రూ. 100 కోట్లతో ‘మెట్రోపొలిస్’ పనులు: మేయర్ | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్లతో ‘మెట్రోపొలిస్’ పనులు: మేయర్

Published Wed, Feb 12 2014 12:14 AM

Metropolis conference  works with Rs 100 crores

సాక్షి, హైదరాబాద్: నగరంలో రానున్న అక్టోబర్‌లో జరగనున్న మెట్రోపొలిస్ సదస్సును పురస్కరించుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వసతుల కల్పన, తదితరాల కోసం జీహెచ్‌ఎంసీ నిధుల నుంచి రూ. 100 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు మేయర్ మాజిద్ హుస్సేన్ తెలిపారు.

 60 దేశాల్లోని 136 నగరాల నుంచి 2వేల మంది ప్రతినిధులు హాజరుకానున్న సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు  చెప్పారు. మెట్రోపొలిస్ సదస్సు ఏర్పాట్లను పరిశీలించేందుకు నగరానికి వచ్చిన మెట్రోపొలిస్ ప్రతినిధులతో కలిసి  మంగళవారం బంజారాహిల్స్‌లోని ఓ స్టార్ హోటల్‌లో మీడియా సమావేశంలో మేయర్ మాట్లాడారు. జీవ వైవిధ్య సదస్సు (సీఓపీ) అనంతరం నగరంలో మరో భారీ అంతర్జాతీయ సదస్సు జరగనుండడం నగరవాసులకు గర్వకారణమన్నారు.

 హైదరాబాద్ సంస్కృతీ సంప్రదాయాలు, జీవన వైవిధ్యం, నగరీకరణ తదితర  అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సదస్సుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు మెట్రోపొలిస్ ప్రతినిధులు (సెక్రటరీ జనరల్ అలైన్ లెసాస్, కంట్రీ డెరైక్టర్ సునిల్‌దుబే, ఆసియా రీజినల్ మేనేజర్ అజయ్‌సూరి) తెలిపారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ, ‘సిటీస్ ఫర్ ఆల్’  థీమ్‌తో జరగనున్న ఈ సదస్సులో మరో నాలుగు సబ్‌థీమ్స్ ఉన్నాయన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు రోనాల్డ్‌రాస్, అలీంబాషా తదితరులు పాల్గొన్నారు.

 అనంతరం మెట్రోపొలిస్ ప్రతినిధులు  సచివాలయంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మహీధర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీలు సమీర్‌శర్మ, ఎస్‌కె జోషిలను కలిశారు. రాష్ట్రప్రభుత్వం రైతులు,  మహిళ ల కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి మంత్రి వారికి వివరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement