విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. | Sakshi
Sakshi News home page

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

Published Thu, May 10 2018 12:48 PM

Massive Fire Accident At Autonagar In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ప్రఖ్యాత పారిశ్రామిక, ఆటోమొబైల్‌ కేంద్రం ‘విజయవాడ ఆటోనగర్‌’లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కానూరు రోడ్డులోని ఓ కూలర్ల కంపెనీలో ఉదయం 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు.. పక్కనున్న ఇంజన్‌ ఆయిల్‌ మిక్స్డ్‌ యూనిట్‌కు అంటుకున్నాయి. దీంతో అదుపుచేయలేనంత స్థాయిలో మంటల ఉధృతి పెరిగింది. ప్రస్తుతం పది ఫైరింజన్లలో మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

ప్రమాదం జరిగి రెండు గంటలవుతున్నా మంటలు అదుపులోకి రాలేదు. అగ్ని మాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. కలెక్టర్ లక్ష్మీ కాంతం, జాయింట్ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముడి ఆయిల్ పరిశ్రమకు మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. ఆయిల్ పరిశ్రమలో 100 పీపాల ఆయిల్ ఉండటంతో పీపాలు పేలుతున్నాయి. కానూరు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రమాద స్థలంలో దట్టమైన పొగ కమ్మేసింది.

ముందే వచ్చుంటే ఇంత ఘోరం జరిగేదికాదు..
కాగా, అగ్నిప్రమాద ఘటనలో అగ్నిమాపక సిబ్బంది తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 11:15కు మంటలు గుర్తించి ఫోన్‌ చేశామని.. అర గంట తర్వాతగానీ ఫైరింజన్‌ రాలేదని తెలిపారు. ‘‘మంటలు చిన్నగా ఉన్నప్పుడే ఫైరింజన్‌ వచ్చేదుంటే ఇంత ఘోరం జరిగేదేకాదు. వచ్చిన ఒక్క ఫైరింజన్‌ కూడా ఏమీ చెయ్యలేక, మరో నాలుగీటిని పిలిపించారు. అదృష్టవశాత్తూ కార్మికులు అందరూ బయటికి వచ్చేశారు’’ అని స్థానికులు చెప్పారు. అగ్నప్రమాదం కారణంగా ఆటోనగర్‌ ప్రాంతంమంతా దట్టమైన పొగ వ్యాపించి జనం ఇబ్బందులు పడ్డారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement
Advertisement