సచివాలయాలకు అమ్మఒడి జాబితాలు  | Sakshi
Sakshi News home page

సచివాలయాలకు అమ్మఒడి జాబితాలు 

Published Tue, Dec 31 2019 10:29 AM

List Of Amma Vodi Scheme To Secretariats - Sakshi

విజయనగరం అర్బన్‌: వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ‘అమ్మ ఒడి’ పథకం చివరి అంకానికి చేరింది. అర్హులు, అనర్హులు, అభ్యంతరాల జాబితాలు సిద్ధమయ్యాయి. మరోసారి పరిశీలనకు సచివాలయాలకు చేరాయి. సాధికార సర్వే అనుసంధానంలో జరిగిన తప్పిదాలను నిరూపించే ధ్రువపత్రాలను రెండురోజుల్లోక్షేత్రస్థాయిలోని సచివాలయాలకు అందజేసి పథకం లబ్ధి పొందాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.    

తొలిజాబితా అర్హులు 3.1 లక్షల మంది..  
ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘అమ్మ ఒడి’ పథకం తొలి జాబితాలో జిల్లా నుంచి  3,17,294 మంది విద్యార్థులు, వారి తల్లులను అర్హులుగా ప్రకటించారు. జిల్లాలోని పథకం కోసం ఒకటి నుంచి 10వ తరగతి పాఠశాల, రెండు సంవత్సరాల ఇంటరీ్మడియట్‌ విద్యార్థులు 3,70,565 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటి నుంచి క్షేత్రస్థాయి సచివాలయాలకు వెళ్లిన మూడు జాబితాలను పంపారు. అన్ని అర్హతలను నిర్ధారించుకొని అనుమతి పొందిన తల్లులు 3,17,294 మంది ఉన్నారు. మరోసారి విచారణ చేయాల్సిన జాబితాలో 21,886 మంది ఉండగా, సాధికార సర్వే అనుసంధానంతో సరిచేసిన కారణంగా అర్హతను కోల్పోయిన వారు 31,385 మంది విద్యార్థులు ఉన్నారు.  

సవరించాల్సినవి అర్బన్‌ ప్రాంతాల్లోనే అధికం 
సాధికార సర్వే అనుసంధానంతో అనర్హులుగా మిగిలిన సంఖ్యలో అధికులు జిల్లాలోని పట్టణ ప్రాంతీయులే ఉన్నారు. సాధికార సర్వే అనుసంధానంతో అనర్హులుగా చూపిన జాబితాలో అత్యధికంగా జిల్లాలోని విజయనగరం అర్బన్‌ ప్రాంతంలో 9,051 మంది ఉండగా అత్యల్పంగా నెల్లిమర్ల నగర పంచాయతీలో 287 మంది ఉన్నారు. రీ ఎంక్వైరీ జాబితాలో కూడా విజయనగరం అర్బన్‌లో అధికంగా 3,892 మంది ఉండగా అత్యల్పంగా  నెల్లిమర్ల నగర పంచాయతీలో 134 మంది ఉన్నారు. విజయనగరం అర్బన్‌లో నమోదు చేసిన విద్యార్థుల తల్లులు 41,600 ఉండగా వారిలో 28,657 మంది మాత్రమే తొలి విడత అర్హులయ్యారు. అలాగే,  జిల్లాలోని 34 మండలాల్లో అత్యధికంగా 13,478 మందిలో తొలి జాబితాల్లో 12,242 మంది అర్హులై పూసపాటిరేగ మండలం మొదటి స్థానంలో ఉంది. తరువాత వరుసలో ఎస్‌.కోట మండలం 11,245 మంది నమోదులో 9,578 మంది అర్హులయ్యారు. 

రెండురోజుల్లో సవరించుకోవచ్చు 
జిల్లాలోని ‘అమ్మ ఒడి’ తొలి జాబితా విడుదలైంది. అర్హులెవరూ నష్టపోరాదనే ఉద్దేశంతో మూడు విభాగాలుగా జాబితాను విడుదల చేశాం. అర్హుత పొందిన జాబితాతో పాటు రీ ఎంక్వైరీ జేయాల్సిన జాబితా ప్రకటించాం. సాధికార సర్వే అనుసంధానంలో ఇబ్బందుల వల్ల అనర్హులుగా ప్రకటించిన మరో జాబితా కూడా విడుదల చేశాం. అనర్హతగా నమోదయన అంశాలపై తాజాగా ఎలాంటి ధ్రువపత్రాలున్నా క్షేత్రస్థాయిలో సవరించే అవకాశం ఉంది. రెండురోజుల్లో  సవరించిన, రీ ఎంక్వైరీ చేసిన జాబితాను ఉన్నతాధికారులకు పంపాలి.      – జి.నాగమణి, డీఈఓ 

Advertisement
Advertisement