మట్కా మళ్లీ హల్‌చల్! | Sakshi
Sakshi News home page

మట్కా మళ్లీ హల్‌చల్!

Published Sun, Jun 8 2014 2:27 AM

Matka show again!

జిల్లా వ్యాప్తంగా మట్కా మహమ్మారి ఊడలమర్రిలా విస్తరిస్తోంది. ఇన్నాళ ్లలాగా పొదల మాటున.. రహస్య స్థావరాల్లో.. కాలనీల శివార్లలో చీటీలు రాయడానికి స్వస్తి చెప్పేస్తున్నారు. వివిధ రకాల కంపెనీల పేర్లతో నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ హైటెక్ పద్ధతుల్లో మట్కా నడుపుతున్నారు.
 
 
 సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ ఇంటర్‌నెట్ కేంద్రాలను అడ్డాగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. తద్వారా పోలీసు శాఖకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో కొత్తకొత్త బీటర్లు కూడా పెద్ద సంఖ్యలో పుట్టొకొచ్చారు. ఆశకొద్దీ.. రే పో, ఎల్లుండో, ఏదో ఓ రోజు.. భారీ మొత్తం తగలక పోతుందా.. రూ.లక్షలు అందక పోతాయా.. అనే భ్రమలో పేదలు తమ బతుకుల్ని బుగ్గి చేసుకుంటున్నారు. వారు మట్కా వ్యసనాన్ని మానుకునేలా కౌన్సెలింగ్ ఇప్పించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు.
 
 అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : సామాన్యులు తమ రక్త మాంసాల్ని కరగదీసుకుని సంపాదిస్తున్న అరకొర ఆదాయాన్ని మట్కా నిర్వాహకులు కొల్లగొడుతున్నారు. రూ.లక్షలు కళ్లజూడచ్చనే ఆశతో వేలాది పేదల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఛిద్రమవుతున్నాయి. ఈ క్రమంలో బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ వ్యసనం నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. మరి ఈ హైటెక్ మట్కా గురించి పోలీసులకు తెలియదా.. అంటే తెలీదని అయితే చెప్పలేం. దీనిని నియంత్రించాల్సిన వారే.. ‘ఆ.. ఎక్కడ దొరుకుతారండీ వాళ్లు.. సెల్‌ఫోన్‌లలో రాస్తున్నార’ంటూ పరోక్షంగా వాస్తవాన్ని ఒప్పేసుకుంటున్నారు. అదే సమయంలో షరా‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని హిందూపురం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, ఉరవకొండ, గుత్తి, తదితర ప్రాంతాల్లో మట్కా జోరుగా సాగుతోంది.
 
 అనంతపురం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన తాడిపత్రి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ కాంప్లెక్స్ ఏరియా, విద్యుత్ నగర్ చౌరస్తా, పాతూరు నీలం థియేటర్ సమీపంలోని పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల ద్వారా మట్కా కార్యకలాపాలను బీటర్లు జోరుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రోజువారీ కోట్లాది రూపాయలు ప్రజల కష్టార్జితాన్ని పలు మట్కా కంపెనీ నిర్వాహకులు బీటర్ల ద్వారా దోచుకున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాల వద్ద స్పష్టమైన నివేదిక ఉన్నట్లు సమాచారం.
 
 నగరంలో వందల సంఖ్యలో బీటర్లు
 నగరంలో మట్కా నిర్వాహకులు వందల సంఖ్యలో బీటర్లను నియమించుకుంటున్నారు. ఆఖరుకు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను సైతం ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. వ్యసనాలకు బానిసలైన వారు చాలా సులభంగా ఆకర్షితులవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా దాడుల్లో బీటర్లు పట్టుబడినప్పటికీ.. నిర్వాహకుల జాడ కనుక్కునే దిశగా పోలీసుల దర్యాప్తు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘మేము మట్కా రాస్తేనే కదా... వారి చేతులు కూడా తడిసేదం’టూ బీటర్లే వ్యాఖ్యానిస్తున్నారు.
 
 పెద్దల్లా చెలామణి అవుతూ...
 ఒకప్పుడు పూట గడవడమే గగనమైన రోజుల్లో నగర వీధుల్లో చిన్నాచితకా బీటరుగా అవతారమెత్తిన అనేక మంది నేడు నగరంలో నిర్వాహకులుగా చెలామణి అవుతున్నారు. నగరంలో రూ.కోట్లకు పడగలెత్తిన ఆసాముల్లో కనీసం 10 మంది దాకా మట్కా నిర్వాహకులున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటుండడం విశేషం. ఇది కొందరు పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేరన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కాగా నగరంలో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో పాత బీటర్ల కనుసన్నల్లోనే మట్కా సాగుతున్నట్లు సమాచారం. అధికారులకు తెలిసినా.. ఎవరి వాటా వారికి అందుతుండడం వల్ల పట్టించుకోరన్న ఆరోపణలకు కొదువ లేదు. ఇప్పటికే పలు కాలనీల్లో పదుల సంఖ్యలో రహస్య కేంద్రాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది.
 
 ఇకపై దృష్టి సారిస్తాం
 ఇటీవలి కాలంలో మట్కా మళ్లీ విజృంభిస్తోందని వస్తున్న వార్తలు నిజమే. ఇన్నాళ్లూ ఎన్నికల బందోబస్తు కోసం ఎక్కువ మంది పోలీసులను వినియోగించాల్సి వచ్చింది. ఎన్నికలు ముగిశాక జిల్లాలో ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఈ దృష్ట్యా మట్కా కార్యక లాపాలపై దృష్టి సారించలేకపోయాం. ఇప్పుడిప్పుడే రాజకీయంగా పరిస్థితి అదుపులోకి వచ్చినందున మట్కా నిర్వాహకులు, బీటర్లపై దృష్టి సారిస్తాం.
 - బి.నాగరాజ, డీఎస్పీ, అనంతపురం
 

Advertisement
Advertisement