పొంచి ఉన్న పాలసంక్షోభం | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న పాలసంక్షోభం

Published Mon, Dec 16 2013 2:36 AM

milk crisis may expect soon

పర్చూరు, న్యూస్‌లైన్:
 పాడి పరిశ్రమ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. పశుపోషణ భారమై పాల ఉత్పత్తి ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో పాడి పశువులను అమ్ముకుంటున్నారు. వేసవితో పోలిస్తే పాల ఉత్పత్తి కొంత పుంజుకున్నా..గతేడాది ఇదే సమయానికి జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలకు, ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పాలకు మధ్య 20 శాతం వ్యత్యాసం కనిపిస్తోంది. దాణా ధరలు విపరీతంగా పెరగడం, పాల సేకరణ ధరలు ఖర్చులకు తగినట్లు పెంచకపోవడం ఇందుకు ప్రధాన కారణమని పశుపోషకులు పేర్కొంటున్నారు. జిల్లా డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీల్లో కలిపి ప్రస్తుతం సుమారు 3 లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నట్లు అంచనా. పది శాతం వెన్న ఉన్న గేదె పాలను జిల్లా డెయిరీకి అనుబంధంగా నడిపే పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా లీటరు 44కు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు డెయిరీలైతే * 46 చెల్లిస్తున్నాయి.  
 
 పశువైద్యం గగనం...
 ప్రభుత్వ పశువైద్యశాలల్లో సీజనల్ వ్యాధులకు సకాలంలో వైద్యం అందడం గగనమైంది. గ్రామాల్లో తెలిసీ తెలియని వైద్యం చేస్తున్న వ్యక్తుల కారణంగా పశువుల్లో మరణాల శాతం అధికమైంది. పశుసంవర్థక శాఖ అధికారులు మొక్కుబడిగా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ మమ అనిపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పర్యవేక్షణ కొరవడింది. ప్రభుత్వాస్పత్రుల్లో లైవ్‌స్టాక్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క ఒంగోలు డివిజన్‌లో లైవ్‌స్టాక్ ఆఫీసర్లు మూడు పోస్టులు, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ పోస్టులు ఐదు ఖాళీగా ఉన్నాయి. దీనికితోడు పశువైద్యశాల భవనాలు చాలాచోట్ల శిథిలావస్థకు చేరాయి. నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులో పశువుల ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. రైతులు సమకూర్చిన భవనంలో తాత్కాలికంగా పశువైద్యశాల నిర్వహిస్తున్నారు. వీరన్నపాలెంలో పశువైద్యశాలకు నిధులు మంజూరైనా నిర్మాణం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో చాలాచోట్ల పరిస్థితి ఇలానే ఉంది.
 
 రైతులకు దక్కేది తక్కువే...
 పశువైద్యం పరిస్థితి ఇలా ఉంటే రైతుల వద్ద తక్కువ ధరకు పాలను సేకరిస్తూ ఎక్కువ ధరకు విక్రయించేందుకు డెయిరీలు మొగ్గుచూపుతున్నాయి. రైతుల వద్ద వెన్నశాతం ఆధారంగా పాలు కొనుగోలు చేసే పాలసేకరణ కేంద్రాలు వినియోగదారులకు మాత్రం నిర్దేశించిన ధరకు విక్రయిస్తుంటారు. ఉదాహరణకు పది శాతం ఉన్న పాలకు మాత్రమే లీటరుకు * 44 చొప్పున అందజేస్తారు. సాధారణంగా రైతులు కేంద్రాలకు తెచ్చే పాలల్లో సరాసరి వెన్న 7-8 శాతం వరకు మాత్రమే ఉంటుంది. వెన్న శాతం ప్రకారం రైతులకు ధర చెల్లిస్తారు. కేంద్రాల్లో పాలు కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం వెన్నశాతంతో పనిలేకుండా లీటరు * 44 విక్రయిస్తారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమపై ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతమాత్రంగానే ఉంది. పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో పాడి రైతులకు లీటరు * 4, తమిళనాడులో లీటరుకు * 2 చొప్పున ప్రభుత్వాలు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నాయి. మన రాష్ట్రంలో ఈ తరహా విధానం లేకపోగా..వ్యవసాయం మాదిరిగా వడ్డీలేని రుణాలు ఇస్తున్న దాఖలాలు కూడా లేవు. గత నాలుగైదేళ్లలో పాడిపరిశ్రమ కోసం ప్రవేశపెట్టిన ఒక్క పథకం కూడా సక్రమంగా అమలుకు నోచుకోలేదు.
 
 జిల్లాను ముంచెత్తుతున్న కల్తీపాలు:
 ఇక్కడ కల్తీ అవుతున్న పాలు తక్కువగానే ఉన్నా..ఇతర జిల్లాల నుంచి వస్తున్న కల్తీపాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ పర్యవేక్షణ లేదు. తనిఖీలు నిర్వహించిన దాఖలాలూ లేవు. ఏవి అసలు..ఏవి నకిలీ అని నిర్ధారించే పరిస్థితి లేదు. దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతినడంతో పాటు పాడిపరిశ్రమ కుంటుపడుతోంది.  
 
 ప్రస్తుతం డెయిరీఫామ్‌లు నష్టాల్లో నడుస్తుంటే..2, 3 గేదెల పోషణ కూడా రైతులకు భారమైంది. దీంతో పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. గేదెల్ని కొనేవారు కూడా ముందుకు రావడం లేదు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే గతేడాది * 40 వేలు పలికిన పాడిగేదెలను ప్రస్తుతం * 30 వేలకు సైతం కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు.  వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయంగా రైతులను ఆదుకుంటున్న పాడిపరిశ్రమ కనుమరుగయ్యే పరిస్థితుల నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Advertisement
Advertisement