బాబుతో 15 మంది మంత్రుల ప్రమాణం? | Sakshi
Sakshi News home page

బాబుతో 15 మంది మంత్రుల ప్రమాణం?

Published Fri, Jun 6 2014 10:05 AM

బాబుతో 15 మంది మంత్రుల ప్రమాణం? - Sakshi

 *ప్రధాని  వస్తే  మాత్రం చంద్రబాబు ఒక్కరే.. మోడీ రాక అనుమానమేనంటున్న పార్టీ వర్గాలు
 
 హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఈ నెల 8న 10 నుంచి 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ  ఈ కార్యక్రమానికి హాజరైతే చంద్రబాబు ఒక్కరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. లేదంటే మంత్రులు కూడా పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు.

ప్రధాని రాక అనుమానమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తొమ్మిదో తేదీ ఉదయం పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగ కార్యక్రమానికి ఆయన తప్పక హాజరు కావాల్సి ఉండటమే దీనికి కారణం. మోడీ రానిపక్షంలో తనతోపాటు ఆరు నుంచి 15 మందికి తగ్గకుండా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం గౌతు శ్యామసుందర శివాజీ (శ్రీకాకుళం), పతివాడ నారాయణస్వామి నాయుడు(విజయనగరం), అయ్యన్నపాత్రుడు(విశాఖపట్నం), యనమల రామకృష్ణుడు(తూర్పు గోదావరి), పీతల సుజాత (పశ్చిమ గోదావరి), దేవినేని ఉమామహేశ్వరరావు (కృష్ణా), కోడెల శివప్రసాదరావు(గుంటూరు), సిద్ధా రాఘవరావు(ప్రకాశం), పి.నారాయణ (ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు), బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(చిత్తూరు), కేఈ  కృష్ణమూర్తి (కర్నూలు)లకు అవకాశం కల్పించనున్నారు.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యుల పదవీ స్వీకార ప్రమాణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ ముద్రించిన ఆహ్వానపత్రాల్లో కోరింది. మరోవైపు తాజాగా జరిగిన ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన, పోటీచేయని నేతలు చంద్రబాబు ముందు క్యూ కడుతున్నారు. పరాజితులైన గాలి ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, పోటీచేయని టీడీ జనార్దనరావు, కరణం బలరామకృష్ణమూర్తి వీరిలో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే  రేవంత్‌రెడ్డితో కలిసి పయ్యావుల కేశవ్ గురువారం రాత్రి బాబును కలిశారు.

 ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై సమీక్ష
 ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై చంద్రబాబు గురువారం సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జాస్తి వెంకట రాముడు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తదితరులు పాల్గొన్నారు.

 మనకు విద్యుత్ కష్టాలు తప్పవు: అధికారులు
 ఆంధ్రప్రదేశ్‌కు రానున్న కాలంలో విద్యుత్ కష్టాలు తప్పవని చంద్రబాబుకు ఇంధన శాఖ, ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై గురువారం ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉంటుందని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వీటీపీఎస్, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉందని, అదే సమయంలో గ్యాస్ ఆధారిత ప్లాంట్లకు గ్యాస్ లేదని తెలిపారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రత్యామ్నాయాలు తయారు చేయాల్సిందిగా చంద్రబాబు వారికి సూచించారు.
 
 చంద్రబాబుతో పారిశ్రామికవేత్తల భేటీ

 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పారిశ్రామిక అభివృద్ధి మండలి అధ్యక్షుడు జేఏ చౌదరి నేతృత్వంలో గురువారం రాత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో  రూ.5,600 కోట్లతో 12 రకాల పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. త్వరలో విజయవాడలో పెట్టుబడుల సమ్మిట్ ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement
Advertisement