కాకినాడ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ | Sakshi
Sakshi News home page

కాకినాడ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌

Published Fri, Aug 18 2017 1:27 AM

Line clear of Kakinada elections

సాక్షి, హైదరాబాద్‌: కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికలు నిర్వహించకుండా స్టే మంజూరు చేయాలన్న అనుబంధ పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకి తొలగింది. అయితే ఎన్నికల ఫలితాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయని న్యాయమూర్తి తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

 స్టే మంజూరు చేయాలన్న అనుబంధ పిటిషన్లను డిస్మిస్‌ చేసిన హైకోర్టు.. ప్రధాన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించింది. ప్రతివాదులైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాదనలతో కౌంటర్‌ పిటిషన్లను దాఖలు చేయాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు గురువారం ఆదేశించారు. నోటిఫికేషన్‌ జారీ అయ్యాక ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉటంకించిన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.

 రాష్ట్ర విభజన నేపథ్యంలో మేయర్‌ రిజర్వేషన్‌ను తిరిగి చేపట్టాలంటూ దాఖలైన వ్యాజ్యంపై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement