బది‘లీల’లు | Sakshi
Sakshi News home page

బది‘లీల’లు

Published Sat, Aug 15 2015 3:09 AM

బది‘లీల’లు

 ఎమ్మెల్యేల లేఖ

♦ ఒంగోలులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పట్టుమని పది నెలలు కూడా కాకముందే అతని స్థానంలో మరొకరిని సిఫార్సు చేస్తూ స్థానిక ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. చీరాలలో డిప్యుటేషన్‌లో ఉన్న ఉద్యోగికి అక్కడే స్థానం కల్పించాలంటూ మరో ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారు. దీంతో తనకు ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదనుకున్న ఆ ఉద్యోగికి కూడా బదిలీ తప్పనిసరి పరిస్థితైంది. ఇలా ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తున్న స్థానాల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారికి మాత్రం మొండిచేయి చూపిస్తున్నారు. కనీసం తమకు కౌన్సెలింగ్ నిర్వహించి  బదిలీల అవకాశం కల్పించాలంటున్నా ససేమిరా అంటున్నారు.
♦ జెడ్పీలోలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్నవారిని మాత్రం బదిలీల పేరుతో బయటకు నెట్టాలని నిర్ణయించారు. వారి స్థానంలో అధికారపక్షం అండదండలున్న వారిని నియమించడానికి రంగం సిద్ధం చేశారు.
 
 సాక్షి ప్రతినిధి, ఒంగోలు, :  అధికార పార్టీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి సిఫార్సు లేఖ ఇస్తే పోస్టింగ్ ఖాయం. లేకపోతే ఎక్కడికి బదిలీ చేస్తారో ఎవరికీ తెలియదు. జిల్లాలో బదిలీలకు ఒక్కరోజే గడువు ఉండటంతో అడ్డతోవలు తొక్కడానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే, ఇన్‌ఛార్జీలు ఇచ్చిన లేఖలు తీసుకుని అధికారులు, సిబ్బంది క్యూ కట్టారు. ఎంపీడీవో బదిలీలు, జెడ్పీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖలో బదిలీలపై వివాదం నెలకొంది. నిబంధనలను పక్కన పెట్టి సిఫార్సులకే పెద్ద పీట వేయడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

జిల్లా పరిషత్ ఉద్యోగులకు సంబంధించి మినిస్టీరియల్ సిబ్బంది, నాల్గో తరగతి ఉద్యోగులు, రికార్డు అసిస్టెంట్ల బదిలీలను జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, అకౌంట్స్ ఆఫీసర్ ప్రారంభించారు. సాధారణంగా ఉద్యోగ సంఘాల నుంచి ఇద్దరు బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరవుతుండడం పరిపాటి. కానీ సంఘాల నాయకుల ప్రాతినిధ్యమే లేకపోవడం గమనార్హం. ఐదు సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు తప్పవని సూచించడంతో వారంతా దరఖాస్తులు చేసుకున్నారు.

కొంతమంది పరస్పరం బదిలీలు కోరుకున్నవారు కూడా తమ దరఖాస్తులను అధికారులకు పంపించారు. వారి విజ్ఞప్తుల మేరకు ముందస్తు బదిలీలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం నుంచి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో అధికారులు ప్రజాప్రతినిధులు సూచించిన వారికి బదిలీలు చేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో పైరవీలు దందాకు తెరలేచింది.

 ఎమ్మెల్యేలు లేనిచోట: మరో వైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట అధికార పార్టీ ఇన్‌ఛార్జులు కూడా సిఫార్సు లేఖలు హవా సాగింది. సంతనూతలపాడులో ఒక ఉద్యోగికి ఆ స్థానం ఖాళీ చేయాలంటూ లేఖ వచ్చింది. దీంతో అక్కడ ఉన్న ఉద్యోగిని ఎక్కడకు పంపిస్తారో మాత్రం తెలియని పరిస్థితి .

► పొదిలిలో ఒక ఉద్యోగిని మార్పు చేయాలంటూ ఒంగోలులో ఒక అధికార పార్టీ నాయకునితోపాటు మార్కాపురం ప్రాంతానికి చెందిన టీడీపీ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి నుంచి కూడా ఉత్తర్వులు అధికారులకు అందాయి.
► శుక్రవారం రాత్రి వరకు నిర్వహించినా బదిలీలు పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో శనివారం ఎంపీడీవో, సూపరింటెండెంట్లకు సంబంధించిన బదిలీలు నిర్వహించనున్నారు. వీటికి కూడా పెద్ద ఎత్తున సిఫార్సులు వచ్చాయి. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ పేరుతో ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటే కనీసం అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల విజ్ఞప్తి కూడా పరిగణనలోకి తీసుకోవాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘ నాయకులు ఇప్పటికే జెడ్పీ సీఈవోను, జిల్లా పరిషత్ చైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. పంచాయతీరాజ్ శాఖలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
► జిల్లాలో ముగ్గురు డివిజనల్ పంచాయతీ అధికారులు, 32 మంది ఈవోఆర్డీలు, మరో 500 మంది వరకు పంచాయతీ కార్యదర్శులున్నారు. కార్యదర్వులు ఇప్పటికే అధికార పార్టీ నుంచి లేఖలు తెచ్చుకుంటున్నారు. ఒంగోలు పక్కనే ఉన్న నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఏకంగా 25 మంది కార్యదర్శులకు సిఫార్సు లేఖలు ఇచ్చినట్లు సమాచారం. వ్యవసాయ శాఖలో కూడా బదిలీల ఫీవర్ కొనసాగుతోంది. శుక్రవారం జిల్లా సహకార అధికారితోపాటు సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారుల బదిలీలు జరిగాయి.

Advertisement
Advertisement