వైద్యులు లేరు..వైద్యమూ అందదు | Sakshi
Sakshi News home page

వైద్యులు లేరు..వైద్యమూ అందదు

Published Thu, Oct 17 2013 3:54 AM

medical doctors will not get

కంఠేశ్వర్, న్యూస్‌లైన్ :జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు అందని ద్రాక్షగా మారాయి. మెడికల్ కళాశాల ప్రారంభమైతే మెరుగైన వైద్యం అందుతుందని భావించిన రోగులకు నిరాశే ఎదురవుతోంది. కళాశాల ప్రారంభమైనా వైద్యసేవల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదంటున్నారు. ఆస్పత్రికి ప్రతి రోజు అవుట్  పేషెంట్లు 628 మంది, ఇన్‌పేషెంట్లు 353 మంది వరకు వస్తున్నారు. కాగా వీరికి తగినంత మంది వైద్యులు అందుబాటులో లేరు. ప్రస్తుతం ఆస్పత్రిలో 16 మంది వైద్యులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరిలో నిపుణులైన సీనియర్ వైద్యులు అందుబాటులో లేరు. మెడికల్ కళాశాల ఏర్పాటు కాగా, నూతన భవనం నిర్మించిన ఆరు నెలల్లో రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో సంబంధిత అధికారులు పూర్తిగా  విఫలమవుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, ఆత్మహత్యాయత్నాలు, క్రిమిసంహారక మందు తాగిన కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. వీరికి అత్యవసర సేవలు అందించడానికి వైద్యసదుపాయాలు కూడా ఆస్పత్రిలో అందుబాటులో లేవని సంబంధిత వర్గాలే చెబుతున్నాయి. ఆస్పత్రి మొత్తానికి ఒకటే వెంటిలేటర్ ఉండడం గమనార్హం. 
 
 వెంటిలేటర్ల కొరతతో ప్రతి కేసును వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేస్తున్నారు. ఒక్క రోజులో 18 అత్యవసర కేసులు వస్తే వాటిలో 16 కేసులను రిఫరల్‌గా పంపిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద ఆస్పత్రి  ఉండి ప్రయోజనమేమంటూ రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి 46 వైద్య పోస్టులు ఉండగా, 16 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇందులో 11 మంది వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్‌పైనే దృష్టి సారిస్తారని ఆరోపణలు ఉన్నాయి. మార్పు పథకంలో భాగంగా ఆస్పత్రిలో ప్రతి రోజు  25 నుంచి 28 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. వీరికి సేవలు అందించేందుకు ఇద్దరే స్త్రీ వైద్యనిపుణులు ఉన్నారు. భవనంలోని మొదటి అంతస్తును ప్రసూతి వార్డుకు కేటాయించగా సరిపడా పడకలు లేకపోవడంతో బాలింతలకు నేలపైనే వైద్య సేవలు అందిస్తున్నారు.
 
 వేతనాలు పొందుతున్నా..
 మెడికల్ కళాశాలలో భాగంగా జిల్లాకు 106 మంది నిపుణులైన వైద్యులను డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యూకేషన్ కేటాయించింది. వీరు కళాశాలలో బోధనను చేపట్టి, అనంతరం ఆస్పత్రిలో రోగులకు వైద్యసేవలు అందించాల్సి ఉంటుంది. అయితే మే 17న కళాశాల ప్రారంభోత్సవానికి వచ్చిన వైద్యులు ఇప్పటి వరకు పత్తాలేకుండా పోయారు.వీరికి నెలకు వేతనాలు మాత్రం సక్రమంగానే అందుతున్నాయి. ఈ వ్యవహారాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మెడికల్ కళాశాల వైద్యులు ఆస్పత్రికి రావాలంటూ సూపరింటెండెంట్ పలుమార్లు ప్రిన్సిపాల్‌ను కోరినా ఏమాత్రం పట్టించుకోలేదని అంటున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదాలు కూడా జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. 
 
 ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహణకు సంబంధించి వరంగల్‌లోని కాకతీయ కళాశాల నుంచి ప్రొఫెసర్‌ను ఇక్కడికి  కేటాయించారు. ఆ వైద్యుడు ఇప్పటి వరకు ఆస్పత్రిలో అడుగుపెట్టలేదు. ప్రస్తుతం పెరిగిన రోగుల సంఖ్యకు అనుగుణంగా 180 మంది స్టాఫ్‌నర్సులు, 230 మంది 4వ తరగతి ఉద్యోగులు, 16 మంది ఏఎన్‌ఎంలు, 10 మంది ఫార్మసిస్ట్‌లు, 16 మంది అటెండర్‌లు అవసరం ఉండగా ఆ సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో మిగతా వారిపై పని ఒత్తిడి పెరుగుతోంది. ఫలితంగా రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎనిమిది అంతస్తులు ఉన్న ఆస్పత్రి భవనం లిప్టు పనిచేయక పోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణ అపరిశుభ్రంగా మారింది. ఆస్పత్రికి డీసీహెచ్‌ఎస్, సూపరిండెంట్, ఆర్‌ఎంవో వంటి ఉన్నతాధికారులు కూడా ఇన్‌చార్జిలే ఉండడంతో పరిపాలన అదుపుతప్పింది. ఉన్నతాధికారులు తగిన శ్రద్ధపెడితేకాని పరిస్థితి మారే విధంగా లేదు. గురువారం ఆస్పత్రి పనితీరుపై అన్ని విభాగాల ఇన్‌చార్జిలతో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశం తర్వాతనైనా ఆస్పత్రి పనితీరు మెరుగుపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement
Advertisement