సమన్యాయమే లోక్ అదాలత్ లక్ష్యం : కలెక్టర్

24 Nov, 2013 02:45 IST|Sakshi

వరంగల్ లీగల్, న్యూస్‌లైన్ : సమన్యాయం అందించడమే లోక్ అదాలత్ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్‌అదాలత్‌లో కలెక్టర్ కిషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగం పౌరులందరికీ న్యాయం పొందే అవకాశం కల్పించిందని అన్నారు. పరస్పర అవగాహనతో కక్షిదారులే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి సత్వర న్యాయం పొందాలని ఆయన సూచించారు. గ్రామాల్లో వ్యవసాయ భూముల హద్దుల గురించి తగాదా పడి కోర్టుల చుట్టూ తిరిగే రైతులు, చిరు వ్యాపారులు లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఘర్షణలకు దిగకుండా ప్రశాంత జీవితాన్ని కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన జడ్జి ఎం.వెంకటరమణ మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర న్యాయసేవా సంస్థల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఒకేరోజు లోక్ అదాలత్ నిర్వహించడం ప్రయోగాత్మకమైనదని అన్నారు. ఆర్టికల్ 39(ఎ) నిర్దేశించినట్లు ప్రతీ పౌరుడు ఎలాంటి వివక్ష లేకుండా న్యాయసహాయం పొందాలనే లక్ష్యంతో న్యాయసేవా అధికార సంస్థ ఆవిర్భవించిందని అన్నారు. న్యాయ సహాయం అందించే సంస్థలు న్యాయస్థానాలకు అనుబంధం, అనుగుణంగా వ్యవహరిస్తాయని అన్నారు.

రెగ్యులర్ కోర్టులో పనిభారం పెరగడం వల్ల జిల్లాలో 39వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ కళ్యాణ్‌సేన్‌గుప్త నిర్దేశించిన విధంగా లోక్ అదాలత్‌కు వచ్చిన కక్షిదారులను ఖాళీ చేతులతో కాకుండా న్యాయం అందించి పంపిస్తామని జడ్జి వెంకటరమణ పేర్కొన్నారు. డీఐజీ కాంతారావు మాట్లాడుతూ మన న్యాయవ్యవస్థ ముద్దాయి పక్షం వహిస్తుందని అన్నారు. లోక్ అదాలత్ కక్షిదారులకు, ఫిర్యాదుదారులకు నష్టం కలగకుండా సమన్యాయం అందిస్తుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పోలీసు వ్యవస్థ ప్రజా ప్రయోజనం కోసం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జేసీ పౌసుమిబసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, రూరల్ ఎస్పీ రంగారావు కాళీదాసు, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్తికేయమిశ్రా, మొదటి అదనపు జిల్లా జడ్జి కేబీ.నర్సింహులు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.అంబరీషరావు మాట్లాడారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.సరళాకుమారి వందన సమర్పణ చేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా