తెప్ప తగలేస్తారా? | Sakshi
Sakshi News home page

తెప్ప తగలేస్తారా?

Published Sun, Jul 27 2014 12:33 AM

తెప్ప తగలేస్తారా? - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రుణమాఫీని బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ‘నరకాసుర వధ’ పేరిట పార్టీ శ్రేణులు చేపట్టిన ఆందోళనల్లో చివరి రోజు శనివారం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. రైతులు, డ్వాక్రా మహిళలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని చంద్రబాబు అవకాశ వాదంపై దుమ్మెత్తిపోశారు.
 
 ‘రుణాలు కట్టకండి..అధికారంలోకి రాగానే మాఫీ చేస్తా’నన్న చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మాట మార్చి రూ.లక్షన్నర మేర మాత్రమే రుణమాఫీ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం బ్యాంకర్లు రుణాలు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలతో పాటు మారుమూల గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
 
  వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట కళామందిరం సెంటరులో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం జరిగింది. పోలీసులు ఆ ప్రయత్నాన్ని నిలువరించడంతో అక్కడే ధర్నా చేపట్టారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
 
  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దుగ్గిరాల మం డలం చుక్కావారిపాలెంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ధర్నా  నిర్వహించారు.  బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో పట్టణంలోని గడియారం స్తంభం సెంటరులో ధర్నా జరిగింది. వెదుళ్లపల్లి గ్రామంలో ఐదు గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాస్తారోకో నిర్వహించారు.  ప్రత్తిపాడు నియోజకవర్గంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డిల ఆధ్వర్యంలో కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
 గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు నిలువరించి, వారిని అరెస్టు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై ఎమ్మెల్యేను విడుదల చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో కొల్లూరు మండలంలో కార్యకర్తలు, నాయకులు ధర్నా చేశారు.వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో కొల్లూరు మండలంలో పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు దానిని నిలువరించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురంలో మాజీ ఎంపీపీ చుండూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు.
 

Advertisement
Advertisement