చంద్రబాబు మహాధర్నాకురైతుల కొరత | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మహాధర్నాకురైతుల కొరత

Published Thu, Dec 5 2013 1:31 AM

చంద్రబాబు మహాధర్నాకురైతుల కొరత

=రెండుగంటలు ఆలస్యంగా ప్రారంభం
 =రెండోసారి ప్రసంగం సమయానికే ఖాళీ అయిన కుర్చీలు
 =విజయమ్మ సభపై బాబు ఆరా

 
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు రైతులే కరువయ్యారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ ప్రకాశం బ్యారేజీ వద్ద నది ఇసుక తిన్నెల్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం పేలవంగా సాగింది. సభలో రైతుల కంటే కిరాయి కార్యకర్తలే ఎక్కువగా కనిపించారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని ప్రకటించినా 12 గంటల వరకు సభాస్థలి వెలవెలపోయింది. 12 గంటలకు చంద్రబాబు వచ్చే ముందు కార్యకర్తలు నెమ్మదిగా చేరుకున్నారు.

రెండు గంటలకు సభాస్థలిలోనే ఏర్పాటుచేసిన భోజనాలు పూర్తిచేసి నెమ్మదిగా సర్దుకున్నారు. చంద్రబాబు మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ప్రసంగించారు. రెండోసారి ప్రసంగించే సమయానికి కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమివ్వడం విశేషం. ఒకవైపు తమ  సభలో రైతులు కానరాకపోవడంతో చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పులిచింతలలో నిర్వహించిన సభ గురించి నేతలను వాకబు చేశారు. అక్కడ సభ కూడా విఫలమైందంటూ వర్ల రామయ్య ప్రకటించి కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.
 
రూటు మార్చిన చంద్రబాబు...


 చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి బందరు రోడ్డులోని ఒక హోటల్‌కు వచ్చి అక్కడనుంచి సభాస్థలికి రావాల్సి ఉండగా, అర్థంతరంగా రూటు మార్చి నేరుగా సీతానగరంలోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ గుడిలో పూజ, వేద పండితులతో ఆశీర్వచనం తీసుకుని, అక్కడే అల్పాహారం పూర్తిచేశారు. ఆశ్రమంలోనే సుమారు గంటన్నర పైగా గడపడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సభాస్థలి వద్ద జనం లేకపోవడం వల్లే చంద్రబాబు ఎక్కువసేపు ఆశ్రమంలో గడిపారని కొంతమంది నేతలు చెబుతున్నారు.  
 
ఏర్పాట్లపై కార్యకర్తల ఆగ్రహం

ఇసుక తిన్నెలపై నేతలు చేసిన ఏర్పాట్లపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక తిన్నెల్లోకి దిగేందుకు ఉన్న ర్యాంప్, అప్రాన్‌లను పోలీసులు మూసివేసి వీఐపీలను మాత్రమే అనుమతించారు. మిగిలినవారిని మెట్లమార్గంలో వెళ్లాలని ఆదేశించారు. ఆ మార్గం అంతా అశుద్ధాలతో నిండిపోవడం, తీవ్ర దుర్గంధం వెలువడుతుండటంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో చంద్రబాబు తొలిసారి ప్రసంగం కాగానే వెళ్లిపోయారు. చంద్రబాబు బస్సు ఇసుకతిన్నెల్లో కూరుకుపోగా పొక్లెయిన్‌తో తీయించాల్సి వచ్చింది. దీన్నిబట్టే ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
 
అధినేత ప్రసన్నానికి నేతల పోటీ

పశ్చిమ కృష్ణా : తెలుగుదేశం పార్టీ మహాధర్నా ఆద్యంతం ఆత్మస్తుతి.. పరనింద చందంగా సాగింది. అధినేత చంద్రబాబు దగ్గర్నుంచి పార్టీ నాయకుల వరకు పోటీపడి మరీ అవాస్తవాల బాకా ఊదారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ తన హయాంలోనే వచ్చాయని చంద్రబాబు చెప్పుకొన్నారు. చివరికి పులిచింతల కల సాకారం కావడం తన గొప్పేనని చెప్పడంతో సభికులు ముక్కున వేలేసుకున్నారు. ఇక బాబును ప్రసన్నం చేసుకునేందుకు నేతలు నానా తంటాలు పడ్డారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య స్థాయిమరిచి మాట్లాడారని ఆ పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కున్నారు.

ఇప్పుడు ఎన్నికలు లేవు.. ఓట్లు, సీట్లు అక్కర్లేదంటూనే రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసి బాబును మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని నేతలు విజ్ఞప్తి చేయడం కొసమెరుపు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఎంపీ కొనకళ్ల నారాయణ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేశినేని నాని, అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు, మాజీ చీఫ్‌విప్ కాగిత వెంకట్రావ్, కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, మాగంటి బాబు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement