Sakshi News home page

వివాహిత సజీవ దహనానికి యత్నం

Published Mon, Jan 5 2015 1:45 AM

వివాహిత సజీవ దహనానికి యత్నం

ఫిరంగిపురం : వివాహేతర సంబంధం కొనసాగించేందుకు అంగీకరించని ఓ వివాహితపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన మండలంలో ఆదివారం సంభవించింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నారుు. ఫిరంగిపురం మండలం మునగపాడులో భర్తతో కాపురం ఉంటున్న ఓ మహిళ అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఆదంషఫీతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలుసుకున్న ఆమె భర్త గ్రామపెద్దలకు ఫిర్యాదు చేయగా వారు ఆమెను, ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని మందలించారు.

మనసు మార్చుకున్న ఆమె షఫీతో సంబంధం కొనసాగించలేనని తేల్చిచెప్పింది. కానీ షఫీ మాత్రం ఆ మాట వినలేదు. పైగా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆమె బాత్‌రూమ్‌కు వెళ్లేందుకు నిద్రలేవగా అప్పటికే కాపు కాసి వేచిచూస్తున్న ఆదం షఫీ వెంట బాటిల్‌తో తెచ్చుకున్న కిరోసిన్ ఆమె ఒంటిపై పోసి నిప్పంటించాడు.

ఆమె కేకలు వేయడంతో నిందితుడు పరారవ్వగా తుళ్లిపడి లేచిన భర్త మంటలను ఆర్పేసి, బంధువుల సాయంతో 108 వాహనం ద్వారా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు నరసరావుపేట రూరల్ సీఐ యు.శోభన్‌బాబు, ఎస్‌ఐ పి.ఉద యబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

హత్యాయత్నానికి ఉపయోగించిన కిరోసిన్ బాటిల్, అగ్గిపెట్టె, మంటలు ఆర్పిన క్రమంలో కాలిన దుప్పటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. హత్యాయత్నం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఉదయబాబు తెలిపారు.

సూపరింటెండెంట్‌కు మహిళామోర్చా ఫిర్యాదు
విద్యానగర్(గుంటూరు): ఫిరంగిపురం మండలం మునగపాడులో జరిగన ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు జీజీహెచ్‌లో చికిత్సపొందుతోంది. బాధితురాలి శరీరం 60శాతం కాలిపోయిందని రెండు రోజులు గడిస్తేకాని చెప్పలేమని వైద్యులు తెలిపారు.

బాధితురాలిని భారతీయ జనతా మహిళామోర్చా నేతలు పరామర్శించారు. ఉదయం ఆరు గంటలకు ఆస్పత్రికి తీసుకువస్తే 10 గంటల వరకు వైద్యచికిత్స ప్రారంభించలేదని బంధువులు నేతల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహిళానేతలు వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. మహిళామోర్చా జిల్లా అధ్యక్షురాలు పరశరం రంగవల్లితో కలిసి జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదుచేశారు. దీంతో వైద్యులు బాధితురాలికి చికిత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళానేతలు మాట్లాడుతూ మహిళపై దాడిచేసి నిప్పంటించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement