ఇక మినీ గ్యాస్‌ సిలిండర్లు | Sakshi
Sakshi News home page

ఇక మినీ గ్యాస్‌ సిలిండర్లు

Published Mon, May 1 2017 1:04 PM

ఇక మినీ గ్యాస్‌ సిలిండర్లు - Sakshi

► ఏజెన్సీవాసులకు ఉచితం
► మైదాన ప్రాంతాల్లో దీపం కనెక్షన్లు
► జూన్‌ 1 నుంచి పంపిణీకి చర్యలు

సాక్షి, విశాఖపట్నం: త్వరలో ఐదు కేజీల మినీ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యం గా  14.2 కిలోల గ్యాస్‌ íసిలిండర్‌ సరఫరా చేసేం దుకు వీలులేని ఏజెన్సీ ప్రాంతాల్లో వీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. బుకింగ్‌లు.. డెలివరీల కోసం గ్యాస్‌ ఏజెన్సీలతో పనిలేకుండా వీటిని రేషన్‌ డీలర్ల ద్వారా సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. జీవీఎంసీతోపాటు గ్రామీణజిల్లాలో గ్యాస్‌ లేని వారికి దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ దిశగా అర్హుల ఎంపిక ప్రక్రి య కూడా వేగంగా జరుగుతోంది. జూన్‌ 1వ తేదీ నుంచి పంపిణీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు.

గతేడాది నిర్వహించిన ప్రజాసాధికారిత సర్వే ప్రకారం జిల్లాలో 2.81లక్షల మందికి గ్యాస్‌ కనెక్షన్లు లేవు. అదే విధంగా రేషన్‌ షాపుల్లో డిజిటల్‌ కీ రిజిస్టర్‌ ద్వారా కూడా గ్యాస్‌ కనెక్షన్‌ లేని వారు 2.61లక్షల మందని లెక్క తేలింది. దీంతో రెండు సర్వేల జాబితాల ఆధారంగా మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివరాలు సేకరించారు.

గ్యాస్‌ కనెక్షన్లులేని వారు 2.64 లక్షల వరకు ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. వీరిలో 1.65 లక్షల మంది ఏజెన్సీ ప్రాంతంలోనే ఉన్నట్టుగా గుర్తించారు. మరో 99 వేల మంది జీవీఎంసీతోపాటు గ్రామీణ జిల్లాలో ఉన్నట్టుగా లెక్కతేల్చారు.

గ్రామసభల్లో అర్హుల ఎంపిక
అర్హుల ఎంపిక కోసం గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల ద్వారా 60 వేల మంది నుంచి దరఖాస్తతు కూడా తీసుకున్నారు. గతంలో మరో 50 వేలమంది నుంచి అప్లికేషన్స్‌ స్వీకరించారు. మిగిలిన వారి నుంచి కూడా ఈ నెలాఖరులోగా దరఖాస్తులు స్వీకరణ పూర్తి చేసి జూన్‌ 1వ తేదీ నుంచి కనెక్షన్ల మంజూరు చేపట్టాలని నిర్ణయించారు.

ట్రైబల్‌ ప్యాకేజీ కింద జిల్లాకు ఐదు కోట్లు
ఏజెన్సీప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలన్న తలంపుతో మన రాష్ట్రానికి కేంద్రం రూ.30 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.ఈ మొత్తంలో రూ.ఐదు కోట్లు మన జిల్లాకు మంజూరయ్యాయి. ఈ మొత్తంతో ఏజెన్సీలో సాచురేషన్‌ పద్ధతిలో ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలని జిల్లాయంత్రాంగం తలపోసింది. 14.2 కేజీల గ్యాస్‌ సిలెండర్‌ కొండ ప్రాంతాలకు తీసుకెళ్లడం సమస్యగా ఉండడంతో ఐదు కేజీల గ్యాస్‌ సిలెండర్‌ ఏజెన్సీ వాసులకు ఇవ్వాలని నిర్ణయించారు.

ట్రైబల్‌ ప్యాకేజీలో వీరికి గ్యాస్‌ కనెక్షన్, రెగ్యులేటర్, సిలెండర్, స్టౌ అన్నీ ఉచితంగా ఇవ్వనున్నారు. ఎప్పుడు గ్యాస్‌ అయిపోతే అప్పుడు ఎలాంటి బుకింగ్‌ జంజాటాలు లేకుండా సిలెండర్‌ తెచ్చుకునేందుకు వీలుగా ఏజెన్సీల్లోని జీసీసీ డీపోలు, రేషన్‌షాపుల ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ప్లెయిన్, సిటీ పరిధిలో గ్యాస్‌ క¯ðనెక్షన్‌ లేని వారికి దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ ఇవ్వనున్నారు.ఇక్కడ మాత్రం కనెక్షన్‌తోపాటు 14.2 కేజీల గ్యాస్‌ సిలెండర్‌ ఇవ్వనున్నారు.

అడిగిన ప్రతి ఒక్కరికీ గ్యాస్‌ కనెక్షన్‌
అడిగిన ప్రతి ఒక్కరికి గ్యాస్‌ కనెక్షన్‌ ఇస్తాం. సర్వేలాధారంగా గ్యాస్‌ కనెక్షన్‌ లేనివారిని గుర్తించాం. వారికి ట్రైబల్‌ ప్యాకేజీ ద్వారా ఏజెన్సీలోనూ, దీపం పథకం కింద ప్లైయిన్‌ ఏరియాలోనూ గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తాం. అడిగిన దీపం పథకంలో కనెక్షన్‌తో పాటు స్టౌ విధిగా తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. అలా ఒత్తిడి చేసే డీలర్లపై చర్యలు తప్పవు.   – జి.సృజన, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌

Advertisement
Advertisement