లాక్‌డౌన్‌: బిడ్డ చెంతకు తల్లి 

2 May, 2020 09:06 IST|Sakshi
కుమార్తెకు ప్రేమగా భోజనం తినిపిస్తున్న తల్లి రుక్మిణి ప్రియ

ఎమ్మెల్యే శిల్పా రవి చొరవతో సమస్య పరిష్కారం  

సాక్షి, బొమ్మలసత్రం: లాక్‌డౌన్‌తో ఒక చిన్నారి 40 రోజుల పాటు తల్లికి దూరమైంది. వైఎస్సార్‌ జిల్లాలో కుమార్తె, నంద్యాలలో తల్లి  ఉండిపోయారు. వీరి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి స్పందించి.. చిన్నారి వద్దకు తల్లి వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇప్పించాడు. పట్టణంలోని స్థానిక ఎస్‌బీఐ కాలనీలో రవికుమార్, నాగకుమారి దంపతులు చిన్న హోటల్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 15 ఏళ్ల కుమారుడుతో పాటు 4 ఏళ్ల చిన్నారి సంతానం. గత నెల 18తేదీన వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో నివాసముంటున్న రవికుమార్‌ తమ్ముడు, భార్య నంద్యాలకు వచ్చారు. రవికుమార్‌ కుమార్తె రుక్మిణిప్రియ తన బాబాయి వెంట పులివెందులకు వెళ్తానని మారం చేసింది.

దీంతో చేసేది లేక చిన్నారిని ఒక వారం తన తమ్ముడు వద్ద ఉంచుకుని తిరిగి నంద్యాలకు పంపమని వారి  పులివెందులకు పంపించాడు. అయితే అనుకోని రీతిలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేయటంతో ప్రియ అక్కడే ఉండిపోయింది. రోజులు గడిచే కొద్ది తల్లి కోసం ఏడవటం మొదలు పెట్టింది. గత వారం నుంచి తల్లి కావాలంటూ అన్నం తినడం మానేసింది. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండటంతో నంద్యాలలో ఉంటున్న తల్లి ఆందోళన చెందింది. మూడు రోజుల క్రిందట ప్రియను తీసుకొచ్చేందుకు తండ్రి రవికుమార్‌ నంద్యాలను బయలుదేరాడు.

అయితే జమ్మలమడుగులో పోలీస్‌ అధికారులు అడ్డుకుని తిరిగి వెనక్కు పంపారు. కూతురు ఆరోగ్యంపై తల్లి, తండ్రికి ఆందోళన ఎక్కువైంది. ఆనోటా ఈనోటా ఈవిషయం ఎమ్యేల్యే శిల్పారవి దృష్టికి వెళ్లింది. రవికుమార్‌ వివరాలు తీసుకుని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సహకారంతో రవికుమార్‌ దంపతులకు పులివెందులకు వెళ్లేందుకు బుధవారం అనుమతి ఇప్పించాడు. ఎమ్మెల్యే చొరవతో బుధవారం రాత్రికి రవికుమార్‌ దంపతులు ప్రియ చెంతకు చేరారు. గురువారం ప్రియను తమ తల్లిదండ్రులు వాహనంలో నంద్యాలకు తీసుకొని వచ్చారు. ఎమ్మెల్యే ఉదారతకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు