చూడండి బాబూ.. | Sakshi
Sakshi News home page

చూడండి బాబూ..

Published Thu, Jul 24 2014 2:31 AM

చూడండి బాబూ.. - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలో ప్రగతి పడకేసింది. రాష్ట్ర విభజన తరువాత కొలువు దీరిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది. అభివృద్ధి పనులు ముందుకు సాగకుండా పలు చోట్ల ‘తెలుగు తమ్ముళ్లు’ అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబుకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తీవ్ర వర్షాభావం వల్ల జిల్లా ప్రజలను తాగు, సాగునీటి సమస్యలు ప్రధానంగా వేధిస్తున్నాయి. జిల్లాకు ఏకైక వరదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయం నుంచి కోటా మేరకు నీరు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది కోటాలో భారీగా కోత విధిస్తున్నారు.
 
 హెచ్‌ఎల్‌సీకి 30 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా.. గత ఏడాది దామాషా పద్దతి ప్రకారం 23.99 టీఎంసీలు మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాదైతే 22 టీఎంసీలే కేటాయించారు. ఇవి కేటాయింపులే కానీ.. ఇప్పటికీ ఒక్క టీఎంసీ కూడా జిల్లాకు చేరలేదు. దీంతో రైతులు సాగునీటి కోసం, ప్రజలు తాగునీటి కోసం అవస్థ పడుతున్నారు. మరోవైపు శ్రీశైలం డ్యాం నుంచి కృష్ణా జలాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హంద్రీ-నీవా మొదటి దశ పనులు అరకొరగా పూర్తయ్యాయి. రెండో దశ పనులు ప్రారంభమే కాలేదు. కనీసం జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీటిని తీసుకురాగలిగితే జిల్లాకు కొద్ది మేర ప్రయోజనం ఉంటుంది.
 
 సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపి.. హంద్రీ-నీవా పనులను త్వరితగతిన పూర్తి చేయించడమే కాకుండా.. ఈ ఏడాది జిల్లాకు కనీసం 40 టీఎంసీల నీటిని  తెప్పించకపోతే పరిస్థితి దయనీయంగా మారే ప్రమాదముంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లను అందించిన జిల్లాల్లో అనంతపురం కూడా ఉంది. అయితే.. చంద్రబాబు జిల్లాకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. ఎయిమ్స్, నిట్, ఐఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను జిల్లాకు తెప్పించలేకపోయారు. గుంతకల్లులో రైల్వే జోన్, ఓబుళాపురం ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో ఇనుపఖనిజం పరిశ్రమ లాంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. జిల్లాలో లక్షలాది ఎకరాల భూములున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనువైన ప్రాంతం. అయితే..ఆ దిశగా పాలకులు దృష్టి పెట్టడం లేదు. ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగవుతున్న వేరుశనగ పంటకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు లేవు. తాము అధికారంలోకి వస్తే అనంతపురం జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు ‘మీకోసం’ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా పాటుపడాల్సిన అవసరముంది.
 

Advertisement
Advertisement