‘స్థానిక’ పోరు | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పోరు

Published Wed, Mar 5 2014 3:39 AM

'Local' Fighting

 సాక్షి, కర్నూలు/అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. గతంలో నిలిచిపోయిన రిజర్వేషన్లను జిల్లా పరిషత్ అధికారులు ఖరారు చేశారు. న్యాయస్థానం ఆదేశాలతో పురపాలక ఎన్నికల నగారా మోగినందున.. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2013 ఆగస్టు నాటికే ఎంపీటీసీ(మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుడు), జెడ్పీటీసీ(జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు) స్థానాల జాబితా రూపొందించాల్సి ఉంది.
 
 తొలుత 2001 జనాభా లెక్కల ప్రకారం స్థానాల గుర్తింపు పూర్తి చేశారు. సమ్మె నేపథ్యంలో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు 2011 జనాభా ప్రాతిపదికన స్థానాలను ఖరారు చేయాలని ఆదేశించింది. అధికారులు కొత్త జనాభా ప్రాతిపదికన స్థానాలను ప్రాథమికంగా గుర్తించారు. ప్రక్రియను అక్టోబర్‌లోనే పూర్తిచేశారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో ఆయా స్థానాల వివరాలతో కూడిన ప్రాథమిక జాబితాను అందుబాటులో ఉంచారు. నవంబర్ మూడో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. నవంబర్ 12న తుది జాబితాను ప్రకటించాల్సిన సమయంలో ప్రక్రియ నిలిచిపోయింది. దీనిని మళ్లీ పునరుద్ధరించినట్లు జెడ్పీ డిప్యూటీ సీఈవో జయరామ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
 
 మూడేళ్లుగా అధికారుల పాలన
 53 జెడ్పీటీసీలకు, 815 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 2011 జూలైలో పాలక వర్గాలు ముగియడంతో సుమారు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యేక పాలనలో వైఫల్యాలు వెలుగుచూశాయి. ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ప్రజా సమస్యలపై తీర్మానాలు జరగని పరిస్థితి. ఇంకోవైపు నిధుల కొరత  తలెత్తింది. కేంద్రం నుంచి నిధుల్లో కోత పడ్డాయి. ఖరారు చేసిన జాబితా ఆధారంగా ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. గడిచిన ఎన్నికల్లో 777 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ప్రస్తుతం ఐదు నగర పంచాయతీలను మినహాయించగా.. ఆ సంఖ్య 815కు చేరుకుంది.
 
 ఎంపీటీసీ రిజర్వేషన్లు
 జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల డివిజన్లలో మొత్తం 815 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఎస్‌టీలకు 18, ఎస్‌సీలకు 161, బీసీలకు 323, జనరల్‌కు 313 రిజర్వు చేశారు. వీటిలో మహిళలకు 408, జనరల్‌కు 407 రిజర్వు అయ్యాయి. మండలాల వారీగా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు, మహిళలకు కేటాయించిన స్థానాలకు రిజర్వేషన్లు ప్రక్రియ పూర్తి కాగా.. ఆ జాబితాలను బుధవారం సంబంధిత ఆర్డీవోలకు అందజేయనున్నారు. ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఆయా మండలాల్లో రిజర్వేషన్ల వారీగా ఏ స్థానం ఎవరికి దక్కుతుందో నిర్ణయిస్తారు. మండలాల వారీగా స్థానాల సంఖ్యను మాత్రమే జిల్లా పరిషత్ అధికారులు ఖారారు చేశారు. కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఈ రిజర్వేషన్లను మంగళవారం రాత్రి ఆమోదించారు. గురువారం లోపు జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిసింది.
 

Advertisement
Advertisement