సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు ఇవే | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు ఇవే

Published Tue, Dec 30 2014 8:36 PM

సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే మండలాలు ఇవే - Sakshi

హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ)కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆరు కీలక జీఓలు జారీ చేసింది. ఈ బిల్లుపై గవర్నర్ నిన్న సంతకం చేశారు. ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తక్షణమే విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ(వీజీటీఎంయుడిఏ)ను రద్దు చేస్తూ ఒక జీఓను జారీ చేశారు.  రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం జీఓలు జారీ చేసింది. 122 కిలో మీటర్ల ప్రాంతం రాజధాని నగరంగా ప్రకటించారు.  సీఆర్డీఏ పరిధిలోకి 7068 కిలోమీటర్ల ప్రాంతం వస్తుంది. దీని పరిధిలోకి 58 మండలాలు వస్తాయి. గుంటూరు జిల్లాలోని 29 మండలాలు, కృష్ణా జిల్లాలోని 29 మండలాలు దీని పరిధిలోకి వస్తాయి.

సీఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి, వైఎస్ చైర్మన్గా మునిసిపల్ శాఖ మంత్రి, 9 మంది సభ్యులు ఉంటారు. రాజధాని ప్రాంత అధికారాలన్నీ సీఆర్డీఏ కార్యనిర్వాహక కమిటీకి బదలాయిస్తూ జీఓ జారీ చేశారు. ఈ ప్రాంతంలో ల్యాండ్పూలింగ్ అధికారాన్ని ఈ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్గా మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించారు. సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఆర్డీఏ కమిషనర్ ఉంటారు. మిగిలిన సభ్యుల వివరాలపై తరువాత ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. 

 సీఆర్డీఏ పరిధిలోకి కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జి.కోండూరు, కంచికచర్ల, వీర్లుపాడు, పెనుగంచిప్రోలు, నందిగామ, చందర్లపాడు, మైలవరం, ఆగిరిపల్లి, బాపులపాడు, నూజివీడు, పామిడిముక్కల, తోట్లవల్లూరు, పెదపారపూడి మండలాలు పూర్తిగా వస్తాయి. మొవ్వ, చల్లపల్లి, ఘంటశాల, పామర్రు, గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, మోపిదేవి మండలాల్లోని సగానికిపైగా గ్రామాలు వస్తాయి.

గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, పెదకూరపాడు, ముప్పాళ్ల మండలాలు పూర్తిగా వస్తాయి. భట్టిప్రోలు, పొన్నూరు, ప్రత్తిపాడు, పెదనందిపాడు, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాలలో సగానికిపైగా గ్రామాలు వస్తాయి. అచ్చంపేట, క్రోసూరు మండలాలలోని కొన్ని గ్రామాలు వస్తాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement