Sakshi News home page

ఆసుపత్రి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్

Published Wed, Sep 24 2014 11:53 PM

ఆసుపత్రి అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్

కర్నూలు(హాస్పిటల్):
 ‘‘కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో విశాలమైన స్థలం ఉంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలి.’’ అని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలోని సూపర్‌స్పెషాలిటీ మార్టన్ సమావేశ హాలులో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు ప్రభుత్వాసుపత్రి అప్‌గ్రేడ్‌కు హామీ ఇచ్చారన్నారు. ఆ దిశగా ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ వైద్య సేవా మౌలిక సదుపాయాల సంస్థ సంయుక్తంగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు. రోగులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకే ఆసక్తి చూపుతున్నారని.. అందువల్ల పెద్దాసుపత్రిలోనూ ఆధునికమైన పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆసుపత్రిలో వైద్యుల నియామకానికి చర్యలు చేపడతామన్నారు. రోడ్డు వెడల్పులో భాగంగా పోలీసు ఔట్‌పోస్టు, సెక్యూరిటీ రూంలను కూలగొట్టిన విషయాన్ని కమిటీ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. డీజీపీతో మాట్లాడి ఎస్పీఎఫ్ భద్రత కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు ఆసుపత్రిలో సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పందుల నియంత్రణకు ఆసుపత్రి చుట్టూ ప్రహరీ ఎత్తు పెంచి సోలార్ ఫెన్సింగ్ వేయిస్తామన్నారు. వేలాదిగా వచ్చే రోగులు, సహాయకులతో ఆసుపత్రి అస్తవ్యస్తంగా ఉంటోందని.. అందువల్ల ఇకపై గుర్తింపు కార్డులు జారీ చేస్తామని తెలిపారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చాలన్నారు. ఆసుపత్రి ఆవరణలో జీవనధార మందుల దుకాణం ఉన్నప్పటికీ వైద్యులు మందులను బయటకు రాస్తున్నారని.. ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఎన్‌టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, సీఎస్‌ఆర్‌ఎంఓలు శివప్రసాద్, ప్రవీణ్‌కుమార్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ జోజిరెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్లు కృష్ణానాయక్, జిక్కి, ఆసుపత్రి అడిషనల్ డెరైక్టర్ మోహన్‌ప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



 

Advertisement
Advertisement