లూటీకి లెసైన్స్! | Sakshi
Sakshi News home page

లూటీకి లెసైన్స్!

Published Sat, Dec 27 2014 3:48 AM

లూటీకి లెసైన్స్!

కర్నూలు(జిల్లా పరిషత్) : కర్నూలు నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న ఓ వైద్యుని నుంచి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ప్రతి ఏటా రూ.10 వేల దాకా ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలు చేశారు. ఈ ఏడాది సదరు వైద్యుని ఆసుపత్రికి ట్రేడ్ లెసైన్స్ రశీదు అవసరమైంది. ఇదే విషయమై ఆయన మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని పిలిచి రశీదు ఇవ్వాల్సిందిగా కోరారు. రశీదు తెచ్చిస్తామని పలుమార్లు బుకాయించిన సిబ్బంది తీరా ఇవ్వకుండా ఉడాయించారు. దీంతో ఈ విషయమై కార్పొరేషన్ ఉన్నతాధికారి కల్పించుకుని రశీదు ఇప్పించినట్లు సమాచారం. వాస్తవానికి ఆ వైద్యులు కట్టింది రూ.10 వేలైతే రశీదు మాత్రం రూ.5 వేలకు ఇచ్చారు. మరో రూ.5 వేలు సిబ్బంది జేబుల్లోకి చేరాయి.
 
 మరో వైద్యుని వద్దకు కార్పొరేషన్ సిబ్బంది వెళ్లి మీకు తెలిసిన డాక్టర్ లెసైన్స్ ఫీజు రూ.10 వేలు ఇచ్చారని, బోగస్ రశీదు చూపారు. దాన్ని చూసి నిజమే అనుకుని ఆ డాక్టర్ కూడా రూ.10 వేలు సిబ్బంది చేతిలో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఈ ఇద్దరు డాక్టర్లు కలుసుకున్న సమయంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. నా దగ్గర కూడా కార్పొరేషన్ సిబ్బంది నువ్వు కట్టినట్లు రశీదు చూపించారని వాపోయారు. ఇద్దరినీ బోల్తా కొట్టించారని తెలుసుకున్నారు.
 
 పాతబస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ బంకుకు లెసైన్స్ ఫీజు చెల్లించాలని కార్పొరేషన్ సిబ్బంది వెళ్లారు. రూ.1000 ఫీజు అవుతుందని, మరో రూ.1000 కొత్త సారుకు ఇవ్వాలని చెప్పి రూ. 2 వేలు తీసుకున్నారు. నాలుగు రోజుల్లో రశీదు తెచ్చిస్తామని చెప్పి వెళ్లారు. రెండు నెలలైనా రశీదు తెచ్చివ్వకపోవడంతో ఆ బంకు యజమాని ఆందోళన చెందాడు. ఈ విషయమై తేల్చుకుందామని మున్సిపల్ కార్పొరేషన్‌కు వెళ్లి విచారిస్తే మీ బంకుకు అనుమతే ఇవ్వకూడదు. అయినా కార్పొరేషన్ స్థలంలో బంకు ఎలా పెట్టుకుంటావ్, వెంటనే తీసెయ్యు లేకపోతే పొక్లెయిన్ తెచ్చి తొలగిస్తామని బెదిరించడంతో అతడు చేసేదేమీ లేక వెళ్లిపోయాడు.
 
 ఇలా.. ట్రేడ్ లెసైన్స్ ఫీజు పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కర్నూలు నగరంలో చేస్తున్న వసూళ్ల పర్వంలో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నగరంలో వేల కొద్దీ ఉన్న వివిధ వ్యాపార వర్గాల నుంచి ట్రేడ్ లెసైన్స్ ఫీజు పేరుతో శానిటరి ఇన్స్‌పెక్టర్లు, మేస్త్రీలు వేల రూపాయలు వసూలు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్‌లో చెల్లించకుండా ఖజానాకు భారీగా కన్నం వేస్తున్నారు. ఈ విషయం తెలిసినా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
 మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1995, సెక్షన్ నెం.521 ప్రకారం ఏ వ్యాపారి అయినా వ్యాపారం చేసుకోవాలంటే వారి దగ్గర కార్పొరేషన్ వ్యాపార లెసైన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఏపీ మున్సిపాలిటి చట్టం, సెక్షన్ 263లో కూడా ఇలాంటి చట్టం ఉంది. వ్యాపారి కచ్చితంగా లెసైన్స్ తీసుకోవాలని ఇందులో ఉంది. కాని కొందరు వ్యాపారులు మాత్రం లెసైన్స్‌లు లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు గత ఏడాది అక్టోబర్‌లో ప్రిన్సిపల్ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లకువిజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్  నివేదిక సమర్పించారు. గత ఏడాది విజిలెన్స్ అధికారులు రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటిలు, కార్పొరేషన్లలో ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూళ్లపై విచారణ చేశారు. మున్సిపల్ రికార్డుల ప్రకారమే భారీగా ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలు కావడం లేదని తేల్చారు. ఈ మేరకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
 
 కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 208 నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌లు ఉన్నాయి. అందులో 16 నర్సింగ్ హోమ్‌లు, 3 క్లినిక్‌లకు మాత్రమే ట్రేడ్ లెసైన్స్‌లు ఉన్నట్లు చూపారు. మిగిలిన 38 నర్సింగ్ హోమ్‌లు, 151 క్లినిక్‌లకు వ్యాపార లెసైన్స్‌లు లేవు. వీటికి లెసైన్స్‌లు లేని కారణంగా కార్పొరేషన్ ప్రతి యేటా రూ.78,70,500 ఆదాయం కోల్పోతోంది. కర్నూలులో 170 రెడీమేడ్ షాపులు, 22 చీరల షోరూమ్‌లు, 215 క్లాత్‌షోరూమ్‌లు, 27 గార్మెంట్ షాపులు, ఒక హ్యాండ్‌లూమ్ షాప్, 3 గోడౌన్లు, 201 మార్కెట్‌యార్డు షాపులు కలిపి 640 దుకాణాలు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు వివరాలు సేకరించారు.
 
 వీటిలో కేవలం 88 షాపులకు మాత్రమే వ్యాపార లెసైన్స్‌లు ఉన్నట్లు అధికారులు చూపించారు. మిగతా 551 షాపులు లెసైన్స్ లేకుండానే నిర్వహిస్తున్నారట. ఈ లెక్కన లెసైన్స్‌లేని షాపుల నుంచి అధికారిక లెక్కల ప్రకారం రూ. 1,08,45,000 రావాల్సి ఉంటుంది. కేవలం ఆసుపత్రులు, బట్టల షాపులు, మార్కెట్‌యార్డు షాపుల నుంచే లెసైన్స్‌లు లేని కారణంగా రూ. 1,87,15,000 ఆదాయాన్ని ప్రతి సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్ కోల్పోతోంది. దీన్ని బట్టి ట్రేడ్ లెసైన్స్ జారీ విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది.
 
 రావాల్సింది కొండంత.. వస్తోంది గోరంత
 కర్నూలు నగర పాలక సంస్థలో ఎన్ని ట్రేడ్ లెసైన్స్‌లు ఉన్నాయనే సమాచారంపై ఎవరూ నోరు విప్పరు. ఎవరు వెళ్లినా వివరాలు కావాలంటూ రోజుల తరబడి కార్పొరేషన్ చుట్టూ తిరగాల్సిందే. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్  పీవీవీఎస్ మూర్తిని వివరణ కోరగా ఆయన నాలుగేళ్లలో ఎంత లక్ష్యం ఉంది, ఎంత వసూలైందనే వివరాలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన వివరాల ప్రకారం 2011-12లో రూ.62 లక్షల ట్రేడ్ లెసైన్స్ ఫీజు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా రూ.50.75 లక్షలు మాత్రమే వసూలు చేశారు. 2012-13లో రూ.82.77 లక్షలకు గాను రూ.70.40 లక్షలు, 2013-14లో రూ.87.78 లక్షలకు గాను రూ.74.29 లక్షలు, 2014-15లో రూ.95.38 లక్షలకు గాను నవంబర్ వరకు రూ.77.46 లక్షలు మాత్రమే వసూలు చేశారు. కేవలం విజిలెన్స్ నివేదికల ప్రకారం బట్టల దుకాణాలు, మార్కెట్‌యార్డు షాపులు, నర్సింగ్ హోమ్‌లు, క్లినిక్‌ల బకాయిలే రూ.1.87 కోట్లు ఉండటం గమనార్హం. ఈ లెక్కన అన్ని వ్యాపారాల నుంచి లెసైన్స్ ఫీజు వసూలు చేస్తే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ మున్సిపల్ అధికారులు మాత్రం సంవత్సరానికి టార్గెట్ రూ.95.38 లక్షలు మాత్రమే చూపడం అనుమానాలకు తావిస్తోంది.
 
 అధికారుల జేబుల్లోకి ప్రజల సొమ్ము
 కర్నూలు కార్పొరేషన్‌లో కోట్లలో వసూలవుతున్న ప్రజల డబ్బు కొందరు అధికారుల జేబుల్లోకి వెళుతోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు, మున్సిపల్ అదికారులు ఇస్తున్న వివరాలను బట్టి అర్థం అవుతోంది. రహదారి పక్కన చిన్న బంకు పెట్టుకున్నా ముక్కుపిండి ట్రేడ్ లెసైన్స్ ఫీజు పేరిట డబ్బులు వసూలు చేసే మున్సిపల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఫీజు వసూలు కావడం లేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి సంవత్సరం కోట్లలో ఫీజులు వసూలు చేస్తూ లక్షల్లో మాత్రమే కార్పొరేషన్ ఖజానాలో వేస్తున్నారన్న విమర్శలూ వ్యక్తం అవుతున్నాయి.
 
 చట్టం ఏం చెబుతోందంటే...!
 మున్సిపల్ చట్టం ప్రకారం అధికారులు జారీ చేసిన లెసైన్స్‌లో ఆ లెసైన్స్ చెల్లుబాటు కాలం, దానికి సంబంధించిన నిబంధనలు, నియమావళి తెలపాలి. లెసైన్స్ ఇచ్చినప్పుడు దానిపై మున్సిపల్ కమిషనర్‌తో సంతకం చేయించాలి. ఈ విషయం సెక్షన్ 119లో కూడా పేర్కొన్నారు.
 
 ఎంత ఫీజు తీసుకోవాలి
 లెసైన్స్ ఇచ్చేసమయంలో కొంత ఫీజు వసూలు చేస్తారు. ఆ రేటు ఎప్పటికప్పుడు కమిషనర్ విధిస్తారు. అది కూడా కౌన్సిల్ అనుమతితో జరగాలి. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం సెక్షన్ 521(1), (ఇ) ఆసుపత్రులు, క్లినిక్‌లు నడుపుకోవడానికి నియమాలు ఈ విధంగా ఉన్నాయి. సెక్షన్ 521 ప్రకారం కొన్ని వ్యాపారాలు కచ్చితంగా వ్యాపార లెసైన్స్ లేకుండా చేయకూడదు. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్స్‌కు ఒకటి నుంచి 30 పడకలకు సంవ త్సరానికి రూ.5 వేలు, 31 నుంచి 40 పడకలకు రూ.8 వేలు, 41 నుంచి 50 లేదా అంతకన్నా ఎక్కువ పడకలుంటే రూ.10 వేలు ఫీజు వసూలు చేయాలి. ఆయుర్వేదం, హోమియో, యునాని, అల్లోపతి క్లినిక్‌లకు సంవత్సరానికి రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
 
 
 రెడీమేడ్ బట్టల దుకాణాలకు రూ.1000, రూ.2 వేలు, రూ.5 వేలు, కట్‌పీస్ క్లాత్ షోరూంకు రూ.2 వేలు, చీరల షోరూం లెసైన్స్ ఫీజు రూ.2 వేల నుంచి రూ.5 వేలు, ప్రభుత్వ దుకాణానికి రూ.1000, హ్యాండ్‌లూమ్ షాపు లెసైన్స్ రూ.2 వేలు, గోడౌన్ లెసైన్స్ ఫీజు రూ.500 వసూలు చేస్తారు. వ్యాపారులు గడువులోగా లెసైన్స్ ఫీజు చెల్లించలేకపోతే 60 రోజుల్లోపు 25 శాతం అపరాధ రుసుము, 60 రోజులు దాటితే 50 శాతం అపరాధ రుసుము వసూలు చేస్తారు.
 

Advertisement
Advertisement