పెంచలయ్యా..ఎంత కష్టమయ్యా | Sakshi
Sakshi News home page

పెంచలయ్యా..ఎంత కష్టమయ్యా

Published Mon, Jul 2 2018 5:29 PM

Man Waiting For Heart Transplantation In Nelluru - Sakshi

తల్లి దివ్యాంగురాలు..తండ్రి కుటుంబాన్ని వదిలేయడం..పిన్నవయస్సులోనే తోబుట్టువు అకాల మరణం..ఆ సరస్వతీ పుత్రుడి హృదయాన్ని కలిచివేశాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబ భారాన్ని మోసేందుకు ఇష్టమైన చదువును వదిలేయాల్సి వచ్చింది. వడ్రంగి పనులకు వెళ్తూ తల్లిని పోషించుకుంటున్న తరుణంలో విధి పగబట్టింది.

హృద్రోగం రూపంలో కష్టాల పాల్జేసింది. వైద్యులు రూ.40లక్షలు ఖర్చు చేసి గుండెను మార్చాల్సిందేనని తేల్చ డంతో ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నాడు. వైద్యం కోసం సాయం అందించి ఆదుకోవాలని దాతలను వేడుకుంటున్నాడు మట్టెంపాడుకు చెందిన దాసరి పెంచలయ్య.

నెల్లూరు రూరల్‌ : రూరల్‌ మండలం మట్టెంపాడుకు చెందిన దాసరి రామమోహన్, విజయమ్మ దంపతులు. విజయమ్మకు చిన్నవయస్సులో జరిగిన ప్రమాదంలో వైద్యులు ఒక కాలును పూర్తిగా తొలగించారు. 85శాతం దివ్యాంగురాలైన ఆమెది ఏ పని చేయలేని పరిస్థితి. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. తొలి సంతానం కుమార్తె కాగా. రెండో సంతానం దాసరి పెంచలయ్య. పెంచలయ్య పదిహేనో ఏటా తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తోబుట్టువును విధి ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయింది. దీంతో కుటుంబం కష్టాల పాలైంది.

తల్లిని పోషించుకునేందుకు చదువు నిలిపివేత

చదువులో ముందుండే పెంచలయ్య నెల్లూరులో బీఎస్సీ కంప్యూటర్సు చదువుతుండగా కుటుంబం చిక్కుల్లో పడింది. ఏ పని చేయలేని తల్లి విజయమ్మకు కుమారుడే దిక్కు అయ్యాడు. తల్లిని, తనను పోషించుకోవాలంటే కూలీ పనికి వెళ్లక తప్పదని గ్రహించాడు. వెంటనే చదువును అర్ధాంతరంగా నిలిపేసి వడ్రంగి వద్ద కూలీగా చేరాడు. ఉడ్‌వర్క్‌ పాలిష్‌లో మంచి నైపుణ్యాన్ని సాధిం చాడు. ఉన్నంతలోనే తల్లిని ఏ లోటు లేకుండా పోషించుకుంటూ ఆనందంగా గడపసాగాడు.

పెళ్లి చేద్దామనుకునేలోగా గుండెజబ్బు

తల్లి, బంధువులు పెంచలయ్యకు పెళ్లి చేయాలనుకున్నారు. ఈ తరుణంలో సుమారు 8 నెలల క్రితం పనికెళ్లగా ఆయాసం రాసాగింది. శ్రమతో ఆయాసం వస్తుందని నెల రోజులు నెట్టుకొచ్చాడు. ఈ లోగా  తలనొప్పి, జ్వరం రాసాగడంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా గుండె జబ్బు అని వైద్యులు తెలిపారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రికి వెళ్లగా గుండె జబ్బు తీవ్రంగా ఉందని, బతకడమే కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు.

దీంతో దివ్యాంగురాలైన తల్లి విజయమ్మతో పాటు బిడ్డ పెంచలయ్య కుమిలి కుమిలి ఏడ్చారు. ప్రాణాలు మీద ఆశ వదులుకుంటున్న తరుణంలో కృపమ్మ అనే ఉద్యోగి ఇతర మిత్రుల సహకారంతో చెన్నైలోని విజయ ఆస్పత్రికి తీసుకెళ్లగా, గుండె మార్పిడి ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. గుండె జబ్బుతో పెంచలయ్య ఎక్కువగా తిండి తినేందుకు, నీరు తాగేందుకు వీలు లేకుండాపోయింది. రోజుకు 150 గ్రాముల భోజనం చేయాలి. 800 మిల్లీలీటర్ల నీటిని తాగాలి. ఒక చేతి ముద్ద ఎక్కువ తిన్నా ఆయాసం వస్తుండడంతో అల్లాడిపోతున్నాడు.

ఆపరేషన్‌కు రూ.40లక్షల ఖర్చు

మే 2న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పెంచలయ్యకు అన్ని పరీక్షలు చేయించారు. గుండె మార్పిడి స్పెషలిస్టు డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే పరీక్షించి  కెడావర్‌ డోనార్‌ హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ ద్వారా గుండె మార్పిడి  చేయాలని తెలిపారు. అపోలోలో ఆపరేషన్‌ చేయించుకుంటే రూ.40లక్షలు ఖర్చు అవుతుందని, గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో చేయించుకుంటే రూ.27లక్షలు అవుతుందని చెప్పారు. ఆపరేషన్‌ తరువాత సంవత్సరం పాటు ఖరీదైన మందులు వాడాలని తెలిపారు. ఈ రెండు చోట్ల కెడావర్‌ డోనార్‌ హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌  ఆపరేషన్‌ కోసం పెంచలయ్య తన పేరును  రిజిష్టర్‌ చేయించుకున్నారు. 

దాతల సాయం కోసం వేడుకోలు

రెక్కల కష్టంతో దివ్యాంగురాలైన తల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పెంచలయ్య తన గుండె ఆపరేషన్‌ కోసం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. తనకు సాయం అందించి ప్రాణాలను కాపాడితే బ్రతికినంత కాలం రుణపడి ఉంటానని దాతలను వేడుకుంటున్నాడు. మనస్సును మా రాజులు 97038 80413  నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement