జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత | Sakshi
Sakshi News home page

జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత

Published Wed, Nov 20 2013 3:22 PM

జగన్ నా తమ్ముడి లాంటివారు.. నా బాట సమైక్యమే: మమత - Sakshi

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తమ్ముడి లాంటి వారని, తానెప్పుడూ ప్రాంతాలు సమైక్యంగా ఉండాలనే కోరుకుంటానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కోల్కతాలో మమతా బెనర్జీని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా, రాష్ట్రాలను ఇష్టం వచ్చినట్లు విభజిస్తే కుదరదని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విభజనకు ఒక ప్రాతిపదిక అంటూ ఉండాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి చేయాలని, రాజ్యాంగంలోని మూడో అధికరణను సవరించకుండా వాళ్ల ఇష్టం వచ్చినట్లు రాష్ట్రాలను విభజించకుంటూ పోతామంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలోను, పార్లమెంటులో కూడా మూడింట రెండొంతుల మెజారిటీ ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలని, లేనిపక్షంలో రాష్ట్రాన్ని విభజించకూడదని జగన్ అన్నారు. అంతేతప్ప అడ్డదిడ్డంగా, ఇష్టం వచ్చినట్లు విభజిస్తే అంగీకరించేది లేదని అన్నారు.

ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ అంతా కలిసే ఉండాలన్నదే తన భావన అని తెలిపారు. విభజిస్తూ పోతే సమస్య పరిష్కారం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఐదేళ్లుగా మాట్లాడకుండా ఊరుకుని ఇప్పుడు ఎన్నికలు వచ్చే తరుణంలో ఆంధ్రప్రదేశ్ను ఎందుకు విభజిస్తున్నారని ఆమె నిలదీశారు. అభివృద్ధి కావాలంటే కొత్త జిల్లాలను ఏర్పాటుచేసుకోవచ్చని, ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించవచ్చని.. లేదా వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక హోదా కల్పించవచ్చని ఆమె తెలిపారు. లేదు అంతా కలిసి విభజిద్దామని నిర్ణయం తీసుకునితీర్మానం ఆమోదిస్తే దాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరని మమతా బెనర్జీ అన్నారు. ఉదాహరణకు జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఏర్పాటుకు అన్ని పార్టీలూ ఒప్పుకున్నాయని, పార్లమెంటులోకూడా 2/3 కన్నా ఎక్కువ మెజార్టీతో ఒప్పుకున్నారని ఆమె గుర్తుచేశారు.

Advertisement
Advertisement