అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ

Published Fri, Nov 29 2013 3:07 AM

martyrs and sacrifince result of the Telangana

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: సంపూర్ణ తెలంగాణ ఇవ్వకుండా మోసం చేస్తే విద్యార్థులు సింహాల్లా మరోసారి గర్జించాలని తెలంగాణ జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. ప్రత్యేకరాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారని, వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంతో విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక జెడ్పీ గ్రౌండ్‌లో పాలమూర్ విద్యార్థి, యువగర్జన పేరుతో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ పోరాటంలో వి ద్యార్థుల పాత్ర కీలకమన్నారు. పాలమూరు వలస బతుకులు బాగుపడాలంటే, సీమాం ధ్రుల దోపిడీపోయి మన జీవితాలు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలన్నారు.
 
 హైదరాబాద్, భద్రాచలం, మునగాల ప్రాంతాలు తెలంగాణలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించారు. సంపూర్ణ తెలంగాణ సాధన ఇక్కడి ప్రజల ఆకాంక్ష అని అన్నారు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు. వచ్చే పార్లమెంట్ సమవేశాల్లో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని, లేనిపక్షంలో మరో సంగ్రామానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రుల ఒత్తిళ్లకు తలొ గ్గి తెలంగాణపై కిరికిరి పెడితే కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మద్దతు ఇస్తుందని స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణ బిల్లుకు మాత్రమే బీజేపీ ఓటు వేస్తుందని చెప్పారు. లేదంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తెలంగాణను ఇస్తామన్నారు.
 
 దొంగల చేతిల్లో తెలంగాణ పెట్టం
 విద్యార్థులు బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్, టీడీపీ దొంగల చేతిల్లో మాత్రం పెట్టేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర చైర్మన్ కరాటే రాజు అన్నారు. తెలంగాణ సాధనలో టీ.కాంగ్రెస్ నాయకుల పాత్ర ఏమిటో చెప్పాలని డిమాండ్‌చేశారు. తన నియోజకవర్గంలో తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న విద్యార్థుల శవాలను కనీసం పరామర్శించని కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తెలంగాణ తెచ్చాననడం ఎంతవరకు సమంజసమన్నారు. రెండుకళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్న పార్టీల నుంచి తెలంగాణ తమ్ముళ్లు బయటికి రావాలని కోరారు. అనంతరం టీపీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి, బీజేపీ నేత నాగూరావు నామాజీ, టీఆర్‌ఎస్ జిల్లా నేత అమరేందర్, టీజేఏసీ జిల్లా కన్వీనర్ రామకృష్ణగౌడ్ తదితరులు మాట్లాడారు.
 
 అలరించిన సాయిచంద్ ఆటాపాట
 విద్యార్థి గర్జనలో కళాకారుడు సాయిచంద్ పాడిన తెలంగాణ పాట అందరిని అలరించింది. తన పాటలతో విద్యార్థులను కట్టిపడేశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయా న్ని, ఎందుకు తెలంగాణ కావాలో విద్యార్థులకు తన పాటలతో వివరించారు. అంతకుముందు జ్యోతిరావుఫూలే, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీఎస్‌జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూన్నూర్వ్రి, శివకుమార్, భా స్కర్, నాని, మయూర్‌నాథ్,  భరత్, జేఏసీ నాయకులు సత్యనారాయణ, ఇంతియాజ్, వెంకటయ్య, బాల్‌కిషన్ పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement