గ్రిగ్ మెమోరియల్ పోటీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

గ్రిగ్ మెమోరియల్ పోటీలు ప్రారంభం

Published Fri, Dec 27 2013 1:16 AM

Memorial grig start competitions

గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : పోటీతత్వంతో ఆడి విజయం సొంతం చేసుకోవాలని గుడివాడ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి జి.వెంకటేశ్వరరావు సూచిం చారు. కృష్ణాజిల్లా సెకండరీ పాఠశాలల 77వ గ్రిగ్ మెమోరియల్ బాలికల సబ్‌జోన్ క్రీడలు గురువారం స్థానిక మాంటిస్సోరి పాఠశాల ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ క్రీడలను ఉప విద్యాశాఖ అధాకారి జి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

ఈ క్రీడల్లో డివిజన్‌లోని 60పాఠశాలలకు చెందిన 650మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఉపవిద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, పాఠశాల పతకాన్ని మండల విద్యాశాఖ అధికారి ఆర్.వి.సోమశేఖరరావు, క్రీడాపతకాన్ని మాంటిస్సోరి విద్యాసంస్థల కరస్పాం డెంట్ బొప్పన రాజేశ్వరి  ఎగురవేశారు. అనంతరం డీవైఈవో మాట్లాడుతూ పోటీతత్వం ఉంటేనే విజయాలను సులభంగా అంది పుచ్చుకోవచ్చన్నారు. ఎంఈవో ఆర్.వి.సోమశేఖరరావు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు.

పెదపారుపూడి ఎంఈవో హనుమంతరావు మాట్లాడుతూ ఒకప్పుడు బాలురకే పరిమితమైన ఆటలను నేడు బాలికలు కూడా ఆడి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించడం అభినందనీయమన్నారు. పట్టణ ప్రముఖులు బొగ్గారపు తిరపతయ్య, మహిళా సంఘం కార్యదర్శి వి.లక్ష్మి, వైస్ ప్రెసిడెంట్లు వి.శారద, జాస్తి రాజ్యలక్ష్మి, పాఠశాల ప్రధానోసపాధ్యాయుడు ఎన్.ఎస్.ప్రసాద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
 
విజేతల వివరాలు
 
తొలి రోజు కబడ్డీ జూనియర్స్ విభాగంలో ఏపీజేఆర్‌సీ నిమ్మకూరు, గుడివాడ ఫాదర్ బియాంకి స్కూల్ విద్యార్థులు తలపడ్డారు. ఏపీజేఆర్‌సీ నిమ్మకూరు జట్టు ఫైనల్స్‌కు చేరింది. బాల్‌బ్యాడ్మింటన్ జూనియర్స్ విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ కలిదిండి, జెడ్పీహెచ్‌ఎస్ దోసపాడుతో తలపడగా కలిదిండి ఫైనల్స్‌కు చేరింది. ఖోఖో సీనియర్స్ విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్ కలిదిండి, బొమ్మినింపాడులు తలపడగా బొమ్మినింపాడు విద్యార్థులు ఫైనల్‌కు చేరారు.
 
బందరు డివిజన్ బాలికల ఆటలపోటీలు ప్రారంభం

 చల్లపల్లి : చల్లపల్లి ఎస్‌ఆర్‌వైఎస్‌పీ జూనియర్ కళాశాల ఆవరణలో బందరు డివిజన్‌స్థాయి 77వ గ్రిగ్‌మెమోరియల్ బాలికల ఆటలపోటీలు గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ టి.సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు పోటీపడాలని సూచించారు.  
 
హోరాహోరీగా పోటీలు
 
బందరు డివిజన్‌లోని మచిలీపట్నం అర్బన్, రూరల్, గూడూరు, పెడన, మొవ్వ, ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలకు చెందిన 500 మందికి పైగా క్రీడాకారులు పలు క్రీడల్లో పోటీపడుతున్నారు. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బాల్‌బ్యాడ్మింటన్, సాఫ్ట్‌బాల్, త్రోబాల్, టెన్నికాయిట్, షటిల్ విభాగాల్లో హోరాహోరీగా తలపడ్డారు. అండర్-14, 17 విభాగాల్లో రెండు రోజులపాటు ఈ పోటీలు జరుగనున్నాయి. 11 మండలాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనటంతో ఈ ప్రాంతం పండుగ వాతావరణం నెలకొంది. ఆయా మండలాల నుంచి 60మందికిపైగా పీడీ, పీఈటీలు ఈ పోటీలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement