ధాన్యం రైతులకు వ్యాపారి కుచ్చుటోపీ | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతులకు వ్యాపారి కుచ్చుటోపీ

Published Wed, May 13 2015 4:26 AM

merchant cheated grain farmers

నరసరావుపేటటౌన్ : అధిక వడ్డీల ముసుగులో కోట్లుతో ఉడాయించిన ప్రైవేట్ చిట్స్ వ్యాపారి ఉదంతం మరువకముందే రైతుల నుంచి సేకరించిన లక్షలాది రూపాయల విలువైన ధాన్యానికి డబ్బు చెల్లిచకుండా దివాళా తీసిన వ్యాపారి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పట్టణానికి చెందిన సుమారు పదిమంది ధాన్యం బ్రోకర్లు, మరి కొందరు రైతుల వద్దనుంచి సుమారు రూ.1కోటి మేరకు ధాన్యాన్ని కొనుగోలుచేసిన నిజామాబాద్ వ్యాపారి డబ్బు చెల్లించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి తాను దివాళా తీసినట్లుగా వారికి నోటీసులు పంపించారు.

దీంతో బాధితులు గగ్గోలు పెడుతూ డీఎస్పీ కేసీ వెంకటయ్యను మంగళవారం ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే..తెలంగాణ  రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన కనకదుర్గ ప్యాడీ క్యాన్వాసింగ్ నిర్వాహకులు చీదుర శ్రీనివాస్, కోటగిరి రాజశేఖర్‌లు స్థానిక బ్రోకర్ల సాయంతో రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యంనకు సంబందించి నరసరావుపేటకు చెందిన ధాన్యం బ్రోకర్లు దేవిశెట్టి రామయ్యకు రూ.33.90లక్షలు, నార్ల లక్ష్మణరావుకు రూ.17.30లక్షలు, సాంబశివరావుకు రూ.4.50లక్షలు, గుడివాడ సాంబకు రూ.15లక్షలు, పొట్టి వెంకటసత్యనారాయణకు రూ.5.50లక్షలు, ఎన్.వెంకటప్పారావుకు రూ.6.60లక్షలు ఇవ్వాల్సి ఉంది.

వీటితో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతుల వద్ద ధాన్యాన్ని నేరుగా కొనుగోలుచేసి వారికి లక్షలాది రూపాయలు చెల్లించాల్సి ఉంది. అయితే వీరివద్ద మూడు నెలల క్రితం ధాన్యం కొనుగోలుచేసి డబ్బు ఇవ్వడంలో కాలయాపన చేస్తుండటంతో బాధితులు నిజామాబాద్‌లోని కనకదుర్గ ప్యాడీ కార్యాలయం వద్దకు వెళ్లగా అసలు విషయం బయట పడింది. అప్పటికే వారు దివాళా తీసి అక్కడి స్థానిక వ్యాపారులు, రైతులకు డబ్బు ఎగ్గొట్టి పరారైనట్లు తెలిసింది.

దీంతో మోసపోయిన బాధితుల్లో ఒకరు గుడివాడ సాంబ పదిరోజుల క్రితం ఒన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఇప్పటికే చంద్రశేఖర్‌ను అరెస్టు చేశారు. మిగిలిన బాధితుల్లో రైతులు తాజాగా రూరల్ పోలీసులను ఆశ్రయించారు.  అజ్ఞాతంలో ఉన్న చీదుర శ్రీనివాస్ రూ.1.24కోట్లకు బ్రోకర్లు, రైతులకు ఇవ్వాల్సిన బాకీలను చూపిస్తూ దివాళా పిటిషన్‌కు చెందిన నోటీసులను రంగారెడ్డి జిల్లా కోర్టు ద్వారా పంపించారు. వీటిని అందుకున్న బాధితులు లబోదిబోమంటూ డీఎస్పీ కేసీ వెంకటయ్యను కలిసి న్యాయం చేయాలని కోరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement