమయంలోనే ‘లెహర్’ పేరుతో మరో విపత్తు ముంచుకురావడం జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో హెలెన్ తుపాను బాధితులకు కనీసం సహాయ సహకారాలు అందికపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. కడుపు నింపేందుకు గుప్పెడు బియ్యం కూడా ఇవ్వని ప్రభుత్వ తీరును బాధితులు దుయ్యపడుతున్నారు.
 హెలెన్ కోనసీమను తాకి నాలుగు రోజులు కావస్తున్నా సాధారణ పరిస్థితులు ఇంకా నెలకొనలేదు.  విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నారు. శివారు గ్రామాల్లో తాగునీటి సరఫరా ఆరంభం కాలేదు. వర్షాలకు బావులు, చేతి పంపుల ద్వారా వచ్చే తాగునీరు కలుషితమవడంతో అంటు రోగాల బారిన పడతామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా రు. బాధితులకు రెండు రోజుల పాటు పునరావాస కేంద్రా లు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇళ్లు నష్టపోయిన వారు తలదాచుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఏదైనా ఉపద్రవం వస్తే ఏ ప్రభుత్వమైనా తక్షణ సాయంగా ఇచ్చేది బియ్యం, కిరోసిన్. రాష్ర్ట ప్రభుత్వం ఈ బాధ్యతను కూడా విస్మరిస్తోంది.

తుపానుకు వలలు నష్టపోవడం వల్ల మత్స్యకారులకు, పూర్తిస్థాయిలో పనులు లేక వ్యవసాయ కూలీలు, ఇళ్లు నష్టపోయి పనులకు వెళ్లలేనివారు పస్తులుండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమయంలో కనీసం ఆపన్న హస్తం కూడా అందించకపోవడంపై బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో వారం రోజుల పాటు కుంభవృష్టి కురిసినప్పుడు సైతం ప్రభుత్వం తక్షణం స్పందించి బాధితులకు బియ్యం, కిరోసిన్ అందించలేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈనెల 18న ఆదేశాలు జారీ చేయగా, తుపాను రావడంతో అదికాస్తా పూర్తిగా అందకుండా పోయింది. ఇక తాజా తుపానుకు ఇవ్వాల్సిన బియ్యం, కిరోసిన్ ఎప్పుడు అందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా నష్టపోయిన రైతులు హడావిడిగా పనలను తరలించి నూర్పులు చేసే పనిలో తలమునకలై ఉన్నారు.
 కాకినాడలో ఐదు కంట్రోల్ రూంలు
 కాకినాడ : తుపాను నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఐదు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్టు కమిషనర్ వి.రవికుమార్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో 2373136, అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో 2375987, రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో 2376300, విద్యుత్ కార్యాలయంలో 2366265, కలెక్టరేట్‌లో 1077(టోల్‌ఫ్రీ) నంబర్లతో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
Advertisement