రెండో సంతకంపైనా అలుసు.. జిల్లాల్లో ఆగని ‘గొలుసు’.. | Sakshi
Sakshi News home page

రెండో సంతకంపైనా అలుసు.. జిల్లాల్లో ఆగని ‘గొలుసు’..

Published Mon, Mar 23 2015 8:02 AM

రెండో సంతకంపైనా అలుసు.. జిల్లాల్లో ఆగని ‘గొలుసు’.. - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల సాక్షిగా సీఎం చంద్రబాబు రెండో సంతకం చేసిన మద్యం బెల్టు షాపుల నిర్మూలన వ్యవహారం ప్రహసనంగా మారింది. గతం కంటే జిల్లాల్లో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న మద్యం గొలుసు దుకాణాల్ని సమూలంగా నిర్మూలించకుండా ఎకై్సజ్ యంత్రాంగం కేవలం కేసులకే పరిమితమవుతోంది. అటు మద్యం వ్యాపారుల జోలికెళ్లకుండా మొక్కుబడిగా కేసులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా పది నుంచి 25 బెల్టు షాపులు నడుస్తున్నా.. వీటి గురించి పూర్తిగా తెలిసినా ఎకై్సజ్ అధికారులు మద్యం లెసైన్సీలకు సహకారం అందిస్తున్నారు. బెల్టు షాపులు నడుపుతున్న వారిపై గత పదినెలల్లో ఆరువేల కేసులు నమోదు చేశామని లెక్కలు చెబుతున్నారే తప్ప బెల్టు షాపులకు మద్యం సీసాలు సరఫరా చేసే లెసైన్సీలపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

బెల్టు షాపుపై దాడిచేసి మద్యం సీసాలు పట్టుకుంటే వాటి మూతలపై ఉండే ఎడెసివ్ లేబుళ్ల ఆధారంగా అవి ఏ షాపు నుంచి వచ్చాయో తెలుస్తుంది. దీని ఆధారంగా బెల్టు షాపుల్ని ప్రోత్సహించే లెసైన్సీల నుంచి మొదటిసారి జరిమానాగా నిర్ణీత కాంపౌండ్ ఫీజు వసూలు చేయడం, రెండోసారి పట్టుబడితే షాపును సీజ్ చేసేందుకు ఆదేశాలున్నా.. ఆ దిశగా ఎకై్సజ్ అధికారులు స్పందించటంలేదు. కేవలం బెల్టు షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నామని లెక్కలు చెబుతున్నారు. ఎకై్సజ్ అధికారులు, లెసైన్సీలు విస్కీ, సోడాల్లా కలిసిపోయి పరస్పర సహకారం అందించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.
 
డీ అడిక్షన్ సెంటర్లేవి?
అధికారంలోకి రాగానే రెండో సంతకం చేసి మద్యం బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు ఆ సంతకాన్ని పరిహాసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కావడంలేదు. ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

రాష్ట్రంలో నాలుగువేలకుపైగా మద్యం దుకాణాలున్నాయి. ఈ దుకాణాలకు అనుబంధంగా సగటున 15 చొప్పున బెల్టు షాపులున్నట్లు ఎకై్సజ్ అధికారులే అంచనా వేస్తున్నారు. అంటే 60 వేలకు పైగా బెల్టు షాపులకుగాను గత పదినెలల్లో ఆరువేల కేసులు బుక్ చేశామని ఎకై్సజ్ అధికారులు చెప్పడం గమనార్హం.

Advertisement
Advertisement