పులకించిన స్వరాలతల్లి | Sakshi
Sakshi News home page

పులకించిన స్వరాలతల్లి

Published Wed, Feb 6 2019 7:13 AM

Maharaja Music And Dance Honored to Singer Susheelamma in Vizianagaram - Sakshi

విజయనగరం టౌన్‌: ‘పులకించని మది పులకించు..’ అంటూ గానకోకిల సుశీలమ్మ తన గాత్రంతో అందరినీ పరవశింపజేశారు. ఈ గడ్డపై తాను జన్మించడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని తెలిపారు. ఇదే కళాశాలలో ద్వారం వెంకటస్వామినాయుడువద్ద వారం రోజుల పాటు విద్యనేర్చుకున్నానని, ఇక్కడే గురజాడ ఇంటి ఆవరణలోనే ఆడుకునేదానినని గుర్తుచేసుకున్నారు. తన తల్లిదండ్రులు శేషావతారం, ముకుందరావులకు ఇక్కడ పుట్టడం వల్లనే తనకీ ఖ్యాతి దక్కిందని చెప్పారు. మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల ముగింపు వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా   గానకోకిలను ఘనంగా సత్కరించారు. పురస్కారం కింద రూ.5 లక్షల చెక్కును, దుశ్శాలువ, శతవసంతాల జ్ఞాపికను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ హరిజవహర్‌లాల్, జెడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభా స్వాతిరాణి అందించారు.

ఈ సందర్భంగా సుశీలమ్మ మాట్లాడుతూ నూరేళ్ల పండగను చూడాలనే తనను భగవంతుడు ఇక్కడ పుట్టించారని ఆనందపరవశులయ్యారు. ఘంటసాల విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆమె ఆయనతో వేలపాటలు పాడానని గుర్తుచేసుకున్నారు. తాను చదువుకున్న కళాశాలలోనే పురస్కారం పొందడం అదృష్టమన్నారు. గురజాడ ఇంటిలోనే ఆడుకునేదానినని, పేరుకోసమే ఘంటసాల, తాను బతికామన్నారు. విజయనగరంలోనే గాంధీగారిని చూశానని, నాటి నుంచి ఎక్కడకు వెళ్లినా ఆయనపేరు మీద ఉన్న ఆడిటోరియంలు, పార్కుల్లోనే తనకు సత్కారాలు దక్కేవనీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ద్వారం వంశస్తులు శ్రీనివాసరావు, దుర్గాప్రసాదరావు, సత్యనారాయణ, ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి, చాగంటి గంగబాబు కుమారుడు కొండలరావు, జేసీ–2  కె.వెంకటరమణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బొద్దుల నరసింగరావు, కళాశాల ప్రిన్సిపల్‌ బురిడి అనూరాధా పరశురామ్, ద్వారం శ్రీనివాస్, సంగీతాభిమానులు, విద్వాంసులు, ప్రముఖులు, కళాకారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

ఆకట్టుకున్న మంజుభార్గవి నృత్యప్రదర్శన
కార్యక్రమంలో చివరిగా ప్రముఖ నర్తకీమణి, సినీనటి మంజుభార్గవి నృత్యప్రదర్శన ఆద్యంతం ఆహూతులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఘంటసాల రత్నకుమార్‌ దంపతులను రూ.3 లక్షల చెక్కును, దుశ్శాలువతో సత్కరించారు. వారితో పాటు పలువురి కళాకారులకు సత్కారాలు అందజేశారు.

మానసిక రుగ్మతలకు మంచి మందు: ద్వారం మంగతాయారు
శతవసంతోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం వయోలిన్‌ ప్రావీణ్యుడు కీర్తిశేషులు ద్వారం వెంకటస్వామినాయుడు విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. అనంతరం కళాశాల ప్రాంగణంలో విజయరామ గజపతిరాజు కళావేదికపై జరిగిన సభలో జెడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభాస్వాతిరాణి, జిల్లా కలెక్టర్, ఉత్సవ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్,  ద్వారం వెంకటస్వామినాయుడు కుమార్తె ద్వారం మంగతాయారును శాలువతో ఘనంగా సత్కరించి, రూ. 3 లక్షల చెక్కును, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత మాట్లాడుతూ సంగీత కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు, విద్యార్థులు ఐకమత్యంగా కృషిచేయాలన్నారు. మానసిక రుగ్మతలను పోగొట్టే సాధనం సంగీతమేనని తెలిపారు.  కార్యక్రమంలో చాగంటి కొండలరావు రచించిన ‘ ఫిడేల్‌ నాయుడు’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.  

సంగీతంపై ఆసక్తి పెరిగింది: జిల్లా కలెక్టర్‌
మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాల శత వసంతోత్సవాల్లో భాగంగా చివరిరోజు నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎమ్‌.హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ తనకు సంగీతంపై ఆసక్తి పెరిగిందన్నారు.  వయోలిన్‌ నేర్చుకుంటానని తెలిపారు. తనకు ఎప్పటినుంచో అభిరుచి ఉన్నా... నేర్చుకోలేకపోయానని, ఇప్పుడు నేర్చుకుంటానని తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శోభాస్వాతీరాణి మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రదాయాలకు జిల్లా పుట్టినిల్లనీ, ఇక్కడున్న మహా విద్వాంసులను చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం కలిగిందన్నారు. ఐదేళ్లపాటు కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నానని, ఇప్పుడు రోజూ సంగీత కళాశాలకు వచ్చి వయోలిన్‌ నేర్చుకుంటాననీ పేర్కొన్నారు.

ఆమె పాటకోసం... ఆద్యంతం ఎదురుచూపు
సుశీలమ్మ ఏం మాట్లాడుతుందో.. ఏం పాడుతుందోనని  అభిమానులు, ప్రజలు ఆత్రుతగా ఎదురుచూశారు.  ఇంతలోనే ఆమె ‘ పాడకడలిపై శేషతల్పమున...’ అంటూ ఆలపించేసరికి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. నారాయణ మంత్రం ,....శ్రీమన్నారాయణ భజనం అంటూ పాడిన పాటకు ఆడిటోరియం భక్తిపారవశ్యంలో మునిగింది.   అలిగిన వేళనే చూడాలి... అంటూ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. చివరగా శ్రోతలు అడిగిన మేరకు ‘నీ దయ రాదా.... రామా’ అంటూ పాడిన పాటకు ప్రేక్షకులు  చేతులెత్తి నమస్కరించారు.

Advertisement
Advertisement