స్థానిక ఎన్నికల్లోనూ ‘ఓటుకు కోట్లు’ | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లోనూ ‘ఓటుకు కోట్లు’

Published Sun, Jun 21 2015 2:30 AM

స్థానిక ఎన్నికల్లోనూ ‘ఓటుకు కోట్లు’ - Sakshi

= ఇతర పార్టీల నుంచి గెలిచినవారికి ఎర
= ఎన్నికలు ముగిసిన వెంటనే తాయిలాల పర్వం
= పదవులే లక్ష్యంగా వ్యవహరించిన బాబు
= మొదటి ఎన్నికల్లోనే ప్రత్యర్థి పార్టీల విజేతలకు ఆశల వల
= ఇవీ బాబు మార్కు నైతిక విలువలు
 
 నీతులు ఇతరులకు చెప్పడానికే గాని.. పాటించడానికి కాదనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మార్కు సిద్ధాంతం. అందుకే ఆయన రాజకీయాల్లో నైతిక విలువల గురించి బహిరంగంగా ఉపన్యాసాలిస్తూ తెరవెనుక ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు ఎరవేసి పార్టీలోకి లాక్కుంటుంటారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంత దిగజారుడు రాజకీయాలైనా సాగిస్తారనేందుకు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు సాగించిన ‘ఓటుకు అయిదు కోట్ల’ వ్యవహారం ప్రత్యక్ష నిదర్శనం.
 
 సాక్షి, ఆంధ్రప్రదేశ్ బ్యూరో/నెట్‌వర్క్
 చంద్రబాబు నాయుడి ప్రలోభాల పర్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను తనవైపు తిప్పుకోవడానికే పరిమితం చేయలేదు. బాబు తన స్వార్థ రాజకీయాల నుంచి స్థానిక సంస్థలను కూడా వదిలిపెట్టలేదని అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తుండగా ‘ఓటుకు కోట్లు’ కేసులో పీకల్లోతు చిక్కుకున్న  చంద్రబాబు ఇప్పుడు రాజకీయాల్లో నైతిక విలువల గురించి వల్లె వేస్తుండటాన్ని రాజకీయ విశ్లేషకులు దుయ్యబడుతున్నారు. ఇతర రాజకీయ పక్షాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నప్పుడుబాబుకు నైతిక విలువలు గుర్తుకు రాలేదా? అని విపక్ష నేతలు నిలదీస్తున్నారు.  చంద్రబాబు తీరు ‘చెప్పేవి శ్రీరంగ నీతులు...’ చందంగా ఉందని ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో బట్టబయలైందని అధికార వర్గాలు సైతం అనధికారిక చర్చల్లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండటం గమనార్హం.   
 
 జెడ్పీ పీఠాల కోసం చేసిందేమిటి?
 చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే మొట్టమొదట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ‘ఓటుకు నోట్లు’ వ్యవహారానికి తెరలేపి తన మార్కు ఫార్టీ ఫిరాయింపుల పర్వానికి తెరతీశారు. సంపూర్ణ మెజార్టీ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు కర్నూలు జెడ్పీ పీఠం దక్కకుండా చేసేందుకు చంద్రబాబు వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. బలం లేకపోయినా కర్నూలు జెడ్పీ పీఠాన్ని టీడీపీ కైవసం చేసేందుకు సాక్షాత్తూ సీఎం చంద్రబాబు ప్రత్యర్థి పార్టీల జెడ్పీటీసీ సభ్యులకు భారీ తాయిలాలు ఎరవేశారు. బాబు ఆదేశం మేరకు టీడీపీ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎనిమింది, కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్నారు. కర్నూలు జిల్లాలోని 53 జెడ్పీటీసీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ 20 స్థానాలకే పరిమితమైంది. అయినా నైతికతను తుంగలో తొక్కి, ‘ఓటుకు నోటు’ వ్యవహారం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బతీసి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది.
 
 శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో....
 ఈ జిల్లాలో 46 జెడ్పీటీసీలకు ఎన్నికలు జరగ్గా 31 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధించగా టీడీపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. అయినా ఈ జెడ్పీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలనే స్వార్థంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ భారీ అక్రమాలకు పాల్పడింది. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి భారీ ప్రలోభాలు చూపడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప్పల ప్రసాద్ గౌడ్, దువ్వూరు భారతి, పెంచలమ్మ, ముప్పాళ్ల విజేత, షల్మా షరీన్, తిరువీధి రమేష్, పులిచెర్ల నారాయణరెడ్డి, కె.జ్యోతి అనే ఎనిమిది మంది జెడ్పీటీసీ సభ్యులను టీడీపీ నిస్సిగ్గుగా తనవైపు తిప్పుకుంది. చంద్రబాబు ప్రతినిధులు చూపిన ఆశల తాయిలాలకు మిగిలిన వైఎస్సార్ కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు లొంగకపోవడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ గద్దెను టీడీపీ కైవసం చేసుకోవాలనే చంద్రబాబు ఆశ నెరవేరలేదు.
 
 ప్రకాశం జిల్లాపరిషత్ ఛైర్మన్‌గా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నూకసాని బాలాజీతోపాటు ఆ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు దాసరి విజయ, దగ్గుబాటి నాగజ్యోతి, జాకీర్‌లకు భారీ తాయిలాలు ఇవ్వడం ద్వారా టీడీపీ తనవైపు తిప్పుకుంది. ఇలా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చెందిన 28 మంది జెడ్పీటీసీ సభ్యులను చంద్రబాబు తన పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందినవారు 26 మంది కాగా కాంగ్రెస్ వారు ఇద్దరు కావడం గమనార్హం.
 
 మండల పరిషత్ పీఠాల కోసం..
 సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్లు రాజకీయాల నుంచి మండల పరిషత్‌లను కూడా మినహాయించలేదు. ప్రత్యర్థి పార్టీల నుంచి గెలిచిన మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులకు ఆశల ఎరవేసి తమవైపు తిప్పుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని, నైతిక విలువలను కాలరాయడం ద్వారా బలం లేకపోయినా టీడీపీ పలు మండల పరిషత్ ఛైర్‌పర్సన్ పీఠాలను కైవసం చేసుకుంది.
 
 నగరపాలకలు, పురపాలికల్లో...
 నగరపాలక సంస్థలు/ పురపాలికల విషయంలోనూ బాబు అదే పంథా అనుసరించారు. ఆశల ఎరవేసి ప్రత్యర్థి పార్టీల కౌన్సిలర్ల మద్దతు  సాధించడం, పార్టీలో చేర్చుకోవడం ద్వారా చంద్రబాబు బలం లేని చోట్ల కూడా కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ పీఠాలను టీడీపీకి దక్కేలా చేశారు.
 
  నెల్లూరులో 54 కార్పొరేటర్ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ 32 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజారిటీతో మేయర్ స్థానం కైవసం చేసుకోగా... ఆ తర్వాత మేయర్‌తోపాటు కొందరు వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్పించుకుంది. ఈ వ్యవహారం వెనుక భారీగా డబ్బు చేతులు మారినట్లు అభియోగాలున్నాయి.
 
  కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీలో 20 కౌన్సిలర్ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ 11 స్థానాలతో సంపూర్ణ మెజార్టీలో ఉన్నా ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభపరచి మద్దతు సాధించడం ద్వారా మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది.
 
  కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో 23 కౌన్సిలర్ స్థానాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ పార్టీకి చెందిన తొమ్మిది మందిని కొనుగోలు చేయడం ద్వారా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అక్రమంగా టీడీపీ దక్కించుకుంది.
 
  విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో మొత్తం 30 కౌన్సిలర్ స్థానాలకుగాను 15 చోట్ల విజయం సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ మెజార్టీతో ఉన్నా ఆ పార్టీ సభ్యులను ముగ్గురిని ప్రలోభాలకు గురిచేయడం ద్వారా టీడీపీ ఇక్కడ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంది.
 
  పలు చోట్ల ఇలానే ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా మున్సిపల్ చైర్‌పర్సన్ పీఠాలను వక్రమార్గంలో టీడీపీ కైవసం చేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement