దోస్త్ మేరా దోస్త్ | Sakshi
Sakshi News home page

దోస్త్ మేరా దోస్త్

Published Fri, Mar 28 2014 1:25 AM

దోస్త్ మేరా దోస్త్ - Sakshi

  • మైనార్టీలను మనసారా ప్రేమించిన మహానేత
  •      ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతం
  •      అచ్చమైన మిత్రత్వానికి ప్రతిరూపం
  •      ఎన్నో ప్రయోజనాలు.. సంక్షేమ పథకాలు
  •         స్వార్థానికి వాడుకున్న మిగిలిన నేతలు
  •   విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సంకుచిత రాజకీయాలకు అతీతంగా వ్యవహరించిన ఉదాత్తుడిగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మైనార్టీల, ప్రత్యేకించి ముస్లిముల అభ్యున్నతి విషయంలోనూ ఆయన ఈ ఔదార్యాన్ని, ఈ చిత్తశుద్ధిని కనబరిచారు. అందుకే ఆయన నేటికీ ముస్లిముల గుండెల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్నారు.

    మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకునే స్వార్థ రాజకీయాలకు అతీతంగా ఆయన వారికి మేలు చేయాలని తపించారు. వరాల జల్లులు కురిపించి, తర్వాత వారిని పక్కన పెట్టే కుయుక్తిపరులకు భిన్నంగా వారి అభ్యున్నతికి కృషి చేశారు. అయితే ఆయన మరణం తర్వాత కథ మొదటికొచ్చింది. ముస్లిముల సంక్షేమం మళ్లీ తెరమరుగైంది.

    ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలకు పాలకులు గోరీ కట్టారు. విద్య, ఉద్యోగం, వృత్తి నైపుణ్యం అవకాశాలను మెరుగుపర్చే కార్యక్రమాలను మధ్యలోనే నిలిపివేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 42,43,570 మంది జనాభా ఉండగా ఇందులో 75,981 మంది ముస్లింలు ఉన్నారు. మైనార్టీ జనాభా శాతం పెరుగుతున్నా.. వారి సంక్షేమానికి అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించడం లేదు. దీంతో అన్నింటా మైనార్టీ వర్గాల వారు వెనుకబడిపోతున్నారు.
     
    గుండెల నిండా సంక్షేమం
     
    మైనార్టీల సంక్షేమం కోసం వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక కార్యక్రమాలను చేపట్టారు. ప్రధానంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల కల్పనకు శ్రీకారం చుట్టారు. మైనార్టీల విద్య, ఉపాధి కల్పనకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో ముస్లింల పరిస్థితి దారుణంగా ఉండేది. చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమం కోసం ఒక పథకాన్ని కూడా ప్రారంభించలేకపోయారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక వారికి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్, సబ్సిడీ రుణాలు, నిరుద్యోగ యువతకు శిక్షణ కార్యక్రమాలు, ఉన్నత విద్యావకాశాలకు హాస్టళ్లు కల్పించారు.
         
    ముస్లిం నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల్లో ఉచితంగా శిక్షణనిచ్చేందుకు స్టడీ సర్కిల్‌ను 2005లో జిల్లాకు మంజూరు చేశారు.
         
    బీచ్ రోడ్డులో ఉన్న ఈ స్టడీ సర్కిల్‌లో విశాఖ,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మైనార్టీలు శిక్షణ పొందుతున్నారు.
         
    పదో తరగతి తరువాత మైనార్టీ పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించడానికి వీలుగా మైనార్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్‌ను జిల్లాలో 2007లో జూలై 16న గాజువాక అజీమాబాద్ ప్రాంతంలో ప్రారంభించారు.
         
    వైఎస్ మరణం తరువాత స్టడీ సర్కిల్  విద్యార్థుల కోసం హాస్టల్ సదుపాయం కల్పించాలని మైనార్టీ యువతీ, యువకులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఏ ఒక్కరు పట్టించుకున్న పాపానపోలేదు.
     
    ఏటా తగ్గుతున్న రుణ లక్ష్యాలు
     
    నిరుద్యోగ మైనార్టీల ఉపాధి కోసం సబ్సిడీపై రుణాలు మంజూరు చేసే పథకాన్ని వైఎస్ ప్రారంభించారు. ఆయన మరణం తరువాత రుణ లక్ష్యం గానీ, లబ్ధిదారుల సంఖ్యలో గానీ ప్రగతి కానరాలేదు. 2008లో 101 మందికి రుణాలు లక్ష్యంగా నిర్దేశించి అందించగా ఆయన మరణం తరువాత 2009-10లో ఒక్కరికి పైసా కూడా ఇవ్వలేదు. వైఎస్ ప్రారంభించిన పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందించే విషయంలో మైనార్టీ విద్యార్థులపై ప్రభుత్వాలు చిన్నచూపుచూస్తున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో పూర్తిగా ఎగనామం పెట్టేశారు. సబ్సిడీలు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు.. ఇలా అడుగడుగునా పాలకులు అన్యాయమే చేస్తున్నారు.

Advertisement
Advertisement