నిలువునా ముంచారు | Sakshi
Sakshi News home page

నిలువునా ముంచారు

Published Sat, Nov 7 2015 1:53 AM

Managing narumallu severe damage with loss

విత్తనాలిచ్చి, సాగునీరిస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా వరినాట్లు ప్రారంభించాక నిలువునా ముంచేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లిస్తారనే ఆశతో వేసిన నారుమళ్లు ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులు, రైతుల కష్టనష్టాలను పరిశీలించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నేతల ఎదుట తమ గోడు వినిపించారు. నాగాయలంక మండలంలో పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, వత్సవాయిలో జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త సామినేని ఉదయభాను, చాట్రాయిలో ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, తిరువూరు మండలంలో ఎమ్మెల్యే రక్షణనిధి శుక్రవారం రైతుల పరిస్థితులను పరిశీలించారు.
 
 
నాగాయలంక/వత్సవాయి/చాట్రాయి :  నాగాయలంక తీర ప్రాంతంలో రైతుల పరిస్థితి, కష్టనష్టాలను అధ్యయనం చేసేందుకు వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ఆ పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబుతో కలసి శుక్రవారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. గణపేశ్వరం, దిండి, సొర్లగొంది ప్రాంతాల్లో పర్యటించిన నేతలకు రైతులు తమ గోడు వినిపించారు. సొర్లగొంది మత్య్సకార రైతులు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా పంటలు వేయలేక పొలాలను బీడుగా వదిలేసినట్లు  చెప్పారు.

నీళ్లిస్తారన్న ఆశతో నారుమళ్లు పోసుకుని ఎండబెట్టుకోవడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. చేపలవేట నిషేధానికి సంబంధించిన ఆర్థికసాయం కూడా ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని వివరించారు. వేలాది ఎకరాల్లో పంట వేయని, వేసి నష్టపోయిన వారందరికీ పరిహారం ఇప్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంటవేయకుండా వదిలేసిన భూములు, మాడిపోయిన నారుమళ్లు, నీరందక నెర్రెలిచ్చిన పొలాలను నాయకులు పరిశీలించారు. పర్యటనలో పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నలుకుర్తి రమేష్, మండల కన్వీనర్ భోగాది వెంకట శేషగిరిరావు, రైతు కన్వీనర్ బీసాబత్తుని ప్రసాద్, ప్రచార కన్వీనర్ మద్ది చిన్నారి, మాజీ సర్పంచ్ నాయుడు అమ్మన్న, తోట సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
 
ఇరిగేషన్ మంత్రి చేతగానిదద్దమ్మ : సారథి
ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతాంగం ఉసురుతీసి చేష్టలుడిగిన.. చేతగాని దద్దమ్మలా రైతుల జీవనాన్ని అల్లకల్లోలం చేశారని వైఎస్సార్‌సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్థసారథి ధ్వజమెత్తారు.  శుక్రవారం ఆయన నాగాయలంకలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సముద్రతీర మండలాల్లో రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని, ప్రభుత్వం మాటలు నమ్మి నాట్లు వేసుకున్న రైతులను నష్టాల నుంచి కాపాడాల్సిన నైతిక బాధ్యత  విస్మరించడం దౌర్భాగ్యమన్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 75వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా కేవలం 25వేల ఎకరాల్లో పంటలు వేశారని, కనీసం వాటినీ ప్రభుత్వం కాపాడలేకపోతే 7, 8 వేల ఎకరాల్లో కూడా దిగుబడి రాదని సారథి చెప్పారు. తక్షణం సాగునీరు విడుదల చేసి రైతులు వేసిన పంటలను కాపాడాలని, సముద్రతీరంలో జీవనం కోల్పోయిన రైతాంగానికి ఓప్రణాళికతో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం ఎదురుమొండి రైతులకు అటవీ భూములను, తీరగ్రామాల మత్స్యకారులకు చేపలవేట నిషేధిత కాలంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని తక్షణం ఇప్పించి ఆదుకోవాలని డిమాండ్ చే శారు.  
 
 

Advertisement
Advertisement