గీత దాటితే వేటే | Sakshi
Sakshi News home page

గీత దాటితే వేటే

Published Thu, Oct 9 2014 4:16 AM

గీత దాటితే వేటే - Sakshi

  • అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసు అధికారులను  కఠినంగా శిక్షిస్తాం
  •  150 అధునాతన సీసీ కెమెరాలతో తిరుపతి నగరంలో నిఘా
  •  ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టే వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక
  •  ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి స్పష్టీకరణ
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘భూవివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేసే పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్ట ప్రకారం భూ వివాదాలను పరిష్కరించకుండా దాటవేసినా చర్యలు తప్పవు. నిబంధనల మేరకు ప్రజలకు న్యాయం చేసి పోలీసు ప్రతిష్ఠను ఇనుమడింపజేస్తా’అని తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి స్పష్టీకరించారు. వరుస దోపిడీలు, ఎర్రచందనం స్మగ్లింగ్, ట్రాఫిక్ సమస్య, ల్యాండ్ సెటిల్‌మెంట్లు తదితర అంశాలపై ఎస్పీ గోపీనాథ్ జట్టిని ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు..
     
    సాక్షి: తిరుపతిలో దోపిడీలు, దొంగతనాలు పెరిగిపోయాయి. వాటికి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
    ఎస్పీ: గతంలో దోపిడీలు, దొంగతనాలు కొన్ని ప్రాంతాల్లోని గ్యాంగ్‌లు చేసేవి. ఆ గ్యాంగ్‌లను త్వరగా పట్టుకునేవాళ్లం. ఇటీవల కొత్త వ్యక్తులు చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, రాబరీలకు పాల్పడుతున్నారు. అందువల్ల వారిని పట్టుకోవడం కొంచెం కష్టంగా మారింది. అయినా.. రెండు నెలలుగా దొంగతనాలను అరికట్టడంలోనూ చోరీ సొమ్మును రికవరీ చేయడంలోనూ ముందున్నాం. దోపిడీ దొంగతనాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేశాం. తిరుపతి నగరంలో 150 అధునాతన ఇన్‌ఫ్రారెడ్ టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటుచేస్తున్నాం. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నగరంలో స్థితిగతులను విశ్లేషిస్తాం. బీట్స్ పెంచుతాం. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద బీట్స్ ఏర్పాటు చేస్తాం. బ్లూకోల్ట్స్‌ను అధికం చేస్తాం. నిఘా పటిష్టం చేయడం.. పర్యవేక్షణను అధికం చేయడంతో చోరీలకు అడ్డుకట్ట వేస్తాం.
     
    సాక్షి: శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ఎలా అడ్డుకట్ట వేస్తారు?
    ఎస్పీ: ఎర్రచందనం స్మగ్లర్లను కొందరిని ఇప్పటికే అరెస్టు చేశాం. స్మగ్లర్లకు సహకరిస్తున్న పోలీసు అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరికొందరిపై తీసుకోనుంది. అటవీశాఖలో స్మగ్లర్లకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. శేషాచలం అడవులపై గట్టి నిఘా వేశాం. బడా స్మగ్లర్లు, చోటా స్మగ్లర్లు, మేస్త్రీలు, కూలీలు, స్మగ్లింగ్‌కు వాహనాలను ఏర్పాటుచేసే ట్రాన్స్‌పోర్టు సంస్థలపై గట్టి నిఘా ఏర్పాటుచేశాం. దీని వల్ల శేషాచలం అడవుల్లో ఎర్రచందనం వృక్షాల నరికివేతను కొంత మేర అడ్డుకోగలిగాం. రెండు మూడు నెలల్లో స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో అడ్డుకుని తీరుతాం.
     
    సాక్షి: తిరుపతి, ఏర్పేడు, రేణిగుంట, శ్రీకాళహస్తి పరిధిలో కొందరు పోలీసు అధికారులు ల్యాండ్ సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
    ఎస్పీ: సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చకూడదు. కానీ.. సివిల్ వివాదంలో క్రిమినల్ కోణం ఉంటే పోలీసులు జోక్యం చేసుకోవాలి. భూమి యజమాని ఒకరైతే.. మరొకరు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆ భూమిని ఆక్రమించుకునేయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో న్యాయం చేయాలని భూ యజమాని పోలీసులను ఆశ్రయిస్తే.. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందే. అలా కాకుండా కబ్జాదారుల తరఫున సెటిల్‌మెంట్లు చేసే పోలీసు అధికారులను వదిలి పెట్టేది లేదు. ల్యాండ్ సెటిల్‌మెంట్లకు పాల్పడిన ఇద్దరు పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపాం.
     
    సాక్షి: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో హైటెక్ వ్యభిచారం సాగిస్తున్నారు. హెరాయిన్, బ్రౌన్‌షుగర్ యువతకు విక్రయిస్తున్నారు. వీటిని ఎలా అడ్డుకుంటారు?

    ఎస్పీ: హైటెక్ వ్యభిచారం సాగుతున్న అంశం మా దృష్టికి వచ్చింది. తనిఖీలను ముమ్మరం చేస్తాం. హైటెక్ వ్యభిచారం నిర్వహించే వారిపై, హెరాయిన్, బ్రౌన్‌షుగర్ వ్యాపారం చేస్తున్న స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
     
    సాక్షి: తిరుపతి నగరంలో అస్తవ్యస్త ట్రాఫిక్‌ను ఎలా చక్కదిద్దుతారు?
    ఎస్పీ: ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. 150 ప్రదేశాల్లో అధునాతన సీసీ కెమెరాలను ఏర్పాటుచేశాం. 17 ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశాం. మరో 33 ప్రాంతాల్లో త్వరలోనే ఏర్పాటుచేస్తాం. ట్రాఫిక్ విభాగానికి ఓ డీఎస్పీతో పాటూ ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచాం. వారంలో రెండు సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం. బస్సులు, స్కూల్ వ్యాన్‌లు, లారీలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం. మద్యం సేవించి వాహనాలను నడిపే వారిపై జరిమానా విధించడమే కాదు.. న్యాయస్థానంలో ప్రవేశపెట్టి శిక్షపడేలా చేస్తాం. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమించిన వారిపై భారీ ఎత్తున జరిమానా విధిస్తాం.
     
    సాక్షి: తిరుపతి అర్బన్ జిల్లాలో పోలీసులకు వీక్లీ ఆఫ్ సౌకర్యం లేదు. దీనిపై మీ స్పందన..

    ఎస్పీ: పోలీసు సిబ్బంది తక్కువగా ఉన్నారు. సిబ్బంది విభజన కూడా పూర్తి కాలేదు. తిరుపతి నగరంలో ట్రాఫిక్, సీసీఎస్ విభాగాలతో పాటు లా అండ్ ఆర్డర్‌కు సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇస్తాం.
     

Advertisement
Advertisement