హత్యా రాజకీయాల చరిత్ర మీది | Sakshi
Sakshi News home page

హత్యా రాజకీయాల చరిత్ర మీది

Published Sun, Mar 6 2016 3:08 AM

హత్యా రాజకీయాల చరిత్ర మీది - Sakshi

మనుషులకు కొమ్ములుంటాయా?  జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావే..
బినామీల పేరిట భూములు కొన్న మీ మంత్రులు, ఎంపీలు ఎవరో నీవే చెప్పాలి
పయ్యావుల కేశవ్ పై వైఎస్సార్‌సీపీ నాయకుల ధ్వజం
 

 
 అనంతపురం : ‘వైఎస్ జగన్‌కేమైనా కొమ్ములున్నాయా? అంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు, మనుసులకు ఎక్కడైనా కొమ్ములుంటాయా? అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.శంకరనారాయణ మండిపడ్డారు. శనివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత కేశవ్‌కు లేదన్నారు. రాజధాని భూముల్లో అక్రమాలు జరిగాయంటూ ‘సాక్షి’లో కథనాలు వస్తే తమ అధినేత స్పందించాలంటున్నారని, మరి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తే సీఎం చంద్రబాబు స్పందిస్తారా అంటూ ప్రశ్నించారు.

భూస్వాముల కుటుంబం అని చెప్పుకుంటున్న కేశవ్ చరిత్ర ఉరవకొండ నియోజకవర్గంలో అందరికీ తెలుసన్నారు. హత్యా రాజకీయాలను నడిపిన కుటుంబం మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఎకరాల భూమి కోసం ఓ సాధారణ బీసీ మహిళను ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రజల తెలియందా? ఆమె భర్తను హతమార్చిన కేసులో మీ సోదరుడు శీనప్ప లేడా? అని ప్రశ్నించారు. మాజీ మేయర్ రాగే పరుశురాం మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో దళిత, పేద రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం రాదని భయపెట్టి తక్కువ ధరలకే కొట్టేశారన్నారు. రాజధాని ముమ్మాటికీ ఓ పెద్ద స్కాం అన్నారు.

ఔటర్ రింగు రోడ్డుకు స్థల సేకరణ విషయంలో ఆరోపణలు వస్తే సీబీఐతో విచారణ చేయించిన ఘనత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దక్కిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కూడా ఆరోపణలపై సశ్ఛీలతను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. తాను మగాడిలా భూములు కొనుగోలు చేశానని చెబుతున్న కేశవ్... బినామీల పేరిట కొనుగోలు చేసిన ఆ పార్టీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరో ఆయనే చెప్పాలన్నారు. పార్టీ క్రమశిక్షణ  కమిటీ సంఘం సభ్యుడు బీ.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి జిల్లాలో వందల ఎకరాల భూములు ఉన్నాయని ఆరోపించారు.

యితే వాటిని ఎవరూ తప్పుబట్టడం లేదు.. మీ నాయకులు చేసిన తప్పులను ఎత్తి చూపుతున్నామని అన్నారు. ఒకటి మాట్లాడితే మరొకటి సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి డాక్టర్ మైనుద్దీన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పరుశురాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement