మన బస్సులు భద్రమేనా | Sakshi
Sakshi News home page

మన బస్సులు భద్రమేనా

Published Thu, Oct 31 2013 3:16 AM

Mahabubnagar district, victim of the accident at palem Volvo bus accident, 45 people

ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద ప్రమాదానికి గురైన వోల్వో బస్సులో 45 మంది సజీవ దహనమైన దుర్ఘటన ‘పశ్చిమ’ వాసులను ఉలికిపాటుకు గురి చేసింది. ఆ బస్సులో ఈ ప్రాంత ప్రయూణికులు ఎవరూ లేకపోయినా.. కనీవినీ ఎరుగని రీతిలో పెద్దసంఖ్యలో ప్రయూణికులు గుర్తుపట్టడానికి కూడా వీలులేని విధంగా మాడి మసైపోవడం కలచివేసింది. ప్రమాదానికి గురైన తరహా బస్సులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ని త్యం రాజధానికి వెళ్లి వస్తున్నాయి. 50 వరకూ బస్సులు జిల్లా నుంచి రాకపోకలు సాగిస్తుండగా, వాటిలో కనీసం 2వేల మంది ప్రయూణాలు సాగిస్తున్నారు. తాజా దుర్ఘటన నేపథ్యంలో జిల్లానుంచి నడుపుతున్న బస్సుల్లో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలు ప్రజలను భయూందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ బస్సుల్లోని పరిస్థితులను బుధవారం ‘న్యూస్‌లైన్’ పరిశీలించగా, ప్రయూణికుల భద్రతను గాలికొదిలేస్తున్నట్టు స్పష్టమైంది. 
 
 ఏసీ సిలిండర్‌లో ఫ్రియూన్ గ్యాస్‌కు బదులు ఎల్‌పీజీ  
 జిల్లా నుంచి నడుస్తున్న ఏసీ (వోల్వో) బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రయాణికులు సుఖవంతమైన ప్రయాణం కోసం ఏసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. వీటిలో భారీ చార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్ యజమానులు నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. ఏసీ సదుపాయం కోసం వినియోగించే సిలిండర్లలో ‘ఫ్రియాన్ మఫ్రాన్ ఆర్-22’ గ్యాస్‌ను వాడాల్సి ఉంటుంది. ఇది కిలో రూ.800 వరకు ఉంటుంది. ఒక్కో బస్సుకు సుమారు 10 కిలోల గ్యాస్‌ను వినియోగిస్తారు. అయితే బస్సుల యజమానులు ఏసీ సిలిండర్లలో ఎల్‌పీజీ (వంటగ్యాస్) వినియోగిస్తున్నారు. ఎల్‌పీజీ గ్యాస్‌కు మండే గుణం అధికంగా ఉండటంతో చిన్నపాటి ప్రమాదం సంభవించినా అగ్నికీలలు ఎగసిపడే ప్రమాదం ఉంది. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రూ.1,100లకు లభిస్తుంటే, ఫ్రియాన్ మఫ్రాన్ ఆర్22 గ్యాస్ 10 కిలోలు రూ.8వేలు వరకు వెచ్చించాల్సి ఉంటుంది. సొమ్ములు కలిసి వస్తున్నాయని ప్రయూణికుల ప్రాణాలతో ట్రావెల్స్ యజమానులు ఆటలాడుకుంటున్నారు.
 
 నిబంధనలు ఎక్కడ ?
 జిల్లాలో 50 ప్రైవేటు బస్సులు ఉండగా, వాటిలో రాష్ట్రస్థాయి కాంట్రాక్టు క్యారియర్లు 17, జిల్లాస్థాయి కాంట్రాక్టు క్యారియర్లు 33 ఉన్నాయి. ఏలూరు పరిధిలో 6 రాష్ట్ర పర్మిట్ బస్సులు, 3 జిల్లా పర్మిట్ బస్సులు నడుస్తుండగా, భీమవరం పరిధిలో 11 రాష్ట్ర పర్మిట్, 30 జిల్లా పర్మిట్ బస్సులను తిప్పుతున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణికుల లగేజీ మినహా ఏ ఇతర వస్తువులను అనుమతించకూడదు. అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే, మండే స్వభావం ఉన్న వస్తువులేవీ బస్సుల్లో వేయకూడదు. 
 
 ఇందుకు విరుద్ధంగా బ్యాటరీలు, ప్లాస్టిక్ సామగ్రి, మండే స్వభావం ఉన్న అనేక వ్యాపార వస్తువులను యథేచ్ఛగా బస్సుల్లో రవాణా చేస్తున్నారు. ప్రయాణికుల వివరాలు, వారి చిరునామాలతో కూడిన జాబితాలు ట్రావెల్స్ యూజమాన్యం వద్ద, బస్సులోను ఉండాలి. చాలామంది ఆ వివరాలే సేకరించడం లేదు. బస్సుల్లో అత్యవసర ద్వారాలు కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి. ప్రమాదాలు జరిగే సందర్భాల్లో ప్రయూణికు లు బస్సులోంచి బయటపడేందుకు వీలుగా పగిలే స్వభావం (బ్రేకబుల్) ఉన్న అద్దాలను అమర్చాలి. చా లా బస్సులకు ఇలాంటివి లేవు. బస్సుల్లో మంటలు చెల రేగితే అదుపు చేసే ఫోమ్ సిలిండర్లు (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్)లను ఎక్కడికక్కడ అమర్చాల్సి ఉంది. ఏ బస్సులోనూ ఇవి కనిపించడం లేదు. అడుగడుగునా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. 
 
 27 కేసులు నమోదు చేశాం
 జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న ప్రైవేటు కారియర్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 27 కేసులు నమోదు చేశామని జిల్లా రవాణా శాఖ అధికారి సీహెచ్ శ్రీదేవి చెప్పారు. బస్సుల ఫిట్‌నెస్, ప్రయూణికుల భద్రతకు సంబంధించిన అంశాలపైన తనిఖీలు  చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కాంట్రాక్టు క్యారియర్‌గా అనుమతులు తీసుకుని స్టేజి క్యారియర్లుగా నడుపుతున్న, నిబంధనలు పాటించని బస్సుల యజమానులపై చర్యలు తీసుకుంటామన్నారు.
 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement